Friday 2 October 2020

శ్రీ (ఏటూరి)సో మే శ్వ ర శ త క ము

 

శ్రీరామ

శ్రీ (ఏటూరి)సో మే శ్వ ర శ త క ము

రచయిత

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

 

శ్రీ సోమేశ్వర శతకము.

 (ఛందము : శార్దూల మత్తేభములు)

 

శ్రీమంతంబగు సచ్చరిత్ర కిరవై  క్షేమాన్వితం బౌచు నీ

భూమిన్ శోభిలు ప్రాంతమందు జనులన్ బూజ్యార్హులన్ జేయగా

స్వామీ! యేటురుగ్రామసీమను నివాసార్థంబు నీవెంచుచున్

నీమాహాత్మ్యము జూపనుంటివిగదా నిత్యంబు సోమేశ్వరా!             1.

 

శ్రీవిఘ్నేశ్వరముఖ్యదేవతలకున్ జేకారమున్ జేసి స

ద్భావంబున్ గొని నీపయిన్ శతసుపద్యంబుల్ శివా! పల్కగా

నీవేళన్ మదిలో దలంచితిని నాకీకార్యమం దీవు హే

దేవా! స్థైర్యము, ధైర్యముం గరపుమా దీవించి సోమేశ్వరా!               2.

 

ఈనాకార్యమునందునన్ జయము నాకిప్పించ సద్వాక్యముల్

జ్ఞానాధారములై వెలుంగునటులన్ సవ్యంబుగా గూర్చువా

రౌనారాయణశాస్త్రిముఖ్య గురులన్ బ్రార్థించి ప్రాచీనులన్

ధ్యానింతున్ గవివర్యులన్ స్మరహరా! దండంబు సోమేశ్వరా!          ౩.

 

సంగళ్ళాఖ్యపురాన విజ్ఞమతులై సన్మార్గమందేగు స

త్సంగానుష్ఠిత వేంకటేశ్వరునకున్ సామ్రాజ్య లక్ష్మ్యంబకున్

గంగాశేఖర! పుత్రుడన్ శుభనతాకారుండ నీభక్తుడన్

లింగా! సత్యమటండ్రు నన్ నుతులు  కాళీనాథ! సోమేశ్వరా!          4.

 

గంగాపార్వతు లిద్దరన్ ముదముతో కైలాసవాసా! శివా!

రంగారంగను నీకెడన్ నిలుపుచున్ రమ్యాతిరమ్యంబుగా

లింగాకారము దాల్చి యేటురుపురిన్ లీలావిలాసంబులన్

సంగీతప్రియ! చూప బూనితి వహో సత్యమ్ము సోమేశ్వరా!            5.

 

 

 

కృష్ణాప్రాంతమునందు శుద్ధమతులై కీర్తించు భక్తాళికిన్

తృష్ణల్ దీర్చి శుభంబు గూర్చుటకునై దేవా!జగద్రక్షలో

నిష్ణాతుండవు గాన యేటురు పురిన్ నిత్యప్రసన్నుండవై 

కృష్ణారాధిత! కొల్వుదీరిన నినున్ గీర్తింతు సోమేశ్వరా!                  6.

 

దైవంబుల్ గల రెందరేని జగతిన్ దథ్యంబుగా కామనల్

సేవల్ సేయగ దీర్చువార లయినన్ చిద్రూప! నిత్యంబులౌ

భావానందములన్ టించి మహదైశ్వర్యంబు లందించి యా

కైవల్యంబున జేర్చు నీకు నిడుదున్ గైమోడ్పు సోమేశ్వరా!             7.

 

ఆగంగాసతి నీ శిరస్సుపయినన్ హర్షాతిరేకంబుతో

సాగించగను నిత్యనృత్యము హరా! శైలాత్మజాతన్ మహ

ద్రాగాపూరితమానసుండవగుచున్ రమ్యంబుగా దేహమం

దౌగాకంచును నిల్పు నిన్ను చతురుం డౌనందు సోమేశ్వరా!          8.

 

కైలాసాధిప! నీదు సేవలకునై కాంక్షించి నిత్యం బిలన్

బ్రాలేయాచలకన్యకన్ ముదముతో బ్రార్థించినన్ గావగా

జాలంబేల నుమాధవా! కరుణతో సత్వంబు చేకూర్చి నీ

లీలల్ జూపుము వందనంబులివె శూలీ! నీకు సోమేశ్వరా!              9.

 

నీవే సర్వశుభప్రదాతవనుచున్ నిన్నందరీ నేలపై

భావంబందుననిల్పిగొల్త్రు శుభముల్ వాటిల్లు నీచేతనే

సేవల్ నీకయి చేతు రార్తులారు నిలపై క్షిప్రంబు నీవల్లనే

నీవేత్రాతవు నీకులేదెన ద్యుతుల్ నీయందు సోమేశ్వరా!                10.

 

లింగాకారముతోడ భూమిపయి నీలీలల్ ప్రదర్శించి స

త్సంగం బందగజేసి భక్తతతులన్ ధన్యాత్ములన్ జేయ నీ

యంగీకారము దెల్పి మావినతులం దాత్మీయతన్ జూపుచున్

గంగాసన్నుత! రక్షసేయు మనుచున్ గైమోడ్తు  సోమేశ్వరా!            11.

 

 

 

సర్వైశ్వర్యము లిచ్చువాడ వగుచున్ సర్వ ప్రయత్నంబునన్

శర్వా! భస్మము  బూసి కాయము పయిన్ చర్మాంబరజ్యోత్స్నలే

పర్వన్ బ్రేతభువిన్ జరించు విధముల్ భక్తాళి కీ జన్మమం

దుర్విన్సత్యము దెల్పబూనుటయనౌ నొండౌనె సోమేశ్వరా!            12.

 

నీనామంబు జపించు వారలగుచున్ నిత్యంబు నీసేవలో

నోనాగేంద్రవిభూషితా! విపులమౌ నుత్సాహమున్ జూపుచున్

దీనారాధ్యుడవంచు జేరు జనులన్ దీవించి పాపంబులిం

దేనా డంటని రీతి గావవలె నీ వేటూరి  సోమేశ్వరా!                        13.

 

సామీప్యంబున నుండు శుద్ధజలమున్ స్నానార్థ మేవేళనున్

స్వామీ! నీకయి తెచ్చి కూర్చగ మహద్భాగ్యాన్వితుం జేసి యీ

భూమిన్ వానిని సత్వసంయుతునిగా పూజ్యార్హతన్ జూపి సత్

క్షేమం బెల్లవిధాల గూర్తువుగదా చిద్రూప! సోమేశ్వరా!                    14.

 

భోళాశంకర! సర్వవేదవినుతా! భూతేశ! గంగాధరా!

కాళీసన్నుత! కామితార్థఫలదా! కల్యాణకారీ! శివా!

వ్యాళేంద్రాభరణా! యుమాధవ! భవా! భాగ్యప్రదా! హర్షముల్

నాళీకాసనముఖ్యదేవవినుతా! నాకిమ్ము సోమేశ్వరా!                     15.

 

బిల్వంబున్ గొని నిన్ను క్షిప్రవరదున్ వేదోక్త సద్రీతిలో

గొల్వం జేరితి దేవదేవ! కొనుమా! కూర్మిన్ ప్రసారించుచున్

బల్వాక్యంబు లికేల? నమ్మితి నినున్ ఫాలేక్షణా! సత్యముల్

తెల్వం జాలెడి శక్తి నాకొసగుమా! దీవించి సోమేశ్వరా!                   16.

 

సౌందర్యంబుల రాశియౌ గిరిజనున్ సాక్షాత్స్వదేహంబునం

దందంబొప్పగ జేర్చి యుంటి వకటా! యన్నాతినిన్ నీకునై

సందేహించక కూర్చు మన్మథుని నాశం బొందగా జేయుటల్

వందారుశ్రితవత్సలా! యుచితమా? వాదేల  సోమేశ్వరా!              17.

 

 

 

మార్కండేయుని బాలభక్తుని జగన్మాన్యున్ జిరంజీవిగా

నర్కన్యర్బుదదీప్తిమంత! విపులవ్యాఘాతమందించగా

తర్కంబుం బొనరించు కాలుని మహద్దౌష్ట్యంబునుం ద్రుంచి నీ

కోర్కిన్ దెల్పి యొనర్పవే శుభము చేకొన్మంచు సోమేశ్వరా!          18.

 

సంగీతప్రియ! సర్వవేదవిదితా! సద్భాగ్యదా! శాశ్వతా!

గంగానాయక! కావ్యశాస్త్రవినుతా! కాత్యాయనీకామ్యదా!

భృంగీశప్రముఖార్చితా! విధినుతా! విశ్వప్రభూ! విస్తృతా!

యంగీకారముజూపి కావు మవనిన్ హర్షాన సోమేశ్వరా!                 19.

 

శ్రీ గం గా పా ర్వ తీ స మే త సో మే శ్వ ర స్వా మీ

నీ కు న మ స్కా ర ము

(పద్యాద్యక్షర నిక్షిప్త నమస్కారము)

శ్రీనారాయణ ధాతృముఖ్య  దివుజుల్  క్షేమంబులం గాంచగా

నీనామంబు జపించుచుందురుగదా! నిష్ఠాగరిష్ఠాత్ములై

మానం బోవను నిన్ను గొల్చుట జగన్మాన్యా! కృపాసాగరా!

జ్ఞానం బింతయొసంగుమా మనుటకై సర్వేశ! సోమేశ్వరా! 20.

 

గంభీరాకృతి దాల్చి భక్తుని పయిన్ కాఠిన్య మింతేనియున్

శంభో! చూపకుమయ్య! నిన్ను గొలుతున్ సత్యంబు  రక్షించు సం

రంభం బింతయు గాంచకుంటిని గదా! ప్రార్ధింతు వేదోక్త సత్

సంభారంబులతో శుభంబు లిడుమా సర్వత్ర సోమేశ్వరా!  21.       

గారాబం బొకయింత జూపి గొలుతున్ గైలాసవాసా! భవత్

దారాపుత్రగణాదిబంధులవలెన్ దాక్షిణ్యభావంబుతో

నీరేజాక్షసఖా! ననున్ నిలుపుమా నిత్యప్రసన్నార్యసం

చారప్రాంతమునందు నీకిదె నమస్కారమ్ము సోమేశ్వరా!               22.

 

పారుష్యంబు వహించి భక్తునిపయిన్ వాత్సల్యమున్ వీడి దు

ర్వారంబైన మహాపదన్ నిలుపుటల్ బాగౌనె? నీవేలనో

కారుణ్యంబు వహించకుంటి వకటా! గంగాధరా! శంకరా!

వేరెవ్వారిట బ్రోచువారలు భువిన్ విశ్వేశ! సోమేశ్వరా!                   23.

 

"ర్వప్రప్ర"మ్మనురీతి వ్యర్థపదముల్ వాక్యంబులున్ బేర్చుచున్

క్షిప్రప్రాభవ మందగోరి కవితాశ్రీలంచు యోచించు నా

దౌప్రజ్ఞన్ గని నవ్వబోకుమయ నీదౌ గాదె భారంబు నా

పై ప్రేమన్ ప్రసరింపజేసి ఫలముల్ పండింప సోమేశ్వరా!                24.

 

తీరైనట్టి ఫలంబులున్, గుసుమముల్  దీవ్యత్ ప్రభల్  చిమ్ముచున్

సౌరుల్ గూర్చెడి వస్త్ర రత్న చయసత్సంభారముల్ నీ విలన్

గోరం బోవవు నిర్మలోదమునకే కూర్మిన్ ప్రసాదించుచున్

జేరం జూతువు గావ భక్తజనులన్ శ్రీకంఠ! సోమేశ్వరా!                 25.

 

ర్పాలంకృత! సాధుసజ్జనహితా! సర్వార్థసంపత్ప్రదా!

నేర్పుం జూపుచునుందు వెల్లగతులన్ నీభక్తులన్ బ్రోవగా

కార్పణ్యంబును ద్రుంచి వత్సలుడవై కావన్ శుభం బెల్లెడన్

గూర్పన్ వేడెద వీడు మీ బడుగుపై కోపమ్ము సోమేశ్వరా!               26.

 

మేలైనట్టి విధాన జీవనగతిన్ మిథ్యాప్రపంచంబునన్

గాలౌచిత్యము గాంచి సాగుగతికిన్ గానైన మార్గంబు నీ

లీలం జూపుచు దెల్పుచున్ గరుణతో లింగా! ననున్ బ్రేమతో

బాలించంగను గాంక్షసేయు మనుచున్ బ్రార్థింతు సోమేశ్వరా!        27.

 

ల్లిం దండ్రిని జ్యేష్ఠులన్ గురువులన్ ధర్మాత్ములన్ నాతులన్

కల్లల్ నేర్వని సజ్జనాళిని, జగత్కల్యాణముం గోరుచున్

సల్లాపంబుల నాడు యోగ్యజనులన్ సద్భావ మొప్పార నా

యుల్లం బందున గౌరవించు బలమి మ్మోదేవ! సోమేశ్వరా!            28.

సోదుల్ పల్కును వీడటంచు నను నో శుభ్రాభదేహా!శివా!

నాదాత్మా! శపియింప జూడవల దోనాగేంద్రసద్భూషణా!

లే దింతేనియు జ్ఞాన మేను ఖలుడన్ లేవయ్యె సంస్కారముల్

మోదప్రాపక! రక్షసేయుటయెపో ముఖ్యంబు సోమేశ్వరా!                29.

 

మేనం జేరెడు రోగముల్ హృదయభూమిం జీల్చు భావంబులున్

నానానేకమహాపదల్ స్థిరసుఖానందంబునుం గూర్చు నిన్

ధ్యానించన్ గని యడ్డుచున్నవకటా దైవంబ! దీనాత్ము నీ

వానిన్ నన్ను క్షమించి కావుమని నే బ్రార్థింతు సోమేశ్వరా! 30.

                                               

శ్వసనుం డగ్ని సమస్తదిక్పతులు స్రస్టాద్యాదితేయుల్ మునుల్

రసనాగ్రంబున వాణినిన్ నిలుపు వారల్ సాహితీమూర్తులున్

దెసలన్ గీర్తుల నింపియున్న సుమహత్తేజఃప్రభావుల్ శివా!

యసమాక్షా! భవదీయ దాసులగుటన్ హర్షింత్రు సోమేశ్వరా!           31.

 

వ్యాది గ్రహముల్ విహాయసలసద్రమ్యర్ క్షసంఘంబులున్

దీవ్యద్వ్యాప్తికి కారణం బయి సుఖాదిన్ దెల్పు కాలం బిటన్

భవ్యానందవిధాయకా! భవ! యుమాప్రాణేశ! నీయాజ్ఞచే

సవ్యత్వంబును గాంచుచున్నవిగదా సర్వజ్ఞ! సోమేశ్వరా! 32.

           

స్వామీ! శంకర! సర్వవేదవినుతా! శైలాత్మజానాయకా!

నీమాహాత్మ్యమనంత భక్తియుతులై నిత్యంబు నిన్ గొల్వగా

తామై చేరెడి ధాతృముఖ్యదివిజుల్ తథ్యమ్ము వర్ణింపలే

రోమృత్యుంజయ! నాకు సాధ్యమగునా? యోచింప సోమేశ్వరా!      33.

           

మీనాద్యద్భుతరూపముల్ ముదముతో మేలందజేయన్ భువిన్

తానై యందిన మాధవుండు సఖుడై త్వత్పాదపద్మంబులం

దానందంబుగ మ్రొక్కుచుండ కృపతో నందించి సత్వంబు ల

వ్వానిన్ జేయవె చక్రిగా గిరిసుతాప్రాణేశ! సోమేశ్వరా!                   34.

నీవానిన్ నను భక్తియుక్తహృదయాన్వీతున్ త్వదీయార్చనా

సేవాసక్తుని జేరదీసి గుణరాశిన్ నిల్పి  సమ్మాన్యమౌ

ధీవైదుష్యము గూర్చి సాకవలయున్ తీండ్రల్ ఫలించంగ నా

కీవే దిక్కని మ్రొక్కుచుందు సత మోయేటూరి సోమేశ్వరా! 35.

 

కుప్పించున్ మది ధ్యానమందు నిలువన్ గోరంగ నిందందు దా

దిప్పల్  పెట్టుచునుండు నన్ను గిరిశా! దీనిన్ నిరోధించి నా

కిప్పాపప్రకృతిన్ జయించు బలమున్ హేదేవ! వాత్సల్య మి

ప్డొప్పారంగను జూపుమా నతులు నీకోయయ్య!  సోమేశ్వరా!        6.

                                               

న్నున్ నీపదపంకజంబులపయిన్ నవ్యప్రయత్నంబుతో

మన్నింపందగు రీతి శీర్షమిడి సమ్మానంబుగా నెంచుచున్

నిన్నున్ మ్రొక్కగనిమ్ము నిత్యము భవానీనాథ! నీకంటె నా

కెన్నన్ లేరొక రన్యరక్షకులు హే యీశాన! సోమేశ్వరా!                   37.

 

ర్యాదల్ గని సంచరించు విధ మమ్బానాథ! నాకీయవే

ఆర్యాసన్నుత! పాపకర్ముడ నయా! యజ్ఞానినై యుంటి నా

చర్యల్ విజ్ఞులు మెచ్చుకోదగునటుల్ సద్బుద్ధినిం గూర్చి సత్

కార్యంబుల్ గొను సభ్యతన్ గరపుమా కైమోడ్తు సోమేశ్వరా!            38.

 

స్కాందాద్యద్భుత పూర్వగాథలు శ్రుతుల్ శాస్త్రంబులు న్గావ్యముల్

ఛందోరీతులు నేర్వనట్టి జనుడన్ సాహిత్యశూన్యుండ నో

నందీశప్రణుతా! నతానుగాహితా! నన్ గావుమా ధూర్జటీ!

"వందే శంకర"యంచు నిన్ను గొలువన్ వాంఛింతు సోమేశ్వరా!           39.

 

మ్యత్వంబు మదీయజీవనమునన్ రాజిల్లు నట్లీవు మత్

కామ్యంబుల్ నెరవేర్చి సర్వగతులన్ కైవల్యసంప్రాప్తియే

గమ్యంబన్న యథార్థముం గరపి సంస్కారంబులన్ నేర్పుచున్

సమ్యగ్రీతి పరిశ్రమాస్థ కిడుమా సత్వంబు సోమేశ్వరా!                  40.

 

మున్నేరీతిని కన్ననిన్ మునిసుతుం బూపూర్ణానురాగాన న

చ్ఛిన్నానందము గూర్చి గాచితివొ రాశీభూత వాత్సల్య సం

పన్నత్వంబును జూపి యట్లె  నను నీవానిన్ భవత్కింకరున్

భిన్నాత్మున్ గరుణించి కావదగు నీవే దిక్కు సోమేశ్వరా!               41.

 

పార్వత్యర్థశరీరమందు, దలపన్ పాముల్ గళంబందునన్

సర్వారాధిత! భస్మ మెల్లయొడలన్ సత్వంబులై పుర్రెలున్

దుర్వారామయనాశభావము మదిన్  తోడౌచు నిన్జేర నీ

యుర్విన్ భక్తజనాల బ్రోతువు ముదం బొప్పార సోమేశ్వరా!          42.

 

హేమృత్యంజయ! చంద్రశేఖర! మహాహిర్భూష! చర్మాంబరా!

కామారీ! త్రిపురాంతకా!గిరిసుతాకల్యాణకారీ! హరా!

వామా! భస్మశుభానులేపన! భవా! భాస్వంత! విశ్వేశ్వరా!

నీమం బొప్పగ నిన్ను నే గొలిచెదన్ నిత్యంబు సోమేశ్వరా! 43.

 

నాకాయంబు, మదీయభాగ్యచయముల్, నవ్యంబులై జేరు న

స్తోకస్వీయవిచారముల్, గుణములున్, శుద్ధాంతరంగంబు నీ

కైకావేనియు నిష్ఫలంబులు గదా! యందింతు నీకోసమై

హేకారుణ్యపయోనిధీ! కొనుమయా యివ్వాని సోమేశ్వరా!  4.

 

సర్వారాధ్యుడ వీవు ఖండపరశూ! సర్వేశ్వరీనాయకా!

సర్వైశ్వర్యవిధాయకుండవగుటన్ సర్వప్రపంచంబునన్

సర్వార్థంబుల నందగోరి మనుజుల్ సర్వప్రయత్నంబునన్

సర్వేశా! మము గావు మందురు సదా సత్యమ్ము సోమేశ్వరా!          45.

 

క్షీరాబ్ధిన్ సుధకై సురాసురతతుల్ క్షేమార్థమై ద్రచ్చగా

ఘోరంబైన విషంబు వెల్వడుట నీకున్ మ్రొక్కి యర్థింపగా

వారిం గావ జగద్విభూతి కొరకై బాగంచు నద్దాదినినిన్

ధీరాత్మా! గళమందు జేర్చవె దిశల్ దీపిల్ల సోమేశ్వరా!                   46.

 

కన్యోద్వాహము సంసేవ జనతాకల్యాణకృత్యంబులున్

ధన్యత్వంబును గూర్చు పద్ధతులలో దానంబులన్ జేయుటల్

మాన్యత్వంబు టించు కార్యములు కామారీ! దయాసాగరా!

నాన్యంబయ్యవి నీకృపన్ బడయు యత్నంబందు సోమేశ్వరా!       7.

 

దైత్యుల్ మూడుపురంబులందు ఖలులై ధర్మాంతకాకాంక్షులై

యత్యంతంబుగ సర్వలోకములకున్ హానిన్ టించంగ నా

కృత్యంబుల్ గని నిర్జరప్రకరముల్ కీర్తించ వ్యోమంబునం

దత్యుగ్రంబుగ ద్రుంపవే జనహితం బాశించి సోమేశ్వరా!               48.

 

నిన్నే నమ్మితి నీకటాక్షమునకై  నిత్యాభిషేకంబులున్

వన్నెల్ గల్గిన బిల్వపత్రచయముల్ వన్యంబులౌ పుష్పముల్

త్వన్నామాంకిత మంత్రశబ్దములతో త్వత్సేవకై గూర్తు నా

పన్నార్తిన్ హరియించు దేవ! కొనగా బ్రార్థింతు సోమేశ్వరా!            49.

 

దాసోహమ్మని చేరువారి మదులన్ దైన్యత్వముం గూల్చి మీ

కోసం బేను సతంబు వాంఛితము చేకూర్తున్ భవత్స్వాంతముల్

భాసిల్లంగను నిత్యహర్షమిచటన్ వాటిల్లగా జేయుచున్

మీసంరక్షణ చేతునం చిడుము బల్మిన్ నీవు సోమేశ్వరా!                50.

 

వారే  సభ్యశిఖామణుల్ నుతగుణుల్ భాగ్యాన్వితుల్ పావనుల్

వారే ధీరులు విక్రమాన్వితులు సద్భావప్రపూర్ణాత్ములున్

వారే జ్యేష్ఠులు సజ్జనాగ్రగులు సత్పాండిత్య సంయుక్తు లె

వ్వారల్ త్వత్పదసేవకై సతతమున్ వాంఛింత్రు సోమేశ్వరా!           51.

 

ఓంకారంబు త్వదీయ రూపమని నే నుత్సాహముం బూనుచున్

శంకాలేశము లేక నామములలో సర్వత్ర ప్రారంభమం

దంకాధిష్ఠితవిఘ్నరాజ! నిలుపన్ హర్షింతు నేవేళ నే

వంకల్ గాంచక కావుమా యనుచు నిన్ బ్రార్థింతు సోమేశ్వరా!        52.

 

 

శ్రీకంఠా! జగదీశ్వరా! పశుపతీ! చిత్సౌఖ్యదా! శంకరా!

హేకారుణ్యపయోనిధీ! సురవరా! హేకోటిసూర్యప్రభా!

నీకర్పింతు సహస్రబిల్వదళముల్ నీకింకరస్థానమున్

నాకీయంగను వేడెదన్ నిను భవా! నాదాత్మ! సోమేశ్వరా!               53.

 

పాటించదగు జాతిధర్మము లిటన్ భారంబులయ్యెన్ గటా!

మోటయ్యెం గద సంస్కృతుల్ మనములన్ మూర్ఖత్వముల్ నిండగా

పోటీతత్త్వము స్వార్థభావనమునన్ పొంగెన్ జగం బందునన్

వీటిం గాంచ వదేల ఫాలనయనా! విశ్వేశ! సోమేశ్వరా!                   54.

 

అజ్ఞానంబును బారద్రోలి మదిలో నానందముం గూర్చు స

ద్విజ్ఞానంబు లభింపజేసి సతమున్ విస్తారరూపంబుగా

జిజ్ఞాసన్ గలిగించి సత్పథమునన్ జేర్చంగ నిన్ వేడు నా

విజ్ఞప్తిన్ గరుణించి వల్లె యనుమా! విశ్వేశ! సోమేశ్వరా!                 55.

 

రుద్రాధ్యాయము దీక్షతో జదువుచున్ "రోగార్తులన్ బాపుమా

రుద్రా!"యంచు వచించుచున్ కలుషదూరున్ నిన్ను సేవింతు నో

భద్రాకార! సనాతనా! సుజనసద్బంధూ! కృపాసాగరా!

చిద్రూపా! టియించుమా భువిపయిన్ క్షేమంబు సోమేశ్వరా!         56.

 

సంకల్పంబు శివాత్మకం బగుటకై సర్వాసంహారకా!

సంకోచింపక సంస్తుతింతును నినున్ సద్భావయుక్తంబుగా

పంకప్రావృతమానసంబు కడుగన్ బంపించుమా త్వత్కృపన్

శంకల్ ద్రుంచుచు గూర్చు మెల్లగతులన్ సత్వంబు సోమేశ్వరా!      57.

 

ఈవిశ్వంబున నున్నవారి మదులం దిప్పట్టునన్ జూచినన్

సేవాభావము సన్నగిల్లినది వాసింగూర్చు సద్వర్తనల్

దైవారాధన మృగ్యమౌచు ఖలతా తంత్రంబు విస్తారమై

చేవంజూపుచునుండె కావు మవనిన్ చిద్రూప!  సోమేశ్వరా!            58.

 

 

 

నాదేశంబు సమస్తవిశ్వమునకున్ నానాప్రకారంబుగా

మోదంబుం గలిగించు ధర్మమును సంపూర్ణాను రాగంబుతో

వేదస్థానముగాన దెల్పును మహద్విజ్ఞాన మందించుచున్

నీదే భారము దీని నున్నతముగా నిల్పంగ  సోమేశ్వరా!                 59.

 

నేతల్ నేటి జగాన స్వార్థపరులై నిందాప్రవృత్తిన్ సదా

చేతం బందున దాల్చి సర్వజనసంక్షేమంబునుం గోరకే

ఖ్యాతిం బొందగ కృత్రిమాభినయముల్ గావించుచున్ నిచ్చలున్

భీతిం గొల్పుచునున్నవారు కనుమా! విశ్వేశ! సోమేశ్వరా!             60.

 

బాంధవ్యంబులు నామమాత్రము లయెన్ స్వార్థంబు భూతంబుగా

నంధావేశము లుద్ధృతంబులయి దేహంబందు ద్వేషాది దు

ర్గంధంబుల్ విశదంబులయ్యె జగతిన్ గంగేశ! దీనాళి స

ద్బంధూ! కిమ్మనకుండుటల్ హరునకున్ భావ్యంబె సోమేశ్వరా!      61.

 

పాపాచారులు, దేశవర్ధకలసద్భాగ్యాపహారుల్ ఖలుల్

శాపానుగ్రహభీతిదూరులు దురాశాపూర్ణు లీకాలమం

దోపంజాలనిరీతి వర్ధిలుచు నిత్యోద్రిక్తతన్ గూర్చగా

సైపం జూచుట యుక్తమా! పశుపతీ! సర్వజ్ఞ! సోమేశ్వరా!             62.

 

యేటూరుపురప్రజాళి కనగా నెన్నేని పుణ్యంబులన్

న్యాయప్రేరితవర్తనన్ సలిపి యున్నారో విశేషంబుగా

జ్ఞేయం బౌను త్వదీయసేవకులుగా శ్రీలందు చున్నా రిటన్

శ్రేయంబుల్ సతతంబు గాంచుచు నిదౌ సత్యంబు సోమేశ్వరా!        63.

 

నీవెవ్వానిని యోగ్యుగా దలతువో నిష్ఠాత్ము డౌవాడు తా

నేవేళన్ సుఖ మందగల్గునటు లేయేభాగ్య మర్థించి నీ

సేవం జేయ ననుగ్రహించి  యిచటన్ శ్రేష్ఠత్వముం గూర్చి యా

కైవల్యంబు తుదన్ టింతువు గదా! కామేశ! సోమేశ్వరా!             64.

 

దేహం బందున శక్తియున్న యెడలన్ దేవా! మదోన్మత్తుడై

మోహంబున్ విడనాడబోక జనుడీ మూర్ఖుండు సౌఖ్యంబులం

దాహా! యంచును కాలముం గడుపు భూతాధీశ! నిన్జేరి దా

సోహమ్మంచు నుతింప బూనడు గదా! చోద్యంబు సోమేశ్వరా!        65.

 

దైవాధీనము లోకమంచు మదిలో ధ్యానింపకీ మానవుం

డావేశంబున తానె దక్షుడనుపో యంచున్ మహా మూఢుడై

భావించున్ జగమందు సర్వవిధసౌభాగ్యంబు లందించగా

చేవం జూపగలాడె సర్వగతులన్ జిద్రూప! సోమేశ్వరా!                 66.

 

కాయం బందున ప్రాణమున్నవరకే కార్యంబు లీనేలపై

చేయం జాలును జీవనంబు పుడమిన్ క్షీణించు శీఘ్రంబుగా

జ్ఞేయం బియ్యది బుద్బుదాభమనుచున్ జేతంబునం దెంచ డౌ

రా! యత్నింపడు మానవుండు శుచియై రాజిల్ల సోమేశ్వరా!           7.

 

నీరేజాతభవాది దేవగణముల్ నిత్యోక్తకర్మంబులన్

బారీణత్వము గాంచ నిన్ను గొలువన్ భావించి సద్భక్తులై

చేరం జూతురు నిన్ను కల్మషహరా! జే యంచు నీనామమున్

నోరారన్ స్మరియించు శక్తినిడి నన్నుం గావు సోమేశ్వరా!               8.

 

కాశీవాసము గంగలోన మునుగంగా గల్గు సౌభాగ్య మో

యీశానా! భవదీయ దాస్యము సదా యిప్పించగా గోరు నా

యాశల్ గాంచి హసించబోవలదయా! యాద్యంతహీనా! కృపా

లేశం బీయెడ జూప వేడెదను కాళీనాథ! సోమేశ్వరా!                     9.

 

యేజన్మంబుల పుణ్యకర్మఫలమో యీనాడు నీనామముల్

జేజేయంచును బల్కగల్గు క్షమతల్ శ్రీకంఠ! నాకందె యీ

నాజన్మం బిచటన్ సతంబు విధిగా నాగేంద్ర హారా! తృషల్

రాజిల్లంగ నినున్ నుతించు కొరకే రక్షించు సోమేశ్వరా!                  70.

 

 

 

మావంశీయులు నిన్నుగొల్చి యిచటన్ మాన్యత్వముం గాంచినా

రోవామా! భవదర్చనంబునకునై  యుత్సాహమందించి నన్

నీవానిన్ భవదీయ సేవకుని మన్నించంగ బ్రార్థించెదన్

నీవే గావ గలాడ వౌట యభవా! నిత్యంబు సోమేశ్వరా!                  71.

 

నీవే తండ్రివి తల్లివీవె హితుడున్ నీవే కృపాసాగరా!

నీవేత్రాతవు, దాతవంచు సతమున్ నిన్నెంచు భక్తాళికిన్

నీవేవిశ్వవిధాతవౌట సుఖసాన్నిధ్యంబు నందించి స

ద్భావస్థైర్యము గూర్చుచుందువు నుతుల్ పల్మారు సోమేశ్వరా!      72.

 

సత్యం బందున నిష్ఠబూని మనుటల్, సౌభ్రాత్రమున్ జూపుచున్

నిత్యం బందరిప్రేమ చూరగొనుటల్, నిష్పక్షపాతంబుతో

నత్యానందము గూర్చు ధర్మమునకై యాస్థన్ బ్రదర్శించుటల్

భృత్యానుగ్రహదా! సుకర్మములగున్ విశ్వాన సోమేశ్వరా!  73.

 

కృష్ణాతీరసమీపభూమి నిచటన్ గీర్తించ నిన్జేరుచున్

దృష్ణల్ దెల్పెడివారి మానసములన్ దీపిల్లగా జేయుచున్

విష్ణుప్రాణసఖా! సదా శివములన్ బ్రేమార్ద్రచిత్తాన రో

చిష్ణూ! గూర్చగ నిన్ను వేడెదనయా శ్రీకంఠ! సోమేశ్వరా!              74.

 

సందేహించకుమయ్య భక్తతతులన్ సర్వోన్నతస్థానమం

దిందం దంచును జూడకుండ నునుచన్ హేకృత్తివాసా! శివా!

సందర్భోచితభావనాపటిమతో సద్వాక్యసంపత్తితో

వందే భూధరరాజరాజదుహితాప్రాణేశ! సోమేశ్వరా!                      75.

 

నీపాదోదకపాన మంగములపై నిత్యంబు లోకంబునన్

ప్రాపుంగూర్చెడి భస్మలేపనమిటన్ బ్రాప్తింపగా జేసి నీ

రూపం బన్నిట గాంచ గల్గు బలిమిన్ రుద్రా! జగన్నాయకా!

నాపై నీకృప జూపుమా యనుచు నిన్బ్రార్థింతు సోమేశ్వరా!           76.

 

 

 

ఆలుంబిడ్డలు తల్లిదండ్రులు మహాహర్షంబునుం గూర్చి స

చ్ఛ్రీలం జూపెడి  మిత్రసంతతియు లక్ష్మీవాససంప్రాప్తియున్

కాలే వియ్యెడ మోదకారు లిల మత్కాంక్షల్ ఫలించంగ నే

కాలంబున్ నినుగొల్చు శక్తి యిడుమా కామారి! సోమేశ్వరా!            77.

 

ఆహారార్థము కాయలున్, ఫలములున్, హర్షంబు చేకూర్చి యీ

దేహంబున్ వెలుగించు సస్యవితతుల్, దీపిల్లు చుండంగ సం

దేహం బింతయులేక జంతుగళముల్ ద్రెంచంగ న్యాయంబె యీ

యూహల్ ద్రుంచగలేవె మానసములం దోదేవ! సోమేశ్వరా!            78.

 

శ్రీశైలంబున మల్లి కార్జునినిగా, శ్రీ సోమనాథేశుగా

కాశీనాథునిగా సుఖప్రద!మహా కాళేశ రామేశుగా

యీశానా! భువి  భీమశంకరునిగా యింపార ఘృష్ణీశుగా

క్లేశోన్మూలనజేయు  నిన్ను సతమున్ గీర్తింతు సోమేశ్వరా!             79.

 

మూకన్ జేతువు వక్తగా సభలలో ముఖ్యత్వముం గూర్చుచున్

శ్రీకంఠా! యిల బంగు లంధులకు నీ సేవల్ ప్రసాదించి స్వీ

యాకాంక్షల్ ఫలియింప జేతువు గదా యత్యంత వాత్సల్య మీ

వేకాలంబున జూపుచుండి విధిగా నిచ్చోట సోమేశ్వరా!                  80.

 

నాదర్బారున జేరరండు మనుజుల్! నానాప్రకారంబు లౌ

మోదంబుల్ సమకూర్చి జీవనమునన్ ముందెన్నడున్ లేని సౌ

ఖ్యాదిప్రాభవ మంద జేతును వరీయంబైన స్థానంబు నా

మీదన్ గూర్తు నటంచు బిల్తు విచటన్ మేలంచు సోమేశ్వరా!            81.

 

వేదస్థానముగా వెలుంగు భువిలో విశ్వేశ్వరా! నేడు సం

వాదంబుల్ చెలరేగుచున్నవి బృహద్వైషమ్యముల్ నిండగా

నీదే భారము నాస్తికాళి తలపుల్ నీల్గింప నస్తిత్వసత్

ప్రాదుర్భావము నందజేయ గిరిశా! వాదేల  సోమేశ్వరా!                82.

 

 

 

 

ఏవో కోరిక లంతులేనటులుగా నేవేళనుం జూడ నా

భావం బందున జేరి నిన్నడుగగా బాధించు చుండంగ నా

కేవైనంబున ధ్యాన మబ్బగలదో యిస్మంతయున్ దెల్వ బో

దీవేదిక్కయి కావగా వలెనయా యేటూరి సోమేశ్వరా!                    83.

 

హేయంబైన విధాన మానసమునం దేవేళనుం గాంచినన్

న్యాయాన్యాయము లెంచనట్టి తలపుల్ నన్జేరి సద్భావముల్

చేయం జూడగ నడ్డుచున్నవి కటా! చింతించు చున్నాడ న 

న్నీయంధత్వము నుండి గావుమయ నీ వెట్లైన సోమేశ్వరా!            4.

 

సామీప్యంబున జేరుచుండు నిడుముల్ సౌఖ్యంబు లిందందునన్

తామై గల్గవు కల్గినన్ నిలువ వా ద్యంతంబు చూడంగ నీ

భూమిన్ జీవనమన్న దుఃఖభరమే పోయంచు వాదించు నో

కామేశా! మనుజుండు నిన్గన డహంకారాన సోమేశ్వరా!                  5.

 

నాభక్తుండని చేరదీసి శుభముల్ నన్ జేరగాజేతువో

శోభాలేశము గూర్చకుండ యిడుముల్ జోడింతువో దేవ! నీ

పై భారంబును మోపి యేదియయినన్ భాగ్యంబుగా యెంచెదన్

నీభక్తిన్ మనమందు దాల్చెద నిటన్ నిత్యంబు సోమేశ్వరా!              86.

 

తానే శ్రేష్ఠుడనన్న భావనము, శ్రద్ధాసక్తులెల్లప్పుడున్

దీనానాథజనప్రపీడనమునన్ ధీశక్తి సంఘంబులో

నానోత్పాతములన్ సృ జించుకొర కేనాడున్ బ్రయోగించు టౌ

రా! నేడయ్యెను మానవాత్మగతముల్ రక్షించు సోమేశ్వరా!             87.

 

వేదాధ్యాపనలో గలట్టి మహిమన్ విప్రాళి యీనేలపై

మోదంబంద గ్రహించుచున్ హితకరామోదంబునుం జూపుచున్

మీదన్నింట జయంబులంది సుఖసామీప్యంబునుం గాంచు న

ట్లాదేశించుము తద్గతాస్థ యెపుడీ వందించి సోమేశ్వరా!                 88.

 

 

కారుణ్యాబ్ధి వటండ్రు లోకులు జగత్కల్యాణముం జేయగా

మారేండుం గొని శీఘ్రగామి వగుచున్ మాచెంత కీనేలకున్

జేరం జూతువటండ్రు  సత్పథగులన్ జేయంగ నీవేలనో

దూరంబందున నుంటి వీ ప్రజల దే దోషంబు సోమేశ్వరా!               89.

 

శుద్ధస్వాంతముతోడ సర్వజనులస్తోకానురాగమ్మునన్

బుద్ధిన్ దేశసమగ్రతావనవిధిన్ పూర్ణంబుగా నుంచి స

న్నద్ధుల్ గావలె ధర్మరక్షణకు నానందంబుతో గాన నీ

విద్ధాత్రిన్ వలనైన శక్తి నిడుమా యేటూరి సోమేశ్వరా!                     90.

 

వ్యామోహంబు విదేశసంస్కృతిపయిన్ వర్ధిల్లె నిచ్చోటునన్

క్షేమంబిందు స్వధర్మపాలనమునన్ సిద్ధించు నన్నట్టి యా

శ్రీమంతంబగు సూక్తి నాదరముతో చిత్తంబునం దాల్చ రీ

భూమిన్ నేటి జనంబు దీనిగన రాబోవేల సోమేశ్వరా!                    91.

 

జాతిద్వేషము జూపకుండ జను లీసంఘంబు నందంతటన్

చేతంబుల్ వికసించ సన్నుతగతిన్ చిద్రూప! ప్రేమంబుతో

ఖ్యాతిం బొందగ నొక్కటై మనుటయే కర్తవ్యమై యుంట నీ

వేతద్యోగ్య బలంబు మాకు నిడుమా యేటూరి సోమేశ్వరా! 92.

 

స్థాణూ! రుద్ర! ఉమాపతీ! సురనుతా! సత్వప్రదా! నీవు నా

పాణిం జూచి స్వధర్మపాలనకునౌ బల్మిన్ బ్రసాదించి మ

ద్వాణిన్ శుద్ధము చేసి నిత్య మిచటన్ త్వత్కీర్తనల్ పాడుచున్

రాణించందగు బుద్ధి నిమ్మనుచు నిన్ బ్రార్థింతు సోమేశ్వరా!           93. 

 

శ్రీలందించి నిరంతరామితగతిన్ జేజేలు సంఘంబులో

వాలాయంబు లభింప జేయు మధికప్రాధాన్యతన్ జూపుచున్

మేలైనట్టి సుఖంబు గూర్చు మని స్వామీ! నిన్ను గోరంగబో

నేలాగైన త్వదర్చనాస్థ ననిశం బిమ్మందు సోమేశ్వరా!                   94.

 

సర్వప్రాంతములందు వృష్టి యిచటన్ సస్యానుకూలంబుగా

శర్వా! యందగ జూచి యన్నిగతులన్ సౌఖ్యంబు లీభూమిపై

పర్వం జేయగ నీదెభారమయ సర్పాలంకృతా! మారహృ

ద్గర్వస్తంభన! చంద్రశేఖర! భవా! దండంబు సోమేశ్వరా!                95.

 

స్వాదుస్వచ్ఛజలంబు లెందు గనినన్ సర్వత్ర తోరంబుగా

నాదిత్యాయుతతేజ! యందగ మహాహర్షంబు లోకంబునన్

నీదాక్షిణ్యముచేత గల్గునటులన్ నిత్యంబు దీవించి నీ

వీ దివ్యస్థలి గాచుచుండ వలె నో యేటూరి సోమేశ్వరా!                   96.

 

నిన్నున్ నమ్మిన జాలు నిత్యసుఖముల్ నిష్ఠాగరిష్ఠత్వముల్

మన్నింపందగు సద్యశంబులును సన్మానంబు లన్నింటిలో

నెన్నం గల్గిన హర్షముల్ గలుగు నో యేటూరివాసా! శివా!

త్వన్నామంబె జపించుచుండ తొలగున్ దైన్యంబు సోమేశ్వరా!        97.

 

భోళాశంకర! విశ్వమందుగనగా పోటెత్తె మోసంబు లే

వేళం జూచిన దౌష్ట్యమీ నలుగడన్ విస్తారమయ్యెం గటా!

తాళం జాలని నీతిహీనత లిటన్ తాటించు చుండంగ  హే

వ్యాళేంద్రాభరణా! యదేల కనవీ వైనంబు సోమేశ్వరా!                  98.

 

ధర్మం బీ భరతావనిన్ సతతమున్ దారుఢ్యతం గాంచి సత్

కర్మంబుల్ నిరతంబు సాగునటులున్ గారుణ్యరత్నాకరా!

నైర్మల్యంబు మనుష్యచిత్తములలో నాటంగ జేయన్ సదా

కూర్మిన్ జూపి యనుగ్రహించుము లసత్కోటీర! సోమేశ్వరా!         99.

 

ముక్కంటీ! భవదర్చనా మహిమచే మున్నామృకండ్వాత్మజుం

డొక్కండైనను ధైర్యశాలియయి యీ యుర్వీస్థలిన్ మృత్యువున్

స్రుక్కంజేసి జయించి సుస్థిరత నిచ్చోటన్ గనెన్ జూడ నీ

వెక్కాలంబును భక్త్యధీనుడవులే యేటూరి సోమేశ్వరా!                   100.

 

 

 

ప్రాలేయాచలపుత్రికాధిప! మహద్భాగ్యప్రదా! యీశ్వరా!

ఫాలాక్షా! విధుశేఖరా! స్మరహరా! పాపౌవిధ్వంసనా!

కాలాహంకృతిభంజనా! సకలదా! కల్యాణకృత్కాంక్షదా!

యేలా పల్కవు దీనరక్షణకునై యేటూరి సోమేశ్వరా!                     101.

 

భూతేశా! పరమేశ్వరా! ఖలహరా! భోగీంద్రహారా! హరా!

శీతాద్రీశసుతాధిసేవితపదా! శ్రీకంఠ! క్షేమంకరా!

చేతం బందున నిన్ను నిల్పి కొలువన్ జేకొట్టు భక్తాళికిన్

ఖ్యాతిం గూర్చెడి నీకు సన్నుతిశతం బర్పింతు సోమేశ్వరా!           102.

 

భోగీంద్రాభరణా! కరిత్వచాసువసనా! భూతేశ! మృత్యుంజయా!

హేగంగాధర! యంధకాసురరిపూ! హేసర్వసౌఖ్యాస్పదా!

నాగప్రార్చితపాదపద్మ! శుభదా!నానావసుప్రాపకా!

రాగప్రావృత! భక్తపాలకవిభో! రక్షించు సోమేశ్వరా!                      103.

 

ఆగంగానది ధన్యజీవన కదా! హర్షంబుతో నీశిరో

భాగం బందున నుండగల్గినది సర్వారాధ్య! యా గౌరియున్

నీగాత్రంబున నర్థభాగ మగుటల్ నిక్కంబుగా సత్తపో

ద్యోగంబేగద! నిన్ను గొల్చెద సతం బోదేవ! సోమేశ్వరా!               104.

             

సంసారార్ణవమందు గూలి యిచటన్ స్వార్థంబుతో నిచ్చలున్

హింసామార్గమునంది జీవనమునన్ హేయంబులౌ కృత్యముల్

కంసారీష్టసఖా! నరుండు విధిగా గావించుచున్ సర్వ వి

ధ్వంసంబున్ సృజియించ కిమ్మన విదేధర్మంబు సోమేశ్వరా!          105.

 

అజ్ఞానంబున నాటలాడ గడిచెన్ హా నాటి బాల్యంబు నా

ప్రజ్ఞన్ గాంచి భ్రమించి సౌఖ్యములకై పారాడుటన్ యౌవనం

బోజ్ఞానప్రద! యంతరించె యెటులీ యున్మాదిన్ గాచి నా

యజ్ఞత్వంబును రూపుమాపగలవో యర్థింప సోమేశ్వరా!               106.

 

 

 

 

దేహం బందున శక్తిగూలు నపుడున్ దేవా! ననున్ గావుమా

మోహావేశము వత్సలుండవయి యున్మూలించుమా నీకు దా

సోహం సత్యము నమ్ముమంచు జనుడీ యుర్విన్ నుతుల్ సేయు తా

నాహా! మూర్ఖుడు దూరదృష్టిరహితుం డౌనందు సోమేశ్వరా!           107.

 

ఈమేనం గల యింద్రియంబులకు నే నిందైతి వశ్యుండ నీ

నామంబుల్ గొని సన్నుతించు ఫణితిన్ నాడొక్కనాడేనియున్

స్వామీ! కాంచకపోతి భంగపడితిన్ సత్యంబు మన్నించుమా

శ్రీమత్పర్వతపుత్రికాధవ! భవా! చిద్రూప! సోమేశ్వరా!   108.

 

సుత్రామాది సమస్తదేవగణముల్ శుద్ధాంతరంగమ్ములన్

శత్రూన్మూలనసత్పదాప్తికొరకై సద్భక్తులై యే పదం

బాత్రం బందుచు గొల్తురో భవహరా! యందేను నా శీర్షమున్

పాత్రత్వంబును గోరి చేర్చెదను నన్ బాలించు సోమేశ్వరా!            109.

 

ఛందోరీతు లెరుంగకున్న కవితా సందోహనిర్మాణ మే

నందం బొప్పగ నేర్వకున్నను ననున్ హర్షింపగా జేయ నీ

విందీరీతిగ వందపద్యములు భావించంగ దీవించి యీ

మందుం జీరి టింప జూచితివి సన్మానంబు సోమేశ్వరా! 110.

 

దండంబుల్ గొనుమయ్య పూతచరితా! ధర్మాస్థనున్ నేర్పి నీ

యండన్ బొందగ జేసినావు సతతం బానందవారాశిలో

నుండం జూపుచు ధన్యవాద శత మిప్డోదేవ! నీవంది రా

కుండం జూడుము జాడ్యమీ మనమునం దొక్కింత సోమేశ్వరా!       111.

 

***

No comments:

Post a Comment