Friday 2 October 2020

జీవనయాత్ర-సామాజిక పద్య ప్రబంధము

 

శ్రీరామ

(ప్రజ –పద్యం వారి ప్రోత్సాహంతో)

జీవనయాత్ర

(సామాజిక పద్యకృతి)

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతా ప్రార్థన:

ఉ.        

శ్రీయుత వేంకటేశ్వరుడు చిన్మయు డాయత భక్తి యుక్తులై

శ్రేయము లందగా తనను జేరెడు మానవకోటి కెప్పుడున్

స్వీయకృపాకటాక్షములు విస్తృతరీతిని బంచువాడు తా

నీయెడ శబ్ద సంతతుల నిచ్చుచు నన్ గృపజూచు గావుతన్           1.

ఉ.        

స్వాదుఫలంబులున్ వివిధ పత్రము లర్పణ చేసి నిష్ఠతో

మోదక రాశితో నిలిచి మ్రొక్కినవారల సర్వవిఘ్నముల్

ఛేదన చేసి యంతటను క్షేమము లిచ్చు గణాధిపుండు నన్

మోదభరాంతరంగుని  నమోవచః పరిపూర్ణు జేయుతన్.             2.

చ.        

చదువులతల్లి నా రసన సభ్యవచస్సుల కాలవాలమై

సదమలభావముల్ హృదిని సాగువిధంబున జూచుచుండి యి

య్యదనున వత్సలత్వమున నాశిషమిచ్చుచు నాకు నండయై

ముద మొదవంగ నిచ్చట సమున్నత సత్త్వము గూర్చు గావుతన్.    3.

పూర్వ కవి ప్రశంస

చ.        

తెలుగు కవిత్వరంగమున దిట్టలుగా యశమంది స్రష్టలై

వెలుగుచు సత్కృతుల్ సలుపు విజ్ఞుల నన్నయ తిక్కనాదులన్,

దలచిన కావ్యసంమును దారిడు మార్గము నంది పల్కుచున్

నిలిచిన సత్కవీంద్రులను నేను స్మరించెద సన్నుతించుచున్.         4.

గురుస్మరణ

శా.        

విద్యాదానము చేసి నిండు మదితో విజ్ఞానముం బంచుచున్

సద్యస్స్ఫూర్తిని నేర్పి ప్రేమమయులై సంస్కారముం దెల్పువా

రుద్యద్భానులు “ముళ్ళపూడి గురువుల్” యోగీంద్రసంకాశు లా

విద్యామూర్తుల కంజలింతు నిపు డీవేళన్ వినమ్రుండనై.                 5.

మాతాపితృవందనము

మ.       

అరుదౌ జన్మము నందజేసి నిరతం బత్యంత హర్షంబునన్

సరణుల్ నేర్పుచు వత్సలత్వగరిమన్ సద్భాగ్య మందించు నా

హరివంశాభ్యుదయ ప్రశస్తవిభవం బార్జించి యున్నట్టి వా

రిరువుర్ నా తలిదండ్రు లఘ్ఘనుల నే నిప్పట్టునన్ గొల్చెదన్.           6

****************************************************

కవివంశము

మ.

వరమౌ శుద్ధజలామృతంబు తనలో వాత్సల్యసంపూర్ణయై

ధరపై బంచగ దాల్చు "కృష్ణ" నదులన్ దథ్యంబుగా శ్రేష్ఠ యా

సురగంగానిభ పారుసత్తటముపై శోభిల్లు గ్రామంబు సు

స్థిర"సంగళ్ళపురంబు" "పాలె"మనగన్ శ్రేయఃప్రదం బన్నిటన్.        7.

శా.

ఆ పాలెంబున భూసురాన్వయమునం దత్యంత సత్కీర్తికిన్

బ్రాపైనట్టి నుండు "కోటయ" మహద్బ్రహ్మణ్యు డవ్వానికిన్

దీపిల్లెన్ సుతు "డన్నయార్యుడు" లసత్తేజోమయుం డాతడై యా

"పేరాంబ" కుటుంబినీవిభవయై యందన్ మహద్భాగ్యముల్.           8.

తే.గీ.

"అన్నయార్యున"కా "దుర్గమాంబ"యందు

"వేంకటేశ్వరవర్యుండు" విజ్ఞమతిగ

ఖ్యాతినందిన పుణ్యాత్ము డాత డొదవె

స్మార్తమణియయి సర్వత్ర కీర్తి గాంచె.                                      9.

శా.

సారోదంచిత సద్గుణప్రకరయై "సామ్రాజ్యలక్ష్యంబ"యై

ధీరోదాత్తమనఃప్రభావయుతయై దీప్తిన్ సదా గాంచు నా

నారీరత్నము ధర్మపత్ని యగుచున్ నవ్యానురాగమ్ముతో

జేరం గాంచెను "వేంకటేశ్వరుడు"సౌశీల్యాఢ్య సంతానమున్.           10.

వ.

ఆ పుణ్యదంపతులైన "శ్రీమద్వేంకటేశ్వరశర్మ, సామ్రాజ్య లక్ష్మ్యంబలకు" "అన్నయ్యశాస్త్రి, వీరభద్రశర్మ, వేంకటభానువరప్రసాదు, వేంకటసత్యనారాయణమూర్తి"యనువారలు కుమారులు కాగా, అన్నపూర్ణ విశాలాక్షి, శకుంతల, సీత" యనువారలు కుమార్తెలై శుభంబులు గాంచుచుచుండిరి. వీరుంగాక బాల్యమునందుననే గతించిన వారలగు బాలికలు మువ్వు రన్యులునుం గలరు.                                              11.

తే.గీ.

పరమ సాధ్వీమతల్లియై ధరను వెల్గి

నట్టి "సామ్రాజ్యలక్ష్మ్యంబ"కష్టమ మగు

గర్భమున నేను జన్మంబు గాంచినాడ

వినతు లొనరింతు జననికి జనకునకును.                                  12.

తే.గీ.

"సత్యనారాయణుం"డండ్రు సన్నిహితులు

మొదట "వేంకట" శబ్దంబు "మూర్తి"పిదప

జన్మదాతలు నామాన సన్మతి గన

జేర్చినారలు వారికి జేతు నతులు.                                           13.

ఆ.వె.

చల్లపల్లివంశ సంజాత "యుమ"నామ

సన్నుతాంగి యోగ్య సాధుశీల

గృహిణియౌచు నొసగె బహుమూల్య సంతతి

బాలు డొకరు డందు బాలికయును.                                        14.

 

 

 

 

కం.

పుత్రు "డనంత కిశోరుడు"

పుత్రికయును "దుర్గ" నామ ఫుల్లగుణాఢ్యుల్

పుత్రవధు వికను "భార్గవి"

పాత్రులు వృద్ధార్యతతుల వత్సలత కిటన్.                                15.   

****************************************************

ఉ.        

ఛందములోని పద్ధతులు సాంతము నేర్వని వాడనౌచు నే

యందములైన శబ్దముల నైనను చూడక గంపె డాశతో

వందన కర్హులైన కవిపండిత బృందము చేయు కార్యమే

నందుచు  చేయబూనుటన నత్యతి మూర్ఖతయే దలంపగన్.           16.

షష్ఠ్యంతములు

కం.      

తిరుపతికి తిరుమలేశున

కురుతర సౌభాగ్యదాత కుర్వీధరమే

యిరవయి నిలిచిన వానికి

నిరతానందంబు గూర్చు నిర్మల మతికిన్.                                  17.

కం.       

కరుణాలయునకు నునకు

సురుచిర సౌఖ్యంబు లిచ్చు శోభాఢ్యునకున్

వరగుణునకు నలిమేల్పతి

కరుసంబును బంచువాని కఖిలేశునకున్.                                   18.

కం.       

వేంకటపతి కీ ధరపయి

సంకటములు గూల్చి గాచు సర్వాత్మునకున్

శంకరసఖునకు బృహద

పంకంబును తొలగ ద్రోచు పరమేశునకున్.                                19.

 

 

 

కం.       

సప్తగిరీశున కామయ

తప్తాత్ముల హితము జూచు దైవంబునకున్ 

తృప్తిం గూర్చెడి వానికి

నాప్తుండై ధైర్యమొసగు హరి కాద్యునకున్.                                 20.

కం.       

పిలిచిన పలికెడి వానికి

కులదైవంబై వెలుంగు గోవిందునకున్

కలిమల  హరునకు సరసున

కలిమేల్మంగా సహితున కమలాంగునకున్.                                21.

కం.       

శ్రీకరునకు వేంకటపతి

కీకృతి నర్పించి మ్రొక్కి యెల్లశుభంబుల్

ప్రాకటముగ భూజనులకు

చేకూర్చగ ప్రార్థనంబు చేసెద నెపుడున్.                                    22.

మ.       

నతులీ రీతిని నేనొనర్చి యిచటన్ నానేర్చు చందాన స

న్మతినై చేయగ బూనినట్టి కృతికిన్ మాన్యత్వముం గూర్చు నా

యితి వృత్తంబును తత్క్రమంబు నిపుడే  నిచ్చోట జూపింతు స

న్నుతులం గాంచెడు  పండితాళికృప నన్నున్ జేరగా గోరుచున్.     23.

మ.       

స్రజముల్ భారతి కీయుగాన గనినన్ సామాజికాంశంబులన్

నిజ మానందముతోడ నంది రచనల్ నిష్ఠాయుతిన్ జేయుటల్

విజయాకాంక్షను జూపుడంచు మదులన్ విశ్వాసము న్నింపు నా

ప్రజ-పద్యోక్తిని స్వీకరించి కృతికిన్ ప్రారంభముం జేసెదన్.            24.

 

 

 

 

 

 

కథాప్రారంభము

శ్రీకాకుళము –దూసి – ప్రశంస

శా.        

శ్రీమంతంబగు  నాంధ్ర దేశ ధరణిన్ శ్రీకాకుళాఖ్యంబు స

ద్ధామంబై విలసిల్లు సంస్కృతులకున్, తత్రత్యులౌవారికిన్

క్షేమం బెల్ల విధాల గూర్చుచు మహత్ శ్రేయంబు లందించువా

డామార్తాండుడు క్షేత్రదైవ మగుటన్  హర్షంబులం బంచుచున్.         25.

శా.        

ఆరోగ్యప్రదుడైన భాస్కరుని మాహాత్మ్యంబు వర్ణింపగా

నేరీ దక్షులు భూమిపైన   కనగా నీప్రాంతమం దంత తా

నారాధ్యుండయి హర్షవల్లిని సతం బవ్వారినిం గాచుచున్

చేరన్ వచ్చినవారి కెల్లశుభముల్ సిద్ధింప జేయున్ గదా.                 26.

కం.       

ఆపురికి కూతవేటున

దీపిల్లును దూసి మిగుల తేజో మయమై

ప్రాపుగల గ్రామ మయ్యది

వాపీ కూపాదులకును వాసంబగుచున్.                                     27.

ఆ.వె.     

వాసి చేత దూసి భాసమానం బౌచు

చూసినట్టివారి ధ్యాసలందు

మాసిపోక నిలిచి వాసంబు చేయంగ

నాస గొల్పు వారి యూసు లరసి.                                            28.

సీ.        

ఆగ్రామ వాసులౌ యాసాములందున  బ్రాహ్మణాదులపైన భక్తి మెండు

బహు వర్ణముల వారి సహజీవనములోన సోదర భావంబు చూడనుండు

సన్మార్గగాములై స్వావలంబనతోడ మనుజు లయ్యూరిలో మసలుచుంద్రు

సౌజన్యదీప్తితో నాజీవనం బందు ననయంబు ప్రజలెల్ల మనుచు నుంద్రు

 

 

 

తే.గీ.      వారి కచ్చోట జీవనాధార మౌచు

వెలుగు వ్యవసాయ మద్దాన నలఘు సుఖము

లందు చుందురు వారలా చంద మరయ

సంతసం బౌట నత్యుక్తి సుంత లేదు.                           29.

“నాగావళి” నదీ ప్రశంస

కం.       

నాగావళి యచ్చోటను

వేగంబున బారుచుండు  విస్తృత రీతిన్

మాగాణి చేల కత్యను

రాగంబును జూపు చుండి రమణీయముగన్.                              30.

కం.       

సుమధుర శుద్ధజలావళి

సమధిక శక్తులను గూర్చు సారావళి స

త్క్రమధృత బహువర్ణావళి

తమనాగావళి యటండ్రు దానిని జనముల్.                                31.

సీ.        

నిర్మలంబైనట్టి నీరంబుతో గూడి నిత్యసంతోషంబు నింపుచుండు

సత్ప్రవాహంబుతో సన్మార్గమున జేరి సర్వత్ర పర్వంబు సల్పుచుండు

వినసొంపు గల్గించు విస్ఫుటస్వనముతో విహగ సంఘంబులన్ బిలుచుచుండు

కూర్మితో స్వప్రజన్ కోర్కిమీరగ జీరి కువలయంబున హాయిగొల్పుచుండు

తే.గీ.      ఒక్క మానవులేగాక యుర్విలోని

జంతుజాలము ఖగపంక్తి సంతసమున

చెంత జేరును శీతలస్వాంతయైన

కమ్రనాగావళీనిమ్నగకును సతము.                             32.

కథానాయకుడగు శ్రీపతి పరిచయము – గుణగణములు.

చ.        

కలడొక కర్షకుండు శుభకర్ముడు "శ్రీపతి"నామకుండు స

త్ఫలితము లందగోరుచు శుభప్రదమౌ వ్యవసాయకార్యమం

దలసట లేక నిత్యమును హర్షము నందుచు జీవయాత్రనున్

సలుపుచు నున్నవాడు తనసంతును, భార్యను గూడి యచ్చటన్.   33.

సీ.        

దినకరుం డుదయాద్రి తివిరి చేరకముందు బ్రాహ్మీముహూర్తాన పడకనుండి

లేచి యానందాన లిప్తకాలంబులో  దంతధావన జేసి తడయకుండ

పశువులకడకేగి  పరిచర్య లొనరించి కాలకృత్యంబులన్ గ్రమత దీర్చి

భగవానునకు మ్రొక్కి పడతి యందించెడు చద్ది యాహారంబు చక్క గుడిచి

తే.గీ.      హలము చేబూని తనకున్న పొలము చేరి

కృషిని దైవంబుగా నెంచి క్షేత్రమందు

సస్యములమధ్య నిరతంబు శ్రమను జేయు

నిత్య మీరీతి యాతండు నిష్ఠబూని.                                34. 

ఉ.        

క్షేత్ర సమీపమేగుతరి చెంతనెయున్న నదీమతల్లికిన్

గాత్రము శుద్ధిచేసుకొని కావు మటంచును మ్రొక్కుచుండి యా

మిత్రుని భాస్కరున్ గనుచు మేలొనరింపగ గోరి నిత్యమున్

స్తోత్రము చేయుచున్ జలము దోసిటబట్టి రచించు నర్ఘ్యముల్.          35.

సీ.        

శ్రమ జీవనము లోన జతగూడు విజయంబు

తథ్య మియ్యది యంచు దలచువాడు,

తనకందు ఫలముతో తన్మయత్వము చెంది

నిత్యసంతోషియై నిలుచువాడు,

సత్ప్రవర్తన తోడ సర్వత్ర చరియించి

జనపదంబున కీర్తి కనెడువాడు,

పెద్దవారల  యందు నొద్దిక చూపించి

యాశీస్సు లనునిత్య మందువాడు,

తే.గీ.      సత్య వాదియు, సంస్కారి, సన్మతియిక

పరుల హితమును గోరెడి నిరుపముండు,

భవ్య గుణశీలములప్రోవు, సవ్య గతిని

సతము యోచించు సన్నుత వ్రతుడు వాడు.                 36.

ఉ.         వానిని జూచి నేర్చుకొను వారలు గ్రామమునందు కొంద ర

వ్వాని గుణాఢ్యతన్ గనుచు బాగని మెచ్చెడివారు పెక్కు ర

వ్వానిని ధర్మమూర్తియని వాకొనువారలు, సత్యసంధుడౌ

వానికి నీడు వాడెయని పల్మరు పల్కెడు వారు కొందరున్. 37.

 

శ్రీపతి దుర్భర దారిద్ర్యావస్థకు గురియగుట

కం.       

పేరరయగ శ్రీపతి యిక

పేరిడుముల మూలమైన పేదరికము దా

బేరుకొని బహుళ బాధల

పేరులతో వాసముండు వీని గృహానన్.                                      38.

చ.        

ఒక యెకరంబు క్షేత్రమట నున్నది వానికి నిమ్నగాతటిన్

సకల కుటుంబసభ్యులను సాకుట కయ్యదె యూతమయ్యె తా

వొకటియు నన్యముం గనక నుర్విని దుర్భర జీవయాత్ర వా

డకలుషభావనా భరితు డచ్చట నీడ్చుచు నుండె యెట్టులో.           39.

ఉ.        

వచ్చిన దానితోడ పరివారము తానును జీవనంబు నా

సచ్చరితుండు చేయు తనసంతతి కింతికి నెల్లరీతులన్

మెచ్చినయట్లు సౌఖ్యము లమేయముగా టియింపలేమిచే

నిచ్చలు కుందు మానసము నిండిన వేళ విచిత్రభావముల్.             40.

కం.       

ఒకరిద్దరుగా రవ్వా

నికి సుతులిద్దరును పైని "నిర్మల"యను బా

లికయును గలిగిరి వారల

కొకరోజుననైన గాని యుల్లం బలరన్.                                       41.

ఆ.వె.     

భోజనంబు పెట్టు పోడిమి లేదింట

బట్టలైన నిచ్చు బలిమి లేదు  

వారియవసరాలు భగవానుడే దీర్చ

వలయు గాని వాని వల్ల గాదు.                                                42.

 

 

 

ఆ.వె.     

మంది యెక్కువైన మజ్జిగ పలుచనౌ

ననెడుమాట సత్య మయ్యె నచట

వాని కందు చున్న ఫలసాయ మవ్వారి

గంజికైన చాల గలుగదయ్యె.                                                  43.

ధనవైశిష్ట్యము – దారిద్ర్య హేతువులు

కం.       

ధనముండిన జగమందున

నతరమైనట్టి సుఖము క్రమముగ సత్త్వం

బనయము గూడుచు నుండును

మనుజుల కెల్లరకు జూడ మాన్యత హెచ్చున్.                             44.

కం.       

ధనము గలవాడె ప్రభుడగు

ధనముండిన విజ్ఞుడగును ధర్మజ్ఞుడగున్

ధనము గలవాని నందరు

నుడని నుతియింతు రెల్ల కాలము భువిలోన్.                           45.

కం.       

ధనమే మూలము జగతికి

ధనముండిన శక్తులన్ని తామయి చేరున్

ధనవంతుని బ్రణుతింతురు

జనులందరు పెద్ద యనుచు జగతిని సతమున్.                           46.

చ.        

ధనమది పుష్కలంబుగను ధారుణి గల్గిన భాగ్యవంతుడౌ

మనుజున కన్నిసౌఖ్యములు మైమరపించుచు కూడుచుండు వా

డనుకొని కోరుకొన్న సమయంబున కొండలమీద కోతులున్

తనకడ నుంచుకోగలుగు దల్చగ నౌనె ధనప్రభావమున్.                47.

 

 

 

 

ఆ.వె.     

ధనము లేనినాడు తనవారలైనను

చెంతచేర రారు, సంతసమున

పలుకరించబోరు, పరుల మాట యికేల

పేదవాని బ్రతుకు ఖేదభరము.                                     48.

చ.        

సురుచిరమైన భావమున శోభిలుచున్నను, సత్పథంబునన్

నిరతము సంచరించినను, నిర్మలుడైనను మాటలందునన్

వరగుణు డంచు మెచ్చెదరు వాస్తవమియ్యది యొక్కరేనియున్

ధరణిని బంచ జూచెదరె తన్మయతన్ తమ విత్త మేయెడన్?            49.

తే.గీ.     

పూర్వ జన్మంబులందున  పుణ్య కర్మ

లాచరించుచు దీనుల కన్నిగతుల

దాన ధర్మంబు లొనరించు ధన్యులిలను

భాగ్యమందెద రని యండ్రు బహుళ గతుల.                               50.

కం.       

దారిద్ర్యమునకు సరియగు

కారణ మని యండ్రు బుధులు  గతజన్మమునన్

కోరి యొకింతయు దానము

తారొనరించకయె యుంట తథ్యము జగతిన్.                             51.

ఉ.        

కారణ మేదియైన నగు గాక గతంబున కెవ్వరేనియున్ 

చేరగలారె దిద్దుకొన? శ్రీపతి చేసిన పాప మేమియో

నేరడు, లేమి భూతమయి నిత్యము తర్జన చేయుచుండ నె

వ్వారలు బ్రోచువారనుచు వాడు తలంచుచునుండు నెమ్మదిన్.      52.

మ.       

తనచిత్తంబున గల్గు భావనములన్ దారిద్ర్యభూతంబు త

న్ననయం బేర్చెడు దుస్స్థితిన్ దలచి యాయాసామి లోలోపలన్

కనరానీయక గ్రుక్కుచుండు నిది నాకర్మంబు, కర్తవ్యమే

మనుచున్ చింతిలు నొక్కడై నిలిచి యాయాసంబుతో నెంతయున్.   53.

 

ఆ.వె.     

"నారు వేయువాడె నీరుపోయునటండ్రు"

నేరమేమొ తెలియ నేరకుంటి

కారణం బదేమొ దారిద్ర్య మీరీతి

చేరియుంట చూడవౌర! యనుచు.                                          54.

కం.       

భగవానుని శుభకరుడయి

జగముల రక్షించువాని సన్నుతి సేయున్

జగదీశా! నను బ్రోవవె

ఖగవాహన! యనుచు నతడు కరుణామయునిన్.                        55.

ఉపేంద్రవజ్ర (జ త జ గ గ - 8వ అక్షరం - యతి)

దురాత్మసంఘంబుల దున్మువానిన్

పురారి సన్మిత్రుని బుణ్యమూర్తిన్

సురప్రధానున్ బహుసుందరాంగున్

హరిం దలంచున్ హృదయంబునందున్.                                  56.

ఇది బుధజనవిధేయుండును, హరివంశసంభూతుండును,

శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వర పుణ్యదంపతీ తనూజుండును, గౌతమసగోత్రజుండునగు వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "జీవనయాత్ర" యను సామాజిక పద్యకృతి యందు  ప్రథమాశ్వాసంబు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

 

 

 

 

 

 

 

 

ద్వితీయాశ్వాసము

కం       

శ్రీమద్దినకర! బహుకర!

క్షేమంకర కర్మసాక్షి! శ్రేయస్కర! హే

స్వామీ! భాస్కర! గావగ

నామోదము దెలుపవయ్య! యాదిత్య! హరీ!                              1.

కం.       

ఆశ్రీపతి తనకెవ్వం  

డాశ్రయమౌ ననుచు మదిని నతిదుఃఖముతో

నశ్రువులు గార్చు నక్కట!

యాశ్రామికు బ్రోవ నెవ్వ డట జేరు నికన్.                                  2.

 

శ్రీపతి యర్థాంగి యగు శాంత గుణగణములు

శా.        

సంతోషంబున నన్నికార్యములలో సామీప్యమందుండు నా

వంతైనన్ పరుషప్రవర్తనముతో భర్తన్ విమర్శించ దౌ

"శాంతా"నామక వాని పత్ని యతనిన్ సాధుస్వభావంబుతో

చింతాక్రాంతుడు గాగ శీఘ్రగతితో జేరున్ వినమ్రాంగియై.              3.

తే.గీ.     

" శాంత" యర్థాంగి  సన్నుత స్వాంత యామె

చింతలకు బోయి నిత్యమౌ వంతలకును

సుంత యేనియు గుందక చెంత నిలిపి

సంతు నట సాకు ననిశంబు సంతసమున.                                 4.

శా.        

పంతం బించుక జూపబోదు పతితో భాగ్యంబు నందంగ, దా

నెంతేనిన్ క్షమ దాల్చు, పేదరికమున్ హేయంబుగా దల్ప, దే

వింతల్ గోరదు, సర్వకార్యములలో బ్రీతిన్ శుభాకాంక్షియై  

స్వాంతస్నేహము జూపునన్న నదియౌ సత్యంబు ముమ్మాటికిన్.     ౫.

 

 

ఆ.వె.     

ప్రత్యహమ్ము తాను భర్తకన్నను ముందు

నిద్రలేచుచుండు నిష్ఠబూని

యింటి పనులు చేయు నెంతేని దక్షతన్

సంతు నెల్ల గాచు సంతసమున.                                             6.

చ.        

పొలమున కేగు నింట పని పూర్తిగ జేసిన మీద, టాదటన్

నిలుచుచు బ్రాణనాథునకు నిత్యము సాయము చేయు క్షేత్రమం,

దలసట లేక సంతతికి నన్నియు గూర్చును శాంతమూర్తియై,

పలుకదు దుర్భరోక్తులను భాగ్యవిహీనత కెన్నడేనియున్.               7.

ఉ.        

వానిని, భాగ్యవంచితుని, భర్తను, బాధల నున్నవానిన్

మానుము చింతయంచు పలుమారులు చెప్పుచునుండు "నెందునుం

గానము ఫాలమం దజుడు కానగు రీతిని వ్రాసి బంప నె

వ్వానికి దప్పియుండుటలు, వాస్తవమంచు వచించు నెంతయున్.   8.

కం.       

నామమునకు తగినట్లుగ

నామెలత చరించుచుండు ననవరతంబున్

ధీమతి యనదగు నామెకు

"భూమియె యోర్పునను బోలు" పుడమిం జూడన్.                     9.

కం.       

పేదరికమునకు గొంకుచు

వేదననుం బొందకుండు విజ్ఞ యనంగా

సాదరమున తనసంతతి

నౌదల ధరియించి సాకు ననుదిన మచటన్.                                10.

శా.        

ఎన్నోరోజులు పస్తులుండును కటా! యెంతేని సద్భావనన్,

మున్నా నాథుని క్షుత్తు నార్చు, నతి సమ్మోదంబుతో పిల్లలన్

"కన్నా!రమ్మ"ని పిల్చు, ప్రేమమయియై ఖాద్యంబు లందించు, తా

నెన్నండున్ బరికించ బోదు తనకై యింతేని యాహారమున్.            11.

 

ఆ.వె.     

మిగిలియున్నవేళ మెసవుచుండును గాని

లేదటన్న మాట రాదు నోట.

సతులలోన శ్రేష్ఠ జగతిలో జూడంగ

సద్గుణముల ప్రోవు శాంత నిజము.                                          12.

 

శ్రీపతి సంతానము – విద్యాభ్యాస పరిస్థితులు  – భావికాంక్ష

శా.        

దారిద్ర్యంబున మ్రగ్గుచుండియు మహద్ధైర్యంబుతో జీవనా

ధారంబై విలసిల్లు విద్యగొను సంతానంబు నేరోజునన్

జీరం జూడరు  కాయకష్టమునకై చెన్నొందు విజ్ఞానమున్

మీరల్ పొందుడటంచు వారలకునౌ మేలెంచువా రిర్వురున్.           13.

ఆ.వె.     

"ఇంటి నలుకగానె యిల పండుగౌనేమి"?

బడికి పంపినంత బహువిధమగు

సాధనంబులేల సమకూరు వారికి?

తెరవు కొంచెమైన తెలియరాదు.                                             14.

మ.       

తమతో విద్యను నేర్చువారిపగిదిన్ తామున్ విశిష్టంబులై

యమలోదాత్తములైన వస్త్రతతులన్ హర్షంబుతో దాల్చుచున్

క్షమమౌ దర్పము జూప నెంచెదరు తత్సంతాన మాకోరికల్

శ్రమజీవ్యాత్మజులైనవారి కగునా సాధ్యంబు? విశ్వంభరన్. 15.

ఉ.        

చక్కని పుస్తకంబులును సన్నుతమైనటువంటి లేఖినుల్

మిక్కిలి యందమై వెలుగు మేనియలంకృతు లింపుమీర తా

మెక్కుడు తృప్తిగాంచుటకు నిచ్ఛను బూనుచునుంద్రు పేదవా

రెక్కడినుండి తేగల రహీనములై విలసిల్లు వస్తువుల్.                     16.

 

 

 

 

సీ.        

సహపాఠి మిత్రు లేయహమునందున జూడ బహురుచ్య సంభార సహితు లగుచు

బడిలోని కేతెంచి తడయక సమయాన వడివడి భక్షించి గడపుచుండ

తమసంచులను దీసి మమకారమున దల్లి యమర నిచ్చిన వాని నములుచుండి

వారు పానీయాలు నోరూర ద్రావంగ  నీరంబునే ద్రావి వీర లకట

తే.గీ.      ధనము గలవారి బిడ్డలు నతరముగ

క్రీడ లాడుచు నుండంగ నాడ నపుడు

దూరముననుండి చూడంగ జేరి కోర్కె

మీర గడుపుచునుందురు వారి సుతులు.                      17.

చ.        

చదువులలోన వార లనిశంబును జూడ కుశాగ్రబుద్ధులై

సదమలురైన యొజ్జల ప్రశంసల నందుచు నగ్రగాములై

ముదమున పాఠశాల కతిముఖ్యు లనంగను సంచరింత్రు సం

పదలొకయింత లేకునికి బాధలు మానసమందు నుంచకన్.            18.

ఆ.వె.     

వారిబుద్ధిచేత, తీరైన నడతచే

విజయమందుచుండు విధముచేత

సత్యమైన ప్రేమ సహపాఠులందున

పొందగలిగినారు సుందరముగ.                                              19.

సీ.        

"నీరజా!" రమ్మురా  పేరైన జట్టులో చేరి మాకందించు మోరి! ముదము

"నిఖిల"నీ విద్దాని నీతియేమియొ చెప్పు నిన్నదెల్పిరి యొజ్జ నిరుపమముగ

యీప్రశ్న కుత్తరం బేది "నిర్మల" మాకు నింపుగా చెప్పు మీయెడను నీవు

పద్యాలు పఠియించు పద్ధతిన్ మాకునై పాడి చూపించు మీపట్టు ననుచు

తే.గీ.     

వారి మువ్వురి చెంత కాపాఠశాల

యందు చదివెడి సహపాఠు లంద రిట్టు

లేగుదెంచుచు కర మనురాగ మొదవ

నడుగుచుండెద రెంతేని యాదరమున.                                     20.

 

 

కం.       

"నీరజుడు" పెద్దకొమరుడు

వార"న్నిఖిలుండు" చిన్న పట్టియు జ్ఞానా

ధారిత "నిర్మల" పుత్రిక

వారా శ్రీపతికి పిల్లవాండ్రు గనంగన్.                                       21.

కం.       

అవ్వారలు కక్ష్యలలో

నివ్విధముగ మిత్రులందు నెంతయు ప్రేమన్  

మువ్వురు సంపాదించిరి

యవ్వల వారలకు సుఖము లందునొ లేదో.                                22. 

ఆ.వె.     

పాఠ్యపుస్తకాల పారంగతత్వమే

కాదు కేవలంబు, మోదమునను

చక్కనైనయట్టి సహపాఠ్యకృత్యాల

దాము నిలుతు రగ్రగాము లనగ.                                             23.

మ.       

బడిలో నెన్నడు జ్ఞానవర్ధక సభన్ పాల్గొన్న పోటీలలో

జడియం జూడరు వార లన్నిగతులన్ సమ్యగ్విధానంబునన్

గడియింపంగను జూచుచుందు రట సత్కారం బవశ్యంబుగా

జడతం బూనరు లేమిచేత నొకటన్ సర్వప్రయత్నంబునన్.             24.

మ.       

తలలో నాలుకలౌచు సద్గురులకున్ తారెంతయో నమ్రతన్

లలితంబైన విధాన బల్కుచును వాలాయంబుగా విద్యలన్

జలపానాదుల నెంచకుండగను ధ్యాసన్ నిల్పి యోగంబుగా

నలసత్వం బొకయింత జూపక  సతం బార్జింతు రవ్వారటన్.          25.

ఉ.        

వారల జన్మదాత లతిబాధల నుంటకు, తాము నిత్యమున్

కోరిన సౌఖ్యసంచయము కొంతయు బొందగ లేకయుంట కే

కారణ మన్యముం గనక  క్రౌర్యము జూపు దరిద్రతాస్థితిన్

వారలు గాంచి నెమ్మదిని భావిని గూర్చి తలంతు రీగతిన్.              6.

 

సీ.        

ఏరీతిగానైన కోరిక దీరంగ   నిత్యంబు సద్విద్య నేర్వవలయు

గురువుల  శుశ్రూష నిరతంబు చేయుచు  బహువిధ జ్ఞానంబు బడయవలయు

సామర్ధ్యమును జాటు స్పర్ధలందున జేరి నమైన ఫలితంబు గాంచ వలయు

కష్టమైనను సైచి కఠిన దీక్షను బూని యున్నతశిఖరాన నుండ వలయు

తే.గీ.      పట్టుదలతోడ  చరియించి యెట్టులైన

            వరలు పాశ్చాత్య దేశాల కరిగి యచట

నంద మొప్పగ విత్తంబు లంది పయిని

బహుళ సుఖములు హర్షాన బడయ వలయు.                 7.

.వె.     

కల్పతరువు వోలె కామితంబులు దీర్చు

భాస్కరుండు వారి  వాంఛలు విని

కర్మసాక్షిగాన మర్మంబు లరయుచు

కోరుకొన్నపగిది గూర్చుగాత.                                                28.

చ.        

సరియగు మానసంబు, ననిశంబు శ్రమించుచునుండు రీతియున్,

వరమగు వాక్యముల్ పలుకు వైనము దాల్చుచు సంచరించినన్

సురుచిరమైన సత్ఫలము, సుందర జీవన మందకుండునే

సురల సహాయమందగల చొప్పుటింపకయుండునే భువిన్.         29.

.వె.     

వినయభరితు లౌచు విద్యార్జనము చేయు

ఛాత్రగణము భువిని సన్నుతమగు

జీవనంబు నంది సిరిసంపదలు పొంద

సందియంబు లేదు సత్యముగను.                                           30.

పుత్రుల విద్యాభివృద్ధికి శ్రీపతి సంతసించుట

 భావి ఏర్పాట్లకై చింతించుట.

శా.         పుత్రుల్ వారి పరీక్షలైన పిదపన్ ప్రోత్సాహమందించు నా

పత్రంబుల్ గొని రాగ తండ్రి మిగులన్ ప్రహ్లాదముం బొంది స

త్పాత్రుల్ సంతతి యంచు బొంగు మదిలో బల్మారు నావెంటనే

చిత్రం బీయది విత్తహీనుడగుటన్ జేయున్ గదా యోచనల్. 31.

మ.       

ఇక  పైకక్ష్యకు వీరినేగతిని నే నిప్పట్టునన్ బంపగా

నకలంకంబగు సత్త్వముం గనెదనో హా! భాగ్యమా! నాపయిన్

వికటాకారము జూపి నవ్వదగునా? విద్యార్థులౌ వీరి కే

నొకరీతిన్ సమకూర్చలేను వసతుల్ యోచింపగా నీయెడన్.            32.

శా.        

ఎన్నోరీతుల నిట్లు తాను మదిలో నెంతే న్వితర్కించుచున్

మన్నింపందగు విద్యకున్న న సమ్మానంబు తానెంచుచున్

మున్నేరీతి ఋణంబు చేసి ప్రజకున్ మోదంబునుం గూర్చెనో

యెన్నం జూచును తత్పథంబె విధిగా నెంతేని కష్టంబునన్.             33.

ఆ.వె.     

ఋణము చేయు  వారి గణవేషమును గూర్చి

పుస్తకాలకొరకు పొరుగువారి

సముఖమందు చేయి చాపును విధిచేత

వంచితుండు గాన వాస్తవముగ.                                              34.

.వె.     

ఏమి చేయగలుగు నింతకంటెను వాడు

మార్గ మన్యమొండు మనములోన

చేరకుండ నుగ్రదారిద్ర్యభూతంబు

పీడ లిడుచు నాట్యమాడుచుండ.                                            35.

స్వాగతము(ర న భ గ గ-7వ అక్షరం యతి)

వాని శ్రామికుని భాగ్యవిహీనున్

తానె గావవలె తథ్యము గాగన్

భాను డెల్లెడల భాస్కరుడౌచున్

మానవాళి గను మాన్యుడు భావిన్.                  36.

 

ఇది బుధజనవిధేయుండును, హరివంశసంభూతుండును, శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వర పుణ్యదంపతీ తనూజుండును, గౌతమసగోత్రజుండునగు వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "జీవనయాత్ర" యను సామాజిక పద్యకృతి యందు  ద్వితీయాశ్వాసంబు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

తృతీయాశ్వాసము

కం.       

శ్రీకరుడు లోకబాంధవు

డాకరుణామయు డమేయ హర్షప్రదుడై

చేకొని సకల ప్రాణుల

నేకాలము కృపను జూచు నీ జగమందున్.                                1.

 

పొలములోని పంటను చూచి శ్రీపతి సంతసించుట

మ.       

నిరతశ్రామికుడైన శ్రీపతి మహన్నిష్ఠన్ సకాలంబునం

దరుసం బొప్ప రచించె సస్యము స్వకీయంబైన క్షేత్రంబునం

దిరవైనట్టి ఫలంబు హస్తగతమౌ నింపార నద్దానితో

పరివారంబున కందు భోజన మికన్ భవ్యంబుగా నంచటన్.           2.

ఉ.        

విత్తిన నాటినుండి కడు విజ్ఞతతో దరిజేరి సస్యమం

దొత్తుగ నిల్చియుండిన సముద్గత మైనటువంటి గ్రాసమున్

మొత్తముగా పెకల్చుచును మొక్కల సాకుచు నీరు కట్టుచున్

చిత్తము తృప్తితో పరవశించగ సేవలు సేయు నిత్యమున్.                3.

చ.        

ఎరువును జిమ్మి క్షేత్రమున నెంతయు శ్రద్ధను బూని నిత్య మా

సరసన మంచ వేసుకొని సస్యము పక్షుల పాలుగాక త

త్పరతను తల్లి బిడ్డలను తన్మయ మందుచు సాకురీతిగా

నరయుచు రక్ష చేయు నతులాదరభావముతోడ దానినిన్.              4.

ఉ.        

మొక్కను జూచి సంతసిలు మోదము గొల్పుచు కంకులుండగా

మిక్కిలి పొంగుచుం దలచు మేలగు నీయెడ విస్తృతంబుగా

చక్కని పంటపండుగద సంతునకుం బరివార మంతకున్

నిక్కము సౌఖ్యమందునని నేలకు మ్రొక్కును హాయి నందుచున్.     5.

 

 

ఉ.        

పచ్చని పైరులో విరగబండిన కంకులరాశి జూచి యా

సచ్చరితుండు గట్టుపయి సంతస మందుచునుండు తృప్తితో

విచ్చిన నేత్రయుగ్మమున పెన్నిధి యందినరీతి చిత్తమం

దచ్చపు భావజాలమున హాయిని బొందుచునుండు నిత్యమున్.      6.

కం.       

ఈవత్సరమున నాయెడ

దైవం బనుకంప జూప దలచెను సత్యం

"బీవైనము సస్యంబున

భావింపగ" స్పష్టమయ్యె బహువిధములుగన్.                             7.

చ.        

దయగలవాడు దైవమిది తథ్యము తద్గతమానసంబున

న్నియమముగా స్మరించినను నిస్తులమైన మనోరథంబులన్

భయమును ద్రుంచి కూర్చును కృపం బ్రసరింపగ జేయు నన్నిటన్

జయముల నిచ్చుచుండు నిది సత్యము లేదొకయింత శంకయున్.  8.

కం.       

దేవుని నమ్మిన వారల

కేవేళను శుభము లొదవు నీక్షితిలోనన్

దీవెనలు చేరుచుండును

నీవే దిక్కన్న గలుగు నిర్మల యశముల్.                                   9.

కం.       

అని దలచుచు భగవానుని

మనమందున నిలిపియుంచి మాన్యోక్తులతో

నతరముగ నుతియించును

వినయాన్వితుడౌచు కృషక వీరుం డచటన్.                                10.

కం.       

దేవా! జగదాధారా!

భావింతును మనమునందు భక్తిని నిన్నున్

సేవకుని నన్ను గాచుట

జీవప్రద! దీప్తిమంత! చెల్లును నీకున్.                                       11.

 

మ.       

అనుచున్ మ్రొక్కుచు సంతసంబున నతం డారోజు సాయంతనం

బున గ్రామంబును జేర నేగుతరి నంభోజాతమిత్రుండు చే

రిన నస్తాద్రి తమంబు నిండె జగతిన్ రేలయ్యె సర్వంబునన్

న నిశ్శబ్దము వ్యాప్తమయ్యె నట కీకారణ్యసంకాశమై.                   12.

ఆ.వె.     

ఇంటి కడకు నేగి యిల్లాలు గూర్చిన

భోజనంబు మెసవి పుత్రుల కెడ

జేరి వారితోడ దీరైన రీతిలో

ముచ్చటాడి మిగుల మురిసి యతడు.                                      13.

ఆ.వె.     

పూరి గుడిసెలోన జేరి తాకినయట్టి

గంధవహుని ప్రేమ బంధమునకు

పాపరహితు డతడు  దీపాల వెలుగులో

భాగ్య మొదవు ననుచు పరవశించి                                          14.

శా.        

సంతోషంబున భార్యతో బలికె నాశాపూర్ణుడై యప్పు డో

శాంతా! వింటివె యస్మదీయమగు సస్యంబుం గన న్మానసం

బెంతేనిన్ తనివందుచున్నయదిబో యీసారి నిక్కంబుగా

చెంతం జేరును పంట చింత విడుమా క్షేమంబునుం గాంచుమా.       15.

మ.       

అని యాతండన నామెయున్ మురిసె శ్రేయంబందు నీతూరి యే

యనుమానంబును లేదు తథ్యమని తా నవ్వేళ భావించుచున్

తనదైవంబగు నాథుని న్ముదముతో తన్వంగి సేవించ గా

మనమెంతేనియు నుబ్బ నాతడపు డమ్మాన్యన్ బ్రశంసించుచున్.    6.

 

 

 

 

 

శ్రీపతికి స్వప్నము వచ్చుట – ప్రకృతి వైపరీత్యమేర్పడుట

మ.       

ఒకకొంతైనను విశ్రమింతునని యా యుత్సాహియౌ కర్షకుం

డొకచో నిద్రకు జారినంత కలలో నొప్పారగా క్షేత్రమం

దకలంకంబుగ నున్న సస్యము మహత్వాకాంక్షియౌ వానికిన్

ప్రకటంబై హసియించు నట్లగుపడెన్  ప్రహ్లాదముం గూల్చుచున్.       17.

మ.       

తననే జూచుచు వెక్కిరించు పగిదిన్ దారిద్ర్యభూతంబుతో

మనసారంగను స్నేహహస్త మిడి లెమ్మా  యంచు క్రౌర్యంబునన్

నిను దౌర్భాగ్యుని నుద్ధరించగల వానిన్ జూడగా లేవిలన్   

ధనహీనా! యని పల్కుచున్న గతి వేద్యం బయ్యె నవ్వానికిన్.         8.

ఆ.వె.     

ఒళ్ళు జలదరించె యోపిక నశియించె

ఫెళ్ళు మనెడి ధ్వనులు విస్తరించ

త్రుళ్ళి పడుచు లేచె తోరంపు భీతితో

కాళ్ళు వణకసాగె కర్షకునకు.                                                 19.

మ.       

అతడెంతేనియు భీతిచెంది కలలో నారీతి గన్పించగా

వెతతో దిగ్గన లేచి చూడ నకటా! విస్తారమౌ వాత మా

క్షితిజాళిన్ బెకలించుచుండె నసంకీర్ణంబుగా  నాకమున్

జతగూడెన్ బహు కర్కశధ్వనులతో సంత్రాసముం గూర్చుచున్.     20.

ఉ.        

గాలికితోడు వర్షము యుగాంతపువేళ టిల్లెనో యనన్

పోలిక చెప్పలేనిగతి పొంగుచునుండి చరాచరంబులన్

కాలను దన్నుచుం బహుముఖంబులుగాగ మహోగ్రరూపియై

చేలను వాగులన్ గలియజేయుచునుండె నిరంతరంబుగన్.             21.

 

 

 

 

తే.గీ.     

కుండపోతగ వర్షంబు కురియుచుండ

వికృతరూపాన వాయువుల్ విస్తరించ

క్షితిని జూడ నయోమయస్థితి జనించ

భయము వ్యాపించె జనుల కాపాదనఖము.                                22.

సీ.        

లక్షణంబుగనున్న వృక్షసంతతులెన్నొ

పెకలించు కొని గూలె వెరపు గలుగ

దారులన్నియు పూడి తరియించు తెరవొక్క

టగుపించకుండెనా యవసరమున

ప్రలయ కాలము వోలె జలము సర్వంబందు

కనుపించ సాగె నాక్షణము నందు

స్వపర భేదము లేక సకలమా నీటిలో

తేలి యాడుచునుండె తెప్పలట్లు 

తే.గీ.     

ఆగ్రహము మీర దేవుడా యదను నందు

నిట్టి యాపద సృష్టించె నేమొ యనగ

భయము పుట్టించు చుండి యావరద జనుల

జీవనంబును స్తంభింప జేసె నపుడు.                                         3.

మ.       

తలుపుల్ మూసి ప్రయత్న శూన్యు లగుచున్ దాగంగ గేహంబునన్,

విలయంబున్ గనులార గాంచు స్పృహ నేవేళన్ గొనంబోక, ని

చ్చలు చేయందగు కార్యసంముల నెంచంబోక తాముండినన్

నిలుచున్ బ్రాణము లన్యజీవులగువానిన్ గావగా శక్యమే?               4.

తే.గీ.     

ఒక్క క్షణమైన నాగక దిక్కులన్ని

యేకముగ  జేసి యావాన లోకమందు

నుగ్రరూపాన సృష్టించె యోటలేక

చేతనము గూల్చుచును మహోత్పాత మపుడు                          25.

 

 

ఆ.వె.     

మూడు రోజులచట ముదమును హరియించి

విలయతాండవంబు విస్తృతముగ

జరిగె, జనులలోన జవసత్త్వములు గూలె

దైవలీల నెవరు దాటగలరు?                                                   26.

శ్రీపతి దుఃఖించుట

కం.       

జీవచ్ఛవమై శ్రీపతి

భావింపగ శక్తిలేక భావివిధంబున్

గావగలవార లిమ్మహి

నీవేళను లేరటంచు నెంతయు గుందెన్.                                    27.

కం.        మరునాటి యుదయవేళను

బిరబిర క్షేత్రమును జేరి వీక్షించంగా

సురుచిరమై విలసిల్లిన

కర మరుదగు సస్యదీప్తి కనుమరు గయ్యెన్.                   28.

మ.       

తన క్షేత్రంబును గుర్తుపట్టదగు నాధారం బొకింతేనియున్

కనరాదాయెను సర్వసస్యవితతుల్ ఖండంబులై యెప్పుడో

ననాగావళిలోన జేరె గములై కన్పించె తీరంబునన్

జనులాదృశ్యము జూచుచుండ గని బేజారెత్తె వాడెంతయున్.         29.

కం.       

భీకరముగ పీనుగులకు

నాకరమౌ యుద్ధభూమియా యనునట్లున్

శ్రీకరమగు నాగావ

ళ్యాకృతి సస్యములుగూడ నట కనిపించెన్.                               30.

శా.        

ఆశల్ గూలెను, నాశనంబయె పొలం బాసాంత మిద్దాన నా

ధీశక్తుల్ కృశియించె సత్త్వ మొకయింతేనిన్ సశేషంబుగా

దీశానా! యొడలెల్ల కంపనముచే నిప్పట్టునన్ దూల నా

వేశంబే గద నన్ను జేరె ననుబో వేమారు దుఃఖించుచున్.               31.

శా.        

కర్తవ్యం బొకయింతయేనియు గనంగారాదు నాకెల్లెడన్

ధూర్తత్వంబున నాయెడన్ విధి మహద్దుష్కృత్యముం జేసె నా

యార్తిన్ దీర్చెడివారు లేరు గద సాహాయ్యంబుగా నిల్చుచున్

కీర్తింపం దగు మిత్రులెవ్వ రిలలో క్షిప్రంబునం జేరుచున్.               32.

తే.గీ.      అనుచు నీరీతి తర్కించి యాత డచట

కడకు కన్నీరు మున్నీరుగాగ నేడ్చి

మూర్ఛ పోవుచు దేలుచు మున్ను గొనిన

ప్పులను లోన స్మరియించె నాదినుండి.                   33.

ఆ.వె.     

పట్టి పుట్టు వేళ పదివేల ఋణమయ్యె

వాని పెంపకాన వరుస పదియు

బడికి బంపగోరు నెడనయ్యె నట్టులే

ఋణమె జీవితాన క్షణము క్షణము.                                           34.

ఆ.వె.      విత్తునాటువేళ, విస్తృతంబుగ బైరు

పెరుగగల దటంచు నెరువు దెచ్చి

చల్లు వేళలందు పెల్లుగా ఋణమయ్యె

తీర్చు తీరొకింత తెలియరాదు.                                  35.

మత్తకోకిల.   

సంతు గూడిన నాటినుండియు సత్వమిచ్చెడి రీతిలో

సంతసం బొనరించు నట్లుగ సన్నుతంబగు భోజనం

బింతయేనియు గూర్చనైతిని యిట్టి నా యసమర్థతల్

చింత గొల్పుచు నున్న వెల్లెడ ఛీత్కృతుల్ గొనునట్లుగన్.             36.

ఆ.వె.      నన్ను నమ్ముకొన్న నాధర్మపత్నికి

దనువు బంచుకొన్న తనయులకును

సౌఖ్య మింతయేని  సమకూర్చలేనట్టి

శక్తి లేని పెద్ద చవట నేను.                                          37.

ఉ.  అంగడి నన్నియుండినను నల్లుని నోట శనైశ్చరుండు తా

      నింగితమున్ హరించుటకు నిల్లును గట్టుక నున్నరీతి యీ

      భంగిని గాంచినన్ తెలియు భాగ్యముచేతను వంచితుండ నా

      కుం గననొప్పునే సుఖము కొంతయు నంచును వాడు కుందెడున్.38.

సీ.        

ఎవని వద్దకునైన నేగి చేయిని జాపి యర్థింపగా ధైర్య మసలులేదు

ఈపాటికే నాకు నీయూర నున్నట్టి యింటింట గలవప్పు లికను జూడ

ఋణమందు నవకాశ మణుమాత్రమును లేదు చేరలే నికపైన నూరిలోన

ముఖము చూపగ లేను సఖులకైనను నాదు వారసులకునైన బత్నికైన

తే.గీ.      వరుస నాపద లీరీతి వచ్చుచుండె

కష్టములు  దాటు మార్గంబు కానరాదు

దైవమునకైన నాయందు దయ యొకింత

కలుగకున్నది యిలనంచు తలచుచుండి.                      39.

కం.       

జీవముగల శవ మట్టుల

భావంబున  శక్తిలేక బ్రతుకుట కన్నన్

దైవమును దలచి యీయెడ

జీవంబును ద్రుంచుకొనుట శ్రేయము నాకున్.                            40.

తే.గీ.      అనుచు దలపోసి యొకకొంత యాత్మలోన

"బ్రతికి యుండిన సుఖములు బడయవచ్చు"

నందు రిలలోన పెద్ద లేమనగవచ్చు

ననియు తర్కించుచుండె నాయవసరమున.                  41.

 

మాలిని   (న న మ య య యతి 9వ అక్షరం)

 

అతనికి తగురీతిన్ హర్షముం జేర్చువారీ

క్షితిపయి కనరారా క్షేమముల్ గూర్చువారల్

జతను గొనగ లేరా సాయమందించ నేరున్

నుతగుణులయి యీరా నూతనంబైన శక్తిన్.                               2.

 

ఇది బుధజనవిధేయుండును, హరివంశసంభూతుండును, శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వర పుణ్యదంపతీ తనూజుండును, గౌతమసగోత్రజుండునగు వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "జీవనయాత్ర" యను సామాజిక పద్యకృతి యందు  తృతీయాశ్వాసంబు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

చతుర్థాశ్వాసము

కం.       

శ్రీదుడు సత్త్వప్రదుడును

వేదన లణగించుచుండి విశ్వంబునకున్

మోదము పంచెడి మిత్రుడు

సాదరమున జూచుచుండు సకలజగంబున్.                               1.

 

మిత్రుడగు భూపతి శ్రీపతిని చూడ వచ్చుట 

పలకరింపు - పరస్పర సంభాషణము

చ.        

అరబుల దేశమందునను హాయనకాలము వాసమున్నవా

డురుతర మైన స్నేహగుణు డుత్తమ మిత్రుడు బాంధవాళి నా

పురమున జూడ నెంచుచును భూపతి నామకు డాడ జేరి యా

సరణిని గాంచి నెచ్చెలిని సత్వరముం గనబోయె నప్పుడున్.           2.

ఉ.        

స్నేహితు డింట లేకునికి, చేల సమీపమునందు నొక్కచో

దేహము క్రుంగ చింతిలుచు దేజమడంగగ నుగ్రకష్టసం

దోహముచేత చుట్టబడి దుఃఖిలు నాప్తు హితైషిసత్తమున్

సాహసియైన శ్రీపతిని సన్మతినిం గని పల్కె నీగతిన్.                    3.

మ.       

హితుడా! క్షేమమె? యీప్రదేశవిషయా లీవేళనే నాకునున్

మతి కెక్కెన్, ప్రకృతిప్రభావమిచటన్ మాగాణులన్ మెట్టలన్

నుతికర్హంబగువాని నార్చెగద! మున్నుం జూడలేదిట్లు పల్

వెతలన్ ముంచెను మానవాళిని కటా! విశ్వాసముం ద్రుంచుచున్.    4. 

మ.       

అనుచున్ జేరిన స్నేహితున్ గనుచు నాయాసామి దుఃఖార్తుడై

తనగోడంతయు వెళ్ళబోసికొని నాదౌర్భాగ్య మీవేళలో

నను గాల్చంగను సిద్ధమై యిపుడిటుల్ నైజత్వముం జూపె నే

యనుమానం బొకయింతలేదు నిజ మాయాసంబు గూర్చెన్ సఖా!   5.

 

మ.       

జవ మొక్కింతయు లేదు కర్మములలో సత్త్వంబునుం గూలె నీ

భవమే దుర్భరమయ్యె నప్పులగముల్ భారంబులై యున్న వే

యవకాశంబును గానరాదు బ్రతుకన్ హా! నాకు లోకంబులో

శివముల్ గూడవు వ్యర్థమిందు మనుటల్ జీవచ్ఛవంబై యిటుల్.       6.

శా.        

ఆరీతిన్ తనదుస్స్థితిన్ దెలుపగా నాత్మీయుడౌ వానికిన్

మేరల్ తగ్గెను దుఃఖమందు, హితుడౌ మిత్రుండు కన్పించగా

జీరన్ భక్తుని గావ జేరు విభుడౌశ్రీనాథు డన్నట్టు లా

ధారంబై కనిపించె నెచ్చెలి యటన్ ధైర్యంబు కల్గించుచున్.             7.

సీ.        

కష్టాలకడలిలో చేష్టలం గోల్పోయి

మునిగి యుండినయట్టి మనుజులకును

హితకాంక్షులౌవారు జతగూడి ప్రేమతో

మాటలాడుట చేత మహితమైన

సంతసంబులు గల్గు వంత లవ్వారితో

పంచుకొన్నను చాలు వ్యధను కొంత

తగ్గుచుండెడి మాట తథ్య మీయిలలోన

సర్వత్ర లేదిందు సందియంబు

తే.గీ.     

కాన శ్రీపతి హితునకు మానసమున

గూడు కట్టుకనున్నట్టి గోడులన్ని

దైవమును జేరి వినిపించు దాసుని వలె

చెప్పుకొనినంత నిసుమంత సేదదీరె.                                         8.

ఉ.        

వారలు స్నేహదీప్తిగలవారలు, బాల్యమునుండి యొక్కచో

చేరుచు గ్రీడలన్ సలిపి చెంత భుజించుచు విద్యనేర్చుచున్

దీరిక వేళలందు గణుతింగను మాటల నాడువా రికన్

గీరితి గోరువార లిల గృష్ణకుచేలురమైత్రి వారికిన్.                      9.

 

 

కం.       

పదితరగతు లొకచోటనె

ముదమారగ బూర్తిచేసి మును సంమునన్

పదిలంబగు జీవనమున

కెద దలచినవార లిద్ద రెంతయు బ్రీతిన్.                                    10.

 

విదేశగమనమునకై  మిత్రుని భూపతి ప్రోత్సహించుచు ఊరడించుట

మ.       

అతడా భూపతి విత్తకాంక్షి యయి తానా దూరదేశంబులన్

గతవర్షంబున నేగియుంట హితమున్ గాంక్షించి యాశ్రీపతిన్

జతగాడా! వినుమోయి షేకుల స్థలిన్ సత్యం బరబ్దేశమం

దతుకం జూతువె?  సేవ చేయుటకునై హర్షంబు నీకందెడున్.           11.

శా.        

జీతం బిత్తురు భోజనంబు దొరకున్ క్షేమంబుగా జీవనం

బేతద్దేశమునందు నీకు గడచున్ హేయంబుగా నిచ్చ టీ

రీతిన్ గుందగనేల యూరడిలుమా! లెమ్మంచు పల్కంగ వా

డాతం డాడిన మాటకున్ మనములో నానందముం బొందుచున్.     12.

మ.       

నను గావంగను దేవదేవుడు దయన్ నాయార్తినిం బాపగా

నిను బంపించెను మిత్రమా! శుభమగున్ నీమాటల న్నేనికన్

వినుమోయీ! తలదాల్తు దూరభువికిన్ వెళ్ళంగ నాచెంత నే

ధనసంపత్తియు లేదు సాధ్యమగునా తత్ప్రాంతముం జేరగన్.         13.

కం.       

అనుచును శ్రీపతి పలికిన

ధనమునకయిచింతజేయ దగునా నీకున్?

కనరాడా మిత్రుం? డిదె

వినుమని భూపతియు దెలిపె విజ్ఞుం డగుటన్.                              14.

 

 

 

కం.       

సకలంబును నే జూచెద

నొకకొంతయు సందియంబు నొందక నీవున్

చకచక సిద్ధము గావలె

నిక పదిదినములకు నాడ కేగగ వలయున్.                                 15.

మ.       

అనుచుం బల్కెడి భూపతిం దలపగా "హర్షప్రదుండై భువిన్

నతాపంబును దీర్చి గాచు హరియే కన్పట్టినట్లుండ" నీ

కెన యెవ్వండిల మిత్రమా!" యని ముదం బెంతేనియుం గల్గ "జీ

వనదాతా కొను ధన్యవాద" మనుచున్ వాడేగినా డింటికిన్. 16.

 

శ్రీపతి తన విదేశ గమన నిర్ణయమును

భార్యాపుత్రులకు తెలియజేసి  జాగ్రత్తలు చెప్పుట.

ఆ.వె.     

ఇంటికేగి  సుతుల కిల్లాలికిని జెప్పె

పొలము చెంత హితుడు కలియుటయును,

వానితోడ స్వీయ బాధలన్నియు పూస

గ్రుచ్చినట్లు తెల్ప కూడుటయును.                                         17.

ఆ.వె.     

అతడు కష్టతతుల నధిగమించెడి తీరు

చెప్పుటయును, తాను శ్రేష్ఠుడైన

యతని మాటచేత నరబు దేశాలకు

నరుగబూను విధము, నంత దెలిపె.                                          18.

తే.గీ.     

పిల్లలను సాకు మిచ్చట నెల్లగతుల

విద్య కాటంక మేర్పడు విధము వలదు

కృషిని సాగించుచుండుమా క్షేత్రమందు

ధైర్యమును దాల్చి నెరపుము కార్యములను                               19.

 

 

ఆ.వె.     

అనుచు పత్నితోడ నాతండు పల్కిన

నామె వల్లె యనియె నటులె సుతులు

శ్రమకు నోర్చి యతడు తమకు క్షేమముగూర్చ

సిద్ధపడగ నడ్డు చెప్పగలరె?.                                                  20.

కం.       

చిన్నారులతో ననె మీ

రెన్నండును తల్లివద్ద యేపనిలోనన్

మన్నించకుండవల దిక

సన్నుతులను గాంచవలయు చదువులలోనన్.                                      21.

కం.       

చదువే జగదాధారము

చదువే సౌఖ్యంబు గూర్చు సత్సంపదలన్

చదు వమరజేయు గావున

చదువగవలె శ్రద్ధజూపి చక్కగ మీరల్.                                      22.

కం.       

చదువుగలవాని కెల్లెడ

ముద మొదవును యశముగలుగు ముఖ్యత్వంబున్

పదిమందిలోన గలుగును

చదువరి పూజింపబడును సర్వత్ర భువిన్.                                 23.

మ.       

అని యవ్వారలతో వచించి యతడట్లానంద సంయుక్తుడై

మను కాంక్షల్ వికసించ నెమ్మనమునన్ మార్తాండునిన్  దల్చుచున్

దన దైన్యంబు శమింపబోవు నిక నాదైవంబు నాయందు నే

డనుకంపన్ బ్రసరింప జూచె ననుచున్ హాయిన్ సుషుప్తిం గనెన్.     24.

మ.       

సుఖ నిద్రన్ గనె నాత డద్దినమునన్ సూర్యుండు ప్రాచీదిశన్

నిఖిలంబైన జగంబునన్ వెలుగులన్ నింపంగ సంసిద్ధుడై

సఖి బద్మంబును బల్కరించు తఱి యాశావాది మేల్కాంచుచున్

ముఖమున్ మార్జన చేసి శీఘ్రగతి సమ్మోదమ్ముతో స్నాతుడై.          25.

 

శ్రీపతి సూర్యుని స్తుతించుట

శా.        

నిత్యం బీజగమందు జేరి ద్యుతులన్ నిష్ఠన్ బ్రసాదింపగా

ప్రత్యక్షంబగుచుండు సన్నుతకరున్, ప్రద్యోతనుం గాంచి తా

నత్యంతంబగు భక్తిభావగరిమన్ హస్తంబులం జేర్చి హే

సత్యాకార! యహస్కరా! నతులివే సప్తాశ్వ! నీకంచనెన్.                26.

మ.       

దయజూపించు దివాకరా! ఖగవరా! దైన్యాంతకా! భాస్కరా!

జయసందోహము పొందు శక్తి నిడుమా! సత్కార్య దీక్షన్ సదా

భయ మింతేనియు నంటకుండు పగిదిన్ భక్తిన్ బ్రసాదించుచున్

క్షయ మొందించుచు నీరసత్వము నికన్ గాపాడవే దాసునిన్.           27.

మ.       

పరదేశంబున ధైర్యసంయుతుడనై భాగ్యంబునుం గాంచు త

త్సరణిన్ జూపుము నిన్ను నమ్మితి ప్రభూ! సమ్యక్ప్రభాభాసితా!

తరణీ! వందనమందుమయ్య! ద్యుమణీ! తత్ప్రాంత మందుండ నా

పరివారంబున కీవె రక్షకుడవో భానూ! యివే సన్నుతుల్.                28.

దండకం.

శ్రీహర్షవల్లీశ! లోకేశ! హేభాస్కరాహస్కరాదిత్య! హేమిత్ర! సప్తాశ్వ! హే ఉష్ణరశ్మీ! జగద్వ్యాపకా! లోకబంధూ! రవీ! భాను! మార్తాండ! దీప్తాంశు! నీరాకచే లోకముల్ వ్యాప్తమౌచుండు నీదీప్తిచే సత్త్వముల్ గూడు, నీదర్శనంబైన విశ్వంబు తేజంబునుం గూడి సర్వార్థముల్ గాంచగానెంచు నిన్గాంచినన్ సంతసంబుల్ లసచ్ఛక్తులుం గూడు దేవా! మహద్దీప్తులం జూపి భీతిన్ సమూలంబుగా ద్రుంచి ధైర్యంబునుం గూర్చి శక్తిన్ బ్రసాదించుచున్ తారతమ్యంబు లేవేళనుం జూపకే వెల్గులన్ బంచుచున్  విశ్వమున్ బ్రోచుచున్ సర్వకర్మంబులన్ సాక్షివై నిల్చుచున్ పిల్చిరా పిల్వలేదా యటంచున్ మహత్తర్కముం జేయకే నిత్య మీ భూమినిన్ వెల్గగా జేయు కార్యంబునున్ జేయగా వచ్చుచున్ దక్షతం జూపగా నెంచు నిన్నున్ శుభాకారు బ్రత్యక్షదైవంబవై సంతతం బిందు కన్పించు దేవున్ ధరాధారు నిత్యంబు గొల్తున్ స్వదేశంబునున్ వీడి దారిద్ర్యభూతంబు త్రాసంబునుం గూర్చగా తాళలేకున్నవాడన్గదా దూరదేశాన నొక్కింతయైనన్ ఫలంబందు నంచున్ బృహత్కాంక్షతో నేగుచున్నాడ, నీ దేశమున్ బాసి యన్యంబునం జేరు నాసాహసంబున్ క్షమించంగ నిన్గోరుచున్నాడ, నా దేశమందున్ జరించంగ శక్తిన్ బ్రసాదించి యందున్ సదా క్షేమముం గూర్చి నాకాంక్షనుం దీర్చి కాపాడవయ్యా కృపం జూపవయ్యా దయాసాగరా! సూర్యనారాయణా! దేవదేవా! నమస్తే నమస్తే నమస్తే నమః.                        29.

సీ.        

అనుచు నీరీతిగా నాదిత్యునిం గాంచి  సకలకర్మములందు సాక్షియగుట,

ప్రత్యక్షరూపాన నిత్య మీయిలలోన జవసత్త్వములు గూర్చు సరసుడగుట

తనకిష్టదైవమై ధైర్యంబు నందించి  నడిపించుచుండెడి నాథుడగుట

స్వపర భేదములేక విపరీత గతిలేక  చరియించుచుండెడి చతురుడగుట

తే.గీ.     

మోదకరుడౌట సర్వత్ర ఖేద మణచి

సస్యవృద్ధికి యుక్తమౌ శక్తి నిచ్చు

చుండు వాడౌట శ్రీపతి మెండు భక్తి

నంశుమాలికి దాసుడై యపుడు మ్రొక్కె.                                   30.

 

శ్రీపతి తన విదేశ గమనమునకు గ్రామస్థుల యనుమతి పొందుట

కం.       

వెలుగుల ఱేనికి నావిధి

బల మొసగగ మ్రొక్కి యపుడు పల్లెజనాలన్

కలియగ భావన జేయుచు

నిలు వెడలెను సద్గుణాఢ్యు డితడను నట్లున్.                               31.

సీ.        

రారయ్య! వినరయ్య! దూరదేశాలకు  పొట్టచేతను బట్టి పోవుచుంటి.

దౌర్భాగ్యమున జేసి దారిద్ర్యభూతంబు  నిత్యతాండవమింట నెరపుచుండె

చేతి కందగనున్న సస్యంబు నష్టమై  దిక్కు నాకెవ్వరో తెలియకుండె

మిత్రవాక్యముచేత మేలౌను నాకంచు నాప్రాంతమున కిప్పుడరుగుచుంటి

 

 

 

 

 

ఆ.వె.     

ప్పు చేసినాడ నెప్పుడో మీకడన్

లెక్కగట్టి దాని నొక్కటొకటి

తీర్చువాడ భావి దీవించి పంపుడు

మీరలంచు పల్లెవారి కనియె.                                                  32.

ఉ.        

వారును వీని వాక్యముల వాస్తవమున్ గ్రహియించి యుండుటన్

చారుగుణాఢ్యుడై సతము సత్యపథంబున సాగుచుండుటన్

"జేరును గాక సంపదలు, క్షేమములందును గాత నీకు, నీ

కోరిక తీరుగాక"యని కూర్మిని బల్కిరి సాధుభావనన్.                   33.

ఆ.వె.     

మిత్రగణమునుండి పుత్రులనుండియు

నూరివారినుండి యువిదనుండి

సర్వజనులనుండి సమ్మతినిం బొంది

యతడు సిద్ధపడియె నచటికేగ.                                               34.

చ.        

అమలిన సాధుభావయుతు డాతడు భూపతి శ్రీపతిన్ సఖున్

సమధిక హర్షసంయుతుని, సౌఖ్యయుతున్ బొనరించ బూని యా

నమునకు విత్త మేర్పరచి, నమ్మిన చోటను మాటలాడి త

త్సముఖము చేరగా దగిన తంతు ముగింపగ జేసె నేర్పునన్.          35.

శాలిని (మ త త గ గ - యతి 7వ అక్షరం)

వానిన్ గూడుం గాత భాగ్యంబు లందున్

దీనాధారుండైన దేవుండు వానిన్

తా నింపారన్ సర్వదా బ్రోచుచుండన్

మానం బందున్ భక్తమందారు సేవన్.                                       36.

ఇది బుధజనవిధేయుండును, హరివంశసంభూతుండును, శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వర పుణ్యదంపతీ తనూజుండును, గౌతమసగోత్రజుండునగు వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "జీవనయాత్ర" యను సామాజిక పద్యకృతి యందు  చతుర్థాశ్వాసంబు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

 

పంచమాశ్వాసము

కం.       

శ్రీలొసగును భాస్కరుడిక

మేలౌ స్వాస్థ్యంబు నిచ్చు మేదిని లోనన్

వాలాయము రక్షించును

మాలిన్యము ద్రుంచి వేసి మాన్యత గూర్చున్.                             1.

 

శ్రీపతి విదేశ గమనము – షేకుల వద్ద ఉద్యోగము చేయుట

ఉ.        

వారలు మిత్రు లిర్వురును పావనమై వెలుగొందు భావనల్

పూరితమైన చిత్తమున బోరన హైదరబాదు ప్రాంతమున్

జేరి విమానయానమున శీఘ్రముగాగ "కువైతు" దేశమున్

కోరికమీర నేగి రొక కొంత ప్రయాసము పొందకుండగన్.                2.

సీ.        

వారలా రీతిగా చేరి యా దేశాన

సేదదీరిన మీద శ్రీపతిఁ గొని

భూపతి యచ్చోట పూర్వ మెవ్వారితో

భాషించి యుండెనో వారి కడకు

జాగుసేయక యేగి సన్మిత్రు నటజూపి

యుద్యోగ మర్థించి యొప్పుమీర

వివరంబులం దెల్పి వినయాన్వితుడ వౌచు

మెలగుమా నీవంచు మిత్రునకును

ఆ.వె.     

తెలియజెప్పి యచటి తెరవంతయును నేర్పి

తాను పనులు చేయు స్థలమునకును

నాతడేగ నితడు హర్షమెంతయు నంది

మానసంబునందు వాని బొగడె.                                              3.

 

 

 

చ.        

మిత్రుడు గాడు కేవలము, మేలొనరించగ బూనినాడు స

త్పాత్రుడు గౌరవంబునకు, తల్లియు దండ్రియు నాకు నౌచు నే

మాత్రము స్వార్థ మూనకను మాన్యత గూర్చగ నెంచినాడు స

ర్వత్రయు వీనికందవలె భాగ్యము, సంతస మన్నిరీతులన్.             4.

మ.       

ఒక షేకాతని కేమి చేయవలెనో యొప్పంద పత్రంబునన్

సకలంబున్ లిఖియించి జూప నతడున్ సమ్మోదముం బొంది సం

తకముం జేసిన మీద వాని కచటన్ తద్యుక్తకార్యంబు నం

దకలంకంబగు శ్రద్ధతో మెలగగా నాదేశ మందెన్ దగన్.                   5.

చ.        

నిరతము వారిసేవకయి నిష్ఠను బూని వసించగావలెన్,

కరములు కట్టియుండవలె,  కాదనకుండగ నన్నికార్యముల్

సురుచిరమైన భావమున సుందర హాసముతోడ జేయ స

త్వరముగ నేగుచుండవలె వారల చెంతకు నన్నివేళలన్.                6.

కం.       

యజమానులు నిత్యంబును

భుజియించగ మిగిలియుండు భోజన మతడున్

నిజమిది తినవలె నిరతము

భజియించుచు కాళ్ళకాడ పడియుండవలెన్.                              7.

కం.       

వారొసగెడి పనులన్నియు

జేరుచు శీఘ్రంబుగాగ జేయుచు నుండెన్

దీరికను గోరకుండగ

నౌరా! యనిపించు రీతి నత డచ్చోటన్.                                    8.

ఉ.        

పెట్టినచో భుజించు నిక  పెట్టక యుండిన నాగ్రహంబు తో

ముట్టడి చేయ బూనడు ప్రమోదముతోడ జరించుగాని యే

పట్టున నీరసించి కనవచ్చెడు రీతిని నుండబో డికన్

తిట్టిన నైన నొవ్వకను ధీరత జూపును కార్యదీక్షతోన్.                     9.

 

సీ.        

చెప్పిన పనులెల్ల "జీ, హాఁ"యటంచును

చేయుచుండును చింత చేయబోడు,

వారి యాదేశంబు బహుకష్టతరమైన

పాటించు నే మంచు పలుకబోడు,

పగలైన నిశలైన పల్కుచుండును గాని

విశ్రాంతి లేదంచు వెరవబోడు,

వారు బానిసయట్లు వానిఁ జూచిన గాని

తల వంచు,  దొసగుగా దలచబోడు

ఆ.వె.      ఇంటివద్దనున్న యిల్లాలు సంతాన

మతని చిత్తమందు ననవరతము

మెదలుచుండ వాడు మేలును గాంక్షించి

కష్ట మెట్టిదైన నిష్టపడును.                                          10.

కం.       

నెలసరి జీతం బందగ

నలసటలను మరచిపోయి యానందమునన్

పొలతికి ధన మవ్వేళనె

వెలయంగా బంపుచుండు విజ్ఞతతోడన్.                                    11.

శ్రీపతి కువైతు సౌందర్యమున కబ్బుర పడుట

చ.        

అనుమతి తాను గైకొనియె నాయజమానులనుండి యొక్కనా

డినుమడియైన హర్షమున నింపగు నచ్చటి యందచందముల్

కననగు వాంఛతో నతడు కాంక్షలు దీరగ నందు నిందునన్

పనిగొని సంచరించి, కని, భావన చేసెను వాని సొంపులన్.               12.

శా.        

ఊహాతీతములై సమస్త భవనా లొప్పారుచుండెన్ గదా!

స్నేహస్థానములై మనోహరములై జేగీయమానంబులై

యాహా! దేవపురస్థ సౌధములుగా నత్యున్నతిం గల్గి దా

సోహం భావము చూచువారల మదిన్ చొప్పించుచుండెన్ గదా!     13.

 

                       

ఉ.        

ఇచ్చటి రాజమార్గములు నిచ్చటి వీధుల సుందరత్వ మౌ  

నిచ్చటి యాపణంబులును నిచ్చటి భాగ్యము లీప్రదేశముల్  

మెచ్చగ నొప్పు సత్య మిది మిక్కిలి యున్నత మన్ని రీతులన్

మచ్చిక గూర్చి యందరను మైమరపించును మాటి మాటికిన్.         14.

కం.       

అని యచ్చటి సౌందర్యము

కని శ్రీపతి యూహ జేసె కడు రమ్యముగా

ననుమానము లే దాస్థలి

న మందమునందు జూడగా భువి లోనన్.                              ౧౫.

శ్రీపతి విదేశముననుండి దారాపుత్రాదుల యోగక్షేమము లరయుట

ఉ.        

ఇచ్చట నేను క్షేమ మిక నింతి! నివాసము చేయుచుండిరా

యచ్చట మీరు చక్కగను? నందెనె పంపిన జీత? మందరున్

మెచ్చెడిరీతి పిల్లలను మిక్కిలి దక్షత బెంచుచుంటివా?

యుచ్చపదంబు లందుటకు నుత్తమ విద్యకు బంపుమా సఖీ!          16.

సీ.        

అనుచు నీరీతిగా నాతడర్థాంగితో

మాసాని కొకసారి మాటలాడు,

సంతసంబును గూర్చు, సంతానమును తాను

సాకు పద్ధతి చెప్పి సత్త్వమొసగు,

పిల్లవాండ్రను బిల్చి ప్రేమతో మాట్లాడి

సంతృప్తి బరచు నా సజ్జనుండు

దూరదేశమునందు చేరియున్నాడన్న

భావంబు రాకుండ బలుకరించు

తే.గీ.     

దూర వాణిని నాతండు వారి తోడ

క్రమత సల్లాపములు సల్పి సుమధురమగు

భావ మవ్వారి కందుచు చేవ గలుగు

మార్గమును జూపి తనివందు మరల మరల.                               17.

సీ.        

రెండేండ్ల కొకసారి మెండైన ప్రేమతో

పరివారమును జూచు వాంఛతోడ

చేతులు గట్టుక చేరి షేకుల వద్ద

సెలవును గైకొని స్వీయమైన

ధరణికి నేతెంచు తనవారినిం గాంచి

సంతృప్తి బొందును సంతసమున

యింటిలో విషయాల నిల్లాలితో గూడి

చర్చించి సరియైన సరణి దెలుపు

తే.గీ.     

జాగు చేయక పనిచేయు స్థలమునకును

తిరిగి వెళ్ళును నియతితో నిరత మతడు

షేకులను గొల్చు కార్యాన నా కువైతు

దేశమును జేరు నుద్యోగ దీక్షితుండు.                                        18.

శ్రీపతి భార్య శాంత సమర్ధవంతముగా కుటుంబమును నడిపించుట

చ.        

అతని సతీమణీతిలక మద్భుతరీతిని వాని భావమున్

చతురతతోడ గైకొనుచు సన్నుతు లందుచు బిడ్డలందరిన్

సతతము సాకుచుండు నిట, చక్కని విద్యల నేర్వజేయుచున్

పతి తమకోసమై సతము బంపెడు రూకలతోడ సాధ్వియై.               19.

చ.        

పొదుపరి యౌటచే మగడు పూర్వము చేసిన యట్టి యప్పులన్

సదమల చిత్త కావునను సర్వము దీర్చె క్రమక్రమంబుగా

నదనును జూచి శాంత యతి హర్షముతో  పతి కోరినట్లుగా

మదిని దలంచుచున్ కృషిని మానక చేయుచునుండె నచ్చటన్.       20.

చ.        

పొలమున గూడ సస్యము లపూర్వములైన విధాన నెంతయున్

బలపడి దీప్తి తోడ  ప్రతి వత్సర మిబ్బడి ముబ్బడిన్ బృహ

త్ఫలముల నిచ్చుచుండ ధనధాన్య సమృద్ధి గృహంబు జేరగా

నలఘు ముదంబు గల్గె నదియంతయు దైవ కృపాప్రభావమే.          21.

సీ.        

సంతానమును జూడ సత్ప్రవర్తనతోడ

విద్యలన్ నేర్చిరా విమలమతులు

స్నాతకోత్తరుడొండు స్నాతకు లిద్దరు

సాంకేతికములైన చదువులందు

శ్రేష్ఠాంకములతోడ జ్యేష్ఠత్వమును గాంచి

విద్యాలయంబులన్ వివిధగతుల

మెప్పు పొందుటె కాదు మేలైన కొల్వుకై

ఎంపిక యైనార లింపుమీర

ఆ.వె.     

ధన్య నైతి నంచు తల్లి యవ్వారినిం

గాంచి సంతసించు నతరముగ

పాత్రుల మయినాము భగవాను కృప కని

తనివి చెందు నామె యనవరతము.                                         22.

సీ.  

దైవమా నీకృపన్ దారిద్ర్య భూతంబు

తొలగి పోయిన దింట నలఘు సుఖము

చేరియున్నది నేడు సిరిసంపదలు గల్గె

లోటొకింతయులేదు  పాటవమున

సవ్య విద్యలు నేర్చి సంతాన మీనాడు

సామర్ధ్యమును తాము చాటినారు

మగని నింటికి జేర్చి మమ్మేలుకోవయ్య

సతత మానందాన నతులొనర్తు  

తే. గీ.    

ననుచు నిబ్భంగి  యా శాంత యనుదినంబు

దైవమును జేరి ప్రార్థించు తన్మయమున

సతము తనవారి క్షేమంబు సవ్యమతిని

తలచు చుండెడి యిల్లాలు ధన్య నిజము.                                  ౨౩.

 

 

శ్రీపతి స్వదేశమునకు మరలిపోదలచుట

ఉ.        

శ్రీపతి యచ్చటన్ పనులు చేయుచు  షేకుల చెంత నెంతయే

నోపిక తోడ మానసము లుబ్బగ జేయుచు వారి దౌష్ట్యమున్

సైపుచు సంతుకున్ సతికి సౌఖ్యము గూర్చుట ముఖ్యమంచు తా

నాపరదేశమందు బహు యాతనలందెను దీర్ఘకాలమున్.                 24.

చ.

ఇరువది వత్సరంబు లట నీగతి సాగిన మీద నాతడున్

నిరతము డబ్బుకోసమయి నేనొక యంత్రము వోలె యిచ్చటన్

వరపరివారసభ్యులకు పావన సన్నుత  జన్మభూమికిన్

దొరకొని దూరమైతినని దుఃఖము నందుచు నెంచె నీగతిన్. ౨౫.

సీ.        

బహుళ దారిద్ర్యాన నహరహంబును గుంది

            జీవచ్ఛవంబనై చేరితి నిట

దైవానుకంపచే ధనమింత సమకూరె

            యిడుముల సంత్రాస మిపుడు లేదు

సంతాన మందరు చదువరు లైనారు

            లేదింత ఋణబాధ పేదరికము

నశియించె  క్షేత్రాన నానారకంబులౌ

            సస్యమందుచు నుండె చక్కగాను

తే.గీ.     

ఇట్టి సమయాన నిటనుండ నేల నాకు

జన్మభూమికి నికనేగి  సఖియతోడ

పుత్ర గమితోడ హితులైన మిత్ర గణము

తోడ సుఖముండ గలవాడ నాడ ననుచు.                                   26.

చ.        

తనదేశంబున కేగగా దలచి యాతండంత శీఘ్రంబుగా

వనవాస స్థితి వీడునింక ననుచున్ భావించి సాహబ్, హుజూ

రని యా షేకుల చెంత నమ్రుడయి శ్రావ్యంబైన వాక్యంబులన్

మనమందున్న విధంబు దెల్పి విడువన్ మాటాడి తానంతటన్.        ౨౭.

సీ.        

అవ్వారితో నున్న యన్నిసంబంధాల   

            కింపైన రీతి ముగింపు బలికి

వరుసగా నందున్న పరిచయస్థులనుండి 

            వీడ్కోలు తానంది వేగముగను

భూపతి వసియించు దాపున కపుడేగి

            ప్రాణమిత్రుని తోడ బహుళ గతుల

మాట్లాడి సెలవంది మరువనీ జన్మలో

            మాన్యుడా నిన్నంచు మరల మరల 

ఆ.వె.     

ధన్యవాదమొసగి  తడయక పయనమై

వలయు లాంఛనంబు లల ముగించి

యమిత మైన యట్టి యానందమున వాడు

దూసి చేరె ప్రేమ కాస పడుచు.                                                ౨౮.

శ్రీపతి స్వగ్రామమును చేరి సంతసించుట – పిల్లల వివాహము

శా.        

క్షేమంబుండి యతండు గేహమునకున్ జేరంగ నెంతేనియున్

శ్రీమత్యాదుల సంతసంబున మితుల్ లేవయ్యె గ్రామస్థులున్

బ్రేమం బొప్పగ బల్కరించుటను సర్వేశుండు నాకిట్టు లీ

భూమిన్ జేరెడు భాగ్యమిచ్చె త్రిజగత్పూజ్యుండు తానంచనెన్.       29.

శా.        

ఎన్నో యేండ్లుగ దూరమైతిని గదా! యీప్రేమ సంపత్తికిన్

మన్నింపదగు పేరు సైత మచటన్ మారెన్ గదా మృగ్యమై

మున్నేజన్మను జేసినట్టి యమో మోదంబునుం ద్రుంచె  లే

కున్నన్ నాకు టించి యుండవు గదా! ఘోరంబులౌ కష్టముల్.     30.

ఆ.వె.     

అనుచు పూర్వమందు తనకు కల్గినయట్టి

కష్టతతికి నైన కారణంబు

లెంచి నేడు తొలగి యంచితం బైనట్టి

హాయి గలుగ నలరె  యనుపమముగ.                                      31.

ఆ.వె.     

చేని దర్శనంబు చేసి యందున్నట్టి

సస్యవృద్ధి గాంచి సన్మతియయి

నాదు జన్మ భూమి నాకంబు కంటెను

మిన్నయంచు వాడు మిగుల బొంగె.                                       32.

శా.        

శాంతా శ్రీపతి దంపతుల్  మనములో సద్యోచనల్ చేసి యా

సంతానంబున కీడు జోడగు లసత్సంబంధముల్ చూచి ధీ

మంతుల్ గాగ పరీక్ష చేసి మనువుల్ మాన్యత్వముం గాంచగా

సంతోషంబున చేసినారలు సుతుల్ సంతృప్తినిం బొందగన్.            ౩౩.

కం.       

పుత్రికకు పరిణయంబును 

పాత్రుని నొకవాని జూచి పరమ ప్రీతిన్

గోత్రంబు ధన్యమౌ నని

నేత్రానందంబుగాగ నెరపిరి వారల్.                                          34.

శ్రీపతి సంతానము విదేశములకేగుట

సీ.        

హర్ష సంయుక్తులై యవ్వార లారీతి

            సంతానమును జూచి సర్వ గతుల

హాయినందుచు కాల మాగ్రామ మందున

            గడుపుచుండెడి వేళ నతరముగ

నల్లు డొక్కడె కాదు పిల్ల లిద్దరు జూడ

            నుద్యోగముల నంది యున్నతి గన

పాశ్చాత్య దేశాలు పడతులనుం గూడి

            యేగనుండుట గూర్చి యెరుక పరచి

తే.గీ.     

తాము పనిచేయు సంస్థల తరఫునుండి

యనుగుణం బైన యాదేశ మంది వార

లుచిత మైనట్టి యేర్పాటు లొప్పు మీర

చేసుకొని  యంత జనకుల చెంత జేరి.                                      35.

శా.        

మాకాంక్షల్ నెరవేరనున్న విపుడున్ మాయున్నతిన్ సర్వదా

యాకాంక్షించెడి తల్లిదండ్రు లగుటన్ హర్షంబు మాకందగా

మాకాశీస్సుల నందజేయవలయున్ మాన్యత్వముం బొంది మే

మేకాలం బట క్షేమమందుటకునై యింపారు సౌఖ్యంబుతోన్.             36.

మ.       

అనుచున్ బుత్రులు నల్లుడుం బలుకగా నాసామియున్ భార్యయున్

మనసారంగ శుభాశిషం బిడుచు సమ్మానంబు మీరందు డో

తనయుల్! పశ్చిమదేశమం దని సుధాధారాభ సద్వాక్కులన్

వినయాలంకృతులై చరించు డనుచున్ వీడ్కోలు నందించుచున్.     37.

శా.        

ఖద్యోతా! ద్యుతిదాయకా! దినమణీ! కారుణ్య రత్నాకరా!

విద్యల్ నేర్వగ జూపినా వికపయిన్ వీరిన్ విదేశంబునన్

మద్యాదుల్ దరిజేరకుండ హృదులన్  మాలిన్యముం గూల్చుచున్

హృద్యంబై వెలుగొందు కీర్తి నిడుచున్ హే భాస్కరా! కావుమా!        38.

ఆ.వె.     

అనుచు సూర్య దేవు నభిమాన దైవమున్

సంతు కచట మిగుల సౌఖ్య మొసగి

కరుణ జూపుచుండి కాపాడుమా యంచు

నతులొసంగి కోరి రతుల భక్తి.                                               39.

తే. గీ.    

జగతిలోనను సంతాన మగణిత మగు

సౌఖ్యమును గాంచ నద్దాన జన్మదులకు

హర్ష మొదవుచు నుండును హాయి గలుగు

గాన కాంక్షింతు రవ్వారి నత నెపుడు.                                    40.

ఉ.        

వారు విదేశమేగి యట వాసిని గాంచుచు నున్నవేళ న

వ్వారికి నాత్మజుల్ గలిగి భాగ్యము పండగ తద్విశేషముల్

తీరిక వేళ దెల్పి పితృదేవుని తల్లిని బల్కరించుచున్

కోరుచునుంద్రు దీవెనలు కూరిమి జూపుచు దూరవాణిలోన్.          41.

 

శా.        

అంతర్జాలమునందు దర్శనములన్ హర్షో క్తులన్ సల్పుచున్

సంతోషింతురు గాని జన్మభువికిన్ సన్నద్ధులై  చేరుటల్

సుంతైనన్ దలపంగ బోవ రభిలాషుల్ వార లచ్చోట న

త్యంతంబైన ధనంబు కీర్తి గొనగా నౌరా! విచిత్రంబుగన్.                42.

ఆ.వె.     

మాతృభూమియన్న మమకార మొక్కింత

కానరాదు వారి కాంక్ష లన్ని

ధనము కూడబెట్టి దర్పంపు నందుటన్

నిండి యుండు సతము నిశ్చయముగ.                                     43.

ఆ.వె.     

వారి పిల్లలైన నేరోజునం గాని

తమ పితామహు లని తలచ బోరు

భవము కూడ తమకు పాశ్చాత్యదేశాన

నైన కారణాన ననగవచ్చు.                                                    44.

 

వృద్ధాప్యమున సంతానము దూరగత మగుటచే  శ్రీపతి పరితపించుట

సీ.        

దారిద్ర్యబాధచే తాళలే కానాడు

            దూరదేశము నేను చేరినాడ

మరబొమ్మకును బోలె సిరిసంపదలగోరి

            ప్రేమానురాగాల పేరుకైన

దరిదాపులను జేరు సరణి కొక్కింతైన

            నోచలేకుండుటన్ నొచ్చినాడ

యిప్పుడీరీతిగా నెంతేని యైశ్వర్య

            మందియుండియు సౌఖ్య మనుభవించు

తే.గీ.      భాగ్య మించుక లేదాయె పావనమగు

పుత్రపౌత్రాది సంపత్తి చిత్రముగను

దూరమైపోయె చెంతకు చేరకుండె

నౌర! దేవుని లీల లేమనగ వచ్చు.                               45.

 

కం.       

మనమొకటి తలంచిన నా

సకలాధారుండు ప్రభుడు సర్వజ్ఞుండై

యకలంకమైన భావన

నొక టన్యము తలచుచుంట నుర్విం గనమే.                               46.  

శా.        

వారల్ ఖ్యాతి గడింపగోరి యనినన్ వారింపలేనైతి ని

ప్డీ రీతిన్ బహుభారవృద్ధ దశలో నేమాత్ర మూతంబు లే

కౌరా! యొంటరిజీవితంబు కనగానౌనంచు నూహింప లే

దేరైనన్ లిఖితంబు మార్చగలరే యీ పృథ్విపై నెన్నడున్.              47.

ఉ.        

జీవనయాత్రలో నతివిచిత్రములైనటువంటి సంగతుల్

దైవము కూర్చుచుండు గద, తద్ఘటనల్ నిరతంబు భీతితో

భావన చేయుచుండుటయు భావ్యముగా దిక నెట్టు లిచ్చటన్

గావగ నెంచెనో ప్రభుడు కాదగు కార్యము కాక మానునే.                48.

ఆ.వె.     

అనుచు మనసు నిట్టు లా కర్షకాగ్రణి

దిటవు పరచుకొనుచు స్థిరత మీర

భార్య ననునయించి భగవానునకు మ్రొక్కి

సేద్య మచట తాను చేయసాగె.                                               49.

ఉ.        

జన్మము నుండియే రవికి చక్కని భక్తునిగా మెలంగుచున్

సన్మతి యౌటచే నతడు సర్వజగంబులలోన దీప్తులన్

చిన్మయుడౌచు నింపు జనజీవనదాత నహస్కరున్ మదిన్

తన్మయుడౌచు గొల్చు సతతంబును సత్త్వము పొందగోరుచున్.     50.

ఉ.        

దీనులసేవకై యతుల దీక్షనుబూని చరించుచుండు స

న్మానముగా దలంచునది, నమ్మును జీవనయాత్ర లోన సం

ధానము చేయు నయ్యదియె దార్ఢ్యత నంచు మహద్వివేకియై

జ్ఞానమయాత్ముడై గడప సాగెను శాంతనుగూడి యచ్చటన్.           51.

 

 

సీ.         వ్యవసాయ కర్మమే భవసాగరములోని

                        ముత్తియంబని తాను మురియుచుండి

            పశురక్షణములోన వశమౌను సౌఖ్యంబు

                        తథ్య మియ్యది యంచు దలచుచుండి

            దేవతాస్మరణమే జీవనంబునకెల్ల

                        తారకంబని దేవుఁ జీరుచుండి

            మానవసేవయే మాధవు సత్సేవ

                        యిలపైన నిజమంచు నెంచుచుండి

ఆ.వె.      శేషజీవితాన శ్రేయస్కరంబైన

            మార్గ మిది యటంచు మరల మరల

            స్వాంత మందు నిలిపి  సద్భావదీప్తితో

            చేయసాగె నతడు జీవనంబు.                                     52.

సీ.        

మావాడు వీడండ్రు మంచి మిత్రుండండ్రు

            గ్రామస్థులవ్వాని కర్మలకును

చిరకాల బంధువీ శ్రీపతి మాకండ్రు

            పరిచయస్థులు వాని చరితమునకు

దీనబంధుడు వీడు దివ్యాంశజుండండ్రు

            భాగ్యహీనులు వాని యోగ్యతకును

సన్నుతాచారుండు సన్మార్గగము డండ్రు

            సజ్జనావళి వాని చలనమునకు

ఆ.వె.      బహుళ యశము లిట్లు పడయుచు నాతండు

            పరుల సేవలోన నిరత హర్ష

            మనుభవించుచుండి యత్యుత్తమం బైన

            సాధువర్తనంబు సలుపు చుండె.                                  53.

కం.       

జగమును పరివారంబుగ

నగణిత సద్భావపూర్ణు డా శ్రీపతి తా

దగురీతి నెంచి పరహిత

మగు కార్యము చేయుచుండె ననవరతంబున్.                            54.

ఉ.        

పిల్లలు దూరమేగిరని వేదన చెందెడివారు లోకమం

దెల్లర నాత్మబంధులని యెంచు మహత్త్వము చిత్తమందు రా

జిల్లగ సంచరించినను చిత్సుఖ మందదె, జీవితంబునన్

దొల్లిటి దుఃఖముల్ తొలగి తోరపు హర్షము కల్గకుండునే.                 55.

కం.        ఒకరిద్దరు గారతనికి

            సకలంబును గ్రామమందు సన్నుతమతులై

            యకలుషమగు ప్రేమంబును

            ప్రకటించుచు నుండి రాత్మ బంధువు లగుచున్.                         56.

చం.      

జగమును సృష్టిచేసి జనసంము నెల్లెడ రక్ష చేయుచున్

సుగుణగణంబు లిచ్చి పరిశుద్ధములైన మనోవికారముల్

తగువిధి నందజేయుచు నుదారత జూపుచు నంత్యమందునన్

సుగతిని జూపునట్టి సరసుండు జగత్పతి సత్య మెందునన్.            57.

కం.        రంగారు భంగి జనులకు

            మంగళములు కలుగజేసి మహిమాన్వితమౌ

            సంగతిని గూర్చుచుండెడు

            మంగాపతి బ్రోచుగాత మహినెల్లెడలన్.             58.

రుచిరము (జ భ స జ గ యతి 9వ అక్షరం)

            మనంబు నందు నటులె మాట లందునన్

            కనంగ నెల్ల యెడల కర్మ లన్నిటన్

            నంబు గాగ సమత కాన వచ్చినన్

            సనాతనుండె  యిడును సర్వసౌఖ్యముల్ .                     59.

ఇది బుధజనవిధేయుండును, హరివంశసంభూతుండును, శ్రీమత్సామ్రాజ్యలక్ష్మీవేంకటేశ్వర పుణ్యదంపతీ తనూజుండును, గౌతమసగోత్రజుండునగు వేంకటసత్యనారాయణమూర్తి ప్రణీతంబైన "జీవనయాత్ర" యను సామాజిక పద్యకృతి యందు  పంచామాశ్వాసంబు.

సర్వం సంపూర్ణమ్.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

No comments:

Post a Comment