Friday 2 October 2020

బామ్మ

 

బామ్మ

ఉ.

అమ్మ దివంబు జేరి మము నాగని దుఃఖము నందు ముంచగా

గ్రమ్మిన చీకటిన్ దరిమి కానగు రీతిని సాకినట్టి మా

'బామ్మ' యనంతసత్వపరిపాలిత, సార్థకనామధేయ, 'దు

ర్గమ్మ', మమత్వ దీపిత, సురత్వము గాంచి గమించె మ్రొక్కెదన్.             1.

ఉ.

మాకును దండ్రికిన్ నిజము మాతగ వత్సలతాసుగంధమున్

జేకొను డంచు బంచుచును జేర్చుచు నక్కున ధైర్యదీప్తులన్

బ్రాకగ జేసి నెమ్మదిని బల్కులలోన  సుధాప్రవాహముల్

ప్రాకటమౌ గతిన్ సతము బంచిన 'బామ్మ'కు నంజలించెదన్.                   2.

ఉ.

ఆయమ జ్ఞానసంపదల నాత్మను నింపిన విజ్ఞమూర్తి,

త్యాయతకీర్తిసంయుత, ముదంబును గూర్చెడి సత్పథంబులా

ప్యాయత తోడ నందరకు నందగ జూపుచు గ్రామవాసులన్,

స్వీయకుటుంబసభ్యులను క్షేమసమీపము జేర్చె మ్రొక్కెదన్.                   3.

ఉ.

ధీయుత, ధర్మతత్వగుణదీపిత, యున్నతభావయుక్త ,మా

కేయెడ కష్టసంతతుల నిమ్మహి జేరగ నీయకుండ మా

నాయన కమ్మయై సతత నైష్ఠికయై మము దీర్చి దిద్ది ని

త్యాయతహర్షముల్ నిలుపు నామెను బామ్మను ప్రస్తుతించెదన్.               4.

ఉ.

కమ్మని వాక్యసంపద, యకల్మషభావము, తత్సమాన క

ర్మమ్ములతోడ నిచ్చలును మాన్యత గాంచిన దాప్తయౌచు దా

నిమ్మహి బంధువర్గమున నీయమ నందరు సొంతతల్లిగా

నమ్మిరి నేను నిత్యము ప్రణామము చేసెద బామ్మకున్ మదిన్.                 5.

ఉ.

ఈయమ స్వర్గమేగి కన నెన్నియొ యేండ్లు గతించె  నైన నా

కీయెడ నీమె నిల్చి నను నిందు భుజంబును దట్టుచుండి నా

ధ్యేయము నందు ధైర్యమును దెల్పుచు నుండిన రీతి గన్పడున్

గాయము బుల్కరించు మది గ్రమ్మును సత్వము బామ్మ నెంచినన్.         6.

 

 

.వేం..నా.మూర్తి.

23.9.20.

No comments:

Post a Comment