Friday 2 October 2020

రామచంద్రాపుర శ్రీ హనుమత్ శతకము

 

శ్రీ గణేశాయ నమః            శ్రీ సరస్వత్యై నమః        శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

శ్రీమదాంజనేయాయ నమః       శ్రీవేంకటేశాయ నమః

 

***

శ్రీరామచంద్రాపుర  హనుమచ్ఛతకము

ఛందము - తేటగీతి.

రచయిత 

హరి వేంకట సత్యనారాయణ మూర్తి





శ్రీకపీశ్వర! హనుమంత! శీఘ్రగామి,

చిన్మయానంద! హరిభక్త! మన్మనోబ్జ

భృంగరాజమ! నాకు సత్సంగమిమ్ము

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                             1.

 

శ్రీదు డార్ద్రాంతరంగుండు చిన్మయుండు,

జనకవాక్యాన నడవుల సంచరించు

రామచంద్రుండు నీస్వామి రావుండు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  2.

 

 

 

 

తొలుత విఘ్నేశు గజవక్తృ దలచి పిదప

సకల లోకేశు శ్రీరామచంద్రు దలతు,

ఈశు బరమేశు గొలిచెద నిందుధరుని

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  3.

 

ఇంక కులదేవు నా వేంకటేశు దలచి,

యాదిదేవుని సకలదు నజుని గొలిచి

చదువులకు తల్లి శ్రీవాణి జక్క దలతు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  4.

 

లలితహృదయను జగదంబ లక్ష్మి గొలిచి

సర్వమంగళ బార్వతి శరణు జొత్తు,

నతుల నీరీతి సకలదేవతల దలతు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  5.

 

ముళ్ళపూడ్యన్వయాబ్ధికి మూలమైన

నాదు గురువును నారాయణాఖ్య నుని

దలచి శతకంబు నీపైని బలుక జూతు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                             6.

 

అమల హరివంశచంద్రుని విమలచరితు

వేంకటేశ్వరు తనయుండ, వినయశీల

జనని సామ్రాజ్యలక్ష్మియు  సాధుచరిత

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  7.

పూజ్యగౌతమగోత్రాన బుట్టు నన్ను

సత్యనారాయణాఖ్యుని సాధుగుణుని

పాపదూరుని చేసి కాపాడవయ్య,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  8.

 

కావ్యనిర్మాణమొనరింప కవిని గాను,

భావపూరిత విరచనఫణితి నెరుగ

నిన్ను దలపంగ బూనితి నియతితోడ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  9.

 

నిత్యు శాశ్వతు నినుగొల్చి, నిన్నువేడి         

పలుకబూనితి నీపైని పద్యశతము

పూర్తిచేయింతు వేరీతి పుణ్యమూర్తి!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  10.

 

పలుక నావద్ద శబ్దసంపత్తి లేదు 

మహితపదముల స్తోత్రనిర్మాణమందు

దిట్టగానింక నాకోర్కి దీర్చుమయ్య,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                             11.

 

దేవ! శైశవదశయందు దినకరమణి

నాకసంబున గాంచి నీవాకలి గొని

ఫలము గాబోలునని మ్రింగ బట్టినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  12.

 

తొల్లి యబ్ధిని లంఘించి బల్లిదుడగు

రావణాసురు బెదిరించి, లంక గాల్చి

కాంచి రమ్మన కాల్చిన నుడ వవుర!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  13.

 

భవ్య కృష్ణానదీతట దివ్యభూమి

భక్తజనముల రక్షించి ముక్తి నొసగ

వాసమేర్పడి యున్నట్టి వాడవీవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  14.

సకలసౌభాగ్యసంపత్తి, సాధుకీర్తి

పుత్రపౌత్రాది యశములు పొందు నరుడు

దేవ!  నీదయ గలిగినం దిరముగాను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  15.

 

సౌమ్యు రాముని సుగ్రీవ సఖుని జేసి

వీరవానరు వాలి జంపించి నీవు

సేమ మతివను సుగ్రీవు జేర్చినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  16.

 

లలిత హృదయను సీతను లంకనుండి

కువలయాధిపు రాముని కొరకు దెత్తు

వదలుడిక చింత వానర బంధు లనవె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  17.

సీతఁగనుగొన రాముని దూత వగుచు

వార్థి యోజనశతమును వానరేంద్ర!

దాటి లంకను జేరిన మేటివవుర!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                             18.

 

రామ కార్యార్థివై నీవు రయముతోడ

నబ్ధి లంఘింప మైనాకు డనియె గాదె,

యన! నాపైని విశ్రాంతి నందు మనుచు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  19.

 

కాల మల్పము, కడుభార కార్యమిదియు

విశ్రమించుట గిరిరాజ! వీలుగాదు

సత్యమిదియని ముందుకు సాగినావు,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                    20.

 

రాము నభిరాము రఘుకుల సోము దలచి

క్షణములోననె సీతను గాంచి వత్తు

దైన్యమిక యేల నాజన్మ ధన్యమనవె,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!        21.

 

అకట! ఛాయను గ్రహియించి యబ్ధి పైన

దివిని జరియించు వారి బాధించుచుండు

జలధి వసియించు సింహికఁ జంపినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  22.

సురస నిను జూచి భక్షింప జూడ నపుడు

మొదట యోజన విస్తృతి, పిదప సూక్ష్మ

దేహమును దాల్చి ముఖమునఁదిరిగినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  23.

 

సూక్ష్మరూపాన లంకలో చొరబడగను

సకలలోకేశు డగు నిన్ను జంపజూడ

ముష్టిఘాతాన లంకిణి మోదినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  24.

 

శోభనంబుగ సీత నశోక వనిని

శింశుపము క్రింద నీవు దర్శించి యపుడు

వినయమున వంగి ప్రణతు లర్పించినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                     25.

 

శోక సంతప్త యగుచు నశోకవనిని

శింశుపమునీడఁ జేరిన సీతకపుడు

వీరు నినుజూడ దు:ఖము దూరమయ్యె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                  26.

 

అసురవాగ్బాణ ధాటికి నసువు బాయ

యత్నమొనరించు సీతమ్మ కన! నీదు

రామనామపు గానంబె రక్షయయ్యె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ      27.

రామలక్ష్మణు లున్నారు సేమ మచట,

పరమపురుషుండు రఘుపతి బంటు నేను   

వానరుండను దు:ఖము వదలు మనవె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 28.

 

నిన్ను గొంపోవ రాము డాపన్నివారి

వేగ రానుండె దు:ఖమ్ము విడువు మింక

తల్లి! వినుమంచు సీత నోదార్చినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                29.

 

అమ్మ! సీతమ్మ! వినుము నీయాజ్ఞయేని

క్షణములో జేర్తు రాముని కడకు నిన్ను

విశ్వసింపుమ యంటివి, విశ్వవినుత!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 30

.

సీత నినుజూచి హనుమంత! చిన్నికోతి

వెట్టు గొనిపోదు వనగ నన్నింత దవ్వు

దివ్యకాయంబు చూపవె  భవ్యఫణితి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 31.

 

పరమశూరుడ వయ్యును బాలు భంగి

అంబ జానకి నమైన యాజ్ఞ గొనవె

భక్షణము సేయ ఫలముల వనమునందు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ      32.

సుందరం బౌచు వెలుగు నశోకవనిని

ధ్వంసమొనరించు సమయాన దానవులను

మించి యుత్సాహివై సంహరించి నావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 33.

 

ఇంద్రజిత్తుండు బ్రహ్మాస్త్రమేయ నపుడు

వైరి ముందట సామాన్యు పగిది నీవు

పట్టు బడినావు రావణు బలము దెలియ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ      34.

 

దివ్యదేహుని నిను నిరోధింప వచ్చు

నక్షసుతుగని యతిశీఘ్ర మాహవమున

నమరపురి కంపి విజయంబు నందినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ      35.

 

దుష్ట! రావణ! రావు దురితదూరు

మథనపెట్టుట నీకు సేమంబుగాదు,

వినుము నిజమిది సీతను విడువు మనవె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                36. 

 

పూజ్యు రాముని సాదరపూర్వకముగ

గొలిచి జగదంబ నర్పించి నిలువ నీకు

శుభము గలుగును రావణ చూడు మనవె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                37.

తుచ్ఛవానరుడ వటంచు తోకబట్టి

చీర లెన్నియొ చుట్టుచు చిచ్చు బెట్ట

నత కపివర్య! లంకను గాల్చ లేదె!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ               38   

 

క్షణములోపల వాలంబు కరము బెంచి

కనకమయమగు లంకను గాల్చి యంత 

నసురసేనల గర్వంబు నణచినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                39.

  

దుష్ట రావణు వలనను కష్టతతిని

మునిగి యున్నట్టి సీతమ్మ కనునయముగ

నంగుళీయక మర్పించి తయ్య నీవు

 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                                      40

 

ధీరగుణశాలి! వానరవీర! శూర!

రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి

కరుణ మము జూడు మోదేవ! నముగాను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 41.

 

మారుతాత్మజ! హనుమంత! మహితతేజ!

రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి!

యనుచు దలచిన సంకటహరణ మగును

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 42.

కనగ నాటల బాల్యంబు గడచిపోవు

దేవ! సంసార వాంఛల యౌవనంబు

నిల్చి నీరూపు గని నిను గొల్చుటెపుడు?

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 43.

 

భార్య, పుత్రులు, సంసార భారజలధి

మునిగి పోయితి దయజూపి ముక్తియొసగి

కాంచి కాపాడు మోదేవ! నుడవీవె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 44.

 

తల్లి, తండ్రియు, నాథుండు, దాన భ్రాత

సఖుడ విష్టుడ వికనేమి సర్వమీవె,

నన్ను కరుణించి కాపాడు మన్న! వినుమ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 45.

 

ఇల్లు, యిల్లాలు, సంపత్తి పిల్ల జెల్ల

శాశ్వతంబులు గావయ్య సత్యమతిని

నిన్ను దలచిన కాలంబె నిత్యమగును

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 46.

 

వేయి పేరుల స్తోత్రాల వివిధగతుల

నిన్నుపూజించి, సేవించి నీదుమూర్తి

కరము దర్శింప సంకటహరణ మగును

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 47. 

అలఘుసేనను జేర్పంగ జలధిపైన

చెంతనున్నట్టి వానరసేన తోడ

సేతునిర్మాణ మొనరింప జేసి నావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 48.

 

రావణానుజు మనములో భావమెరిగి

రయము తోడుత భగవాను రాము జేర్చి

ధర విభీషణు జేయవె ధన్యునిగను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 49.

 

మారుతాత్మజ! భవదీయ మహిమ దెలియ

లేక నిను దూషణంబుల నేకమతిని

బలుకు రావణు బోధించ నిలిచినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 50. 

 

మున్ను రణమున సౌమిత్రి మూర్ఛబోవ

దివికి లంఘించి సంజీవి దెచ్చి యపుడు

దేవ! లక్ష్మణు గాపాడినావు నీవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 51.

 

వీణవోలెను యవలీల ద్రోణగిరిని

చేత ధరియించి యకట సంజీవి దెచ్చి

భగవదభిరాము సంతోషబరచినావు 

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 52.

మకరరూపిణియగు నచ్చరకును వేగ

శాపమోచనమొనరించి సవ్యమతిని

ధన్యురాలను జేసిన ధర్మమూర్తి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 53.

 

కార్యవిఘ్నము గలిగించు కాలనేమి

నంత మొనరించి యమపురి కంపినావు

విమత సంహారమందు నీ సములు లేరు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 54.

 

అన! కపివీర! సంగ్రామమందు నీదు

రూపు గనినట్టి యసురులు వీపుజూపి

కదలి పోయిరి మిక్కిలి కదనభీతి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 55.

 

సకలకల్మషహరము నీ చరణయుగము

నమ్మి యనునిత్య మర్చించు నరుడు సతము

హాయి నిహపర సౌఖ్యంబు లందగలడు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 56.

 

నిత్యు నిన్నీశు గొల్వక నిముసమైన

తుచ్ఛసంసారసుఖముల నిచ్ఛతోడ

తేలిపోవును మనుజుండు బేలయగుచు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 57.

ఈశ్వరాత్మజ! హరిదాస! విశ్వవినుత!

హరిహరాద్వైతభావంబు నందమొప్ప

తెలియ జేయవె లోకాన దివ్యచరిత!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 58.

 

మారుతాత్మజ! నీనామమహిమచేత

సారహీనపు సంసారజలధినుండి

ముక్తు లగుదురు జనులు నీభక్తు లిలను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 59.

 

రోమరోమమునందు శ్రీరామనామ

మకట! నీరూపు సుందర మద్భుతంబు

చదువ, వర్ణింప నేరికి శక్యమగును

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 60.

 

పతితపావను డఖిల సంపత్ప్రదాత,

రమ్య గుణశాలి, రాక్షసరాజహంత,

రామచంద్రుండు నీస్వామి రావుండు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 61.

 

దశరథాత్మజ! ఘువీర! ధర్మమూర్తి!

సకలలోకేశ! శ్రీరామచంద్ర యనుచు

సతము జపియించువారలు సఖులు నీకు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 62.

రామ! ఘురామ! దశరథరామ! యనుచు

రామనామంబు సర్వదా నీమమొప్ప

జపము సేతుము మాయందు కృపను జూపు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                63.

 

ఆంజనేయుండు మహనీ్యు డమలచరితు

డనుచు లోకంబు నీముందు వినతు లగుచు

ప్రణతు లర్పింతు రెల్లెడ భక్తితోడ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ               64.

 

ఎల్లవేళల రఘునాథు నెదను నిల్పి

గుండెలను జీల్చి చూపవె కూర్మితోడ

రామలక్ష్మణస్వాములన్ రామదాస!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                65.

 

ఎచట రాముండు కొలువుండు నచట నీవు

అంజలి టించి యుండెద వందమొప్ప

అకట! నీభక్తి గాంచగ నద్భుతంబు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 66.

 

నాగవల్లీయ పత్రాల నవ్యగతిని

నతుల నర్పించి నామార్చనంబు సేయ

పొసగ జనులకు శుభముల నొసదెదీవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 67.

కేసరాత్మజ! భవదీయ కీర్తనంబు

వాసి గొల్పెడి గాథాశ్రవణము, నీదు

విమల సేవయె పండుగ వినుము నాకు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 68.

 

సతము దశరథరాముని స్మరణ చేసి

రామ నామంబె యన్నింట రమ్యమనుచు

బలికి లోకులకు తెలియ బరచినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                69.

 

నిన్నె సేవింతు నినుగొల్తు నీదు చరణ

యుగళి నర్చింతు నిరతమ్ము మిగులభక్తి

దయను జూపించి కాపాడు ధైర్యమొసగి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                70.

 

ముదము గొల్పెడి దివ్యమౌ మోము గల్గి

పారిజాతాఖ్య తరువున వాసముండు

మేరునగతుల్యవిగ్రహ! ధీర! శూర!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                71.

 

అంజనీసుత! యరిహంత! ఆంజనేయ!

జానకీశోకనాశన! జయ సుధీంద్ర!

వాయునందన! శుభమూర్తి! వానరేంద్ర!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                72.

రామనామము విన్నంత రయముతోడ

సంతసం బంది భక్తుల చెంత జేరి

రాము భజియింతు వా పరంధాము నీవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 73.

 

వేదవేదార్థ చయముల వేత్తవయ్యు

భగవదభిరాము రాముని భక్తుడ వయి

దేవ! నీలోని వినయమున్  దెలిపి నావు 

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 74.

 

తీర్థయాత్రలు వేయేల? తిరముగాను

నిలిచి, నినుగొల్చి, త్వత్పాద నిర్మలాంబు

త్రాగుటే మాకు మోక్షప్రదాయి గాదె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ                75.

 

వివిధ చూర్ణము లవియేల? విమల మతిని

జనుడు నినుగొల్వ, భవదీయ చరణరజము

పావనము చేయు తనువును భవ్యగతిని

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 76.

 

పరమపూరుష! కపివీర! పవనతనయ!

సూక్ష్మరూపాన నొకపరి చోద్యమేమొ

విశ్వరూపత నొకట గన్పింతువీవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 77.

రోమరోమము నందు నాస్వామి గలడు

చూపెదను గాక రండిక చూడు డనుచు

గుండెలను జీల్చి నిలుతువు నిండు హృదిని

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 78.

 

దశరథాత్మజు డఖిలుండు దానవారి,

అంబ వైదేహి సకల లోకైకమాత

వీరి దలచుట పాప సంహారి గాదె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                79.

 

దివిజమార్గాన గిరి నీవు తెచ్చునపుడు

భరతు డసురుడవని యెంచి బాణమేయ

సొక్కి భువిదిగి యాతని జూచినావు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                80.

 

సకలవేదార్థ వేత్తవు, సాధుశీలి

వమల గుణుడవు వ్యాకరణాదులందు

సములు లేరందు రిల నీకు విమలమతికి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                81.

 

ఉదయ మధ్యాహ్న కాలాల ముదముతోడ

నాథ! కపివర్య! సాయంతనంబు లందు

నిఖిల సంకట హర్తను నిన్ను గొల్తు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                82.

ఈశ! నీకంటె నులెవ్వ రిలను చెపుమ,

పరమపావనమైన నీభక్తి హనుమ!

కరము వర్ణింపజాల నీఖ్యాతి వినుమ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                83.

 

సకల జగముల నేలెడి స్వామి వీవె

వాసి గొల్పగ దయజూపి వరము లీవె

పతితపావన! మమ్ము కాపాడ రావె

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                84.

 

సకలసంకటహరణ! నీ చరణయుగళి

పరమ మిత్రుని కన్న, సంపదలకన్న

మిన్న, సరిలేదు దానికి మేటి యదియ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 85.

 

సకలలోకైకనాథ! నీచరణయుగము

భక్తి గొలిచిన వానికి శక్తియుక్తు

లన! హరిపద మవలీల నబ్బగలవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                86.

 
సకలసంకటహరణ! నీ చరణయుగళి

గట్టిగా నమ్మి కొలిచెడి నున కిలను

కనగ సంసార బంధాలు తునిగి పోవు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                87.

వాయునందన! భవదీయ వైభవంబు

వర్ణనము సేయ కవులకె వశముగాదు

సుంత నేర్వనివాడ నే నెంతవాడ

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                88.


వైభవ మొసంగు సకల సంపదలగోర,

నన! నకీర్తి, వస్తువాహనములడుగ,

విమలమతిజేసి కరుణ చూపించవయ్య

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                89.

 

తనయులను బొంది, యర్థికి దానమిచ్చి,

యజనములుచేయ పుణ్యంబు లబ్బునేమి?

జనుడు నినుగొల్వడేనియు జగతిలోన

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                90.


దేవ! నిన్నె నమ్మితిని నీ సేవజేయ

రాగ వలదన్న, నేనేడ కేగగలను?

దీనబాంధవ! దయజూపు దీనుని పయి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                91.


అన్న! సంపద లేవేళ నడుగబోను,

కువలయాధిపతిత్వంబు గోరబోను,

చిన్ని తమ్ముని నన్ను రక్షించవయ్య

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                92.

పరగ ద్వాపరయుగమందు వజ్రదంష్ట్ర!

సత్యభామను మరి సుదర్శనుని ఖగుని

గర్వ మణగించి గావవె సర్వవంద్య!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                93.

 

వివిధలోకేశ! వానరవీర! జయము

దీనబాంధవ! పరమేశ! దేవ!జయము

పింగళాక్షుడ! కరుణాంతరంగ జయము

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                94.

 

సర్వరోగహరణ నీకు సాధు జయము,

రామదాసుడ! హే పరంధామ! జయము

సాగరోత్తారకప్రభో! జయము జయము

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                95.

 

పరమపూరుష! సకలసంపత్ప్రదాత!

జాంబవత్ప్రీతివర్ధన! స్ఫటికతుల్య

దేహ! మైనాకపూజిత! దేవదేవ!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                 96.

 

భవ్యరామాయణాఖ్య కల్పతరువునకు

నీవ యాధార మనునది నిజము దేవ!

నిన్ను గనకున్న రాముండు ఖిన్నుడౌను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                97.

పంచవక్తృడ! బలవంత! కాంచనాభ!

భక్తవత్సల! లక్ష్మణ ప్రాణదాత!

సింహికాప్రాణభంజన! సిద్ధపురుష!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                98.

 

విశ్వదీపితమైన నీ విక్రమంపు

ధాటిని గని యత్నించియు తాళలేక

అసురవీరులు చేరిరి యముని పురికి

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                99.

 

శక్తి గలిగియు శ్రీరామభక్తు డగుట

రావణాసురు డాదులౌ రాక్షసులను

స్వామి యాజ్ఞను పాటించిచంపలేదు

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                100.

 

గరుడగమన! సురవినుత! కపివరేణ్య!

సతతసుఖదాత! హరిభక్త! సాధుచరిత!

పవనతనయుడ! సకలద! పరమపురుష!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                101.

 

స్వామి! సీతను సిందూర మేమిటనగ,

రామకల్యాణ మనియన రయముతోడ

నంత, యొడలంత సిందూర మద్దుకొనవె!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                102.

వాక్కునందున నిల్చి హే వానరేంద్ర!

మంచి పద్యాలు శతము వ్రాయించినావు,

ప్రణతుల శతంబు నర్పింతు పావని! గొను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                             103.

 

వాక్యసంపత్తి లేకున్న  వత్సలతను

పద్యశతకము నాచేత పలుక జేయు

నీదు మహిమ యింతనుచు వర్ణింప దరమె?

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                                        104.

 

నాథ! పలుకంగ వ్యాకరణంబు రాదు,

సర్వలక్షణఛందము నేర్వలేదు,

ప్పుప్పులె కలబోసి చెప్పినాను

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                105.

 

నీమ మొకకొంత తెలియని పామరుండ,

కోపపూరిత హృదయుండ పాపమతిని

దయను జూపించి కాపాడు జయ సుధీంద్ర!

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                106.

 

నిఖిల జగములు వెదికిన నిన్నుబోలు

దైవమే లేదు, నాకింక తల్లి దండ్రి

యన్న, బంధువు లొకరేమి యన్ని నీవె,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                107.


వాయునందన! కపివర్య! వజ్రదంష్ట్ర!

సర్వలోకేశ! వందన శతము నీకు

ప్రణతులను గొని మమ్ము కాపాడ వయ్య,

రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!                108.

 

స్వగ్రామం "సంగళ్ళపాలెంసమీపస్థమగు

"రామచంద్రాపురంలోని

"శ్రీమదభయాంజనేయస్వామి"

యనుగ్రహ,ప్రోత్సాహములతో రచితము.

శ్రీస్వామికే అంకితము.

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment