Thursday 31 May 2018

గ్రీష్మము


గ్రీష్మము
ఉ.
దేహములోని సత్త్వమును, దీప్తి నడంచుచు నుగ్రరూపివై
బాహిరకర్మజాలముల వైనము నెంచగనీయకుండ దా
సోహ మటంచు లోకమిలచోద్యము జూచుచు భీతచిత్తయై
యాహట జెందుచుండ మరియాదను దప్పెదవేల గ్రీష్మమా!                         1.
ఉ.
పిన్నలు పెద్దవారలను భేదము చూపవు తెల్లవారినన్
కన్నుల నిప్పుగ్రక్కుచును గాల్చుచు నుందువు జీవరాశు లా
పన్నులవోలె స్రుక్కుచును ప్రాణము గుప్పిట పట్టుకొందు రౌ
నిన్ను గనంగ సత్యమిట నీసరి యెవ్వరు లేరు గ్రీష్మమా!                     2.
ఉ.
నీవు జగంబు నంతటను నిష్ఠను బూని వసించి యుండగా
తావక జన్యమై భువికి తాపము గూర్చు త్వదీయ క్తులన్
భావన చేయలేక బహుభంగుల గుందెడి ప్రాణికోటులన్
గావగ బూనిదీక్ష నిట గైకొనువా డెవడోయి గ్రీష్మమా!                            3.
ఉ.
కాయము నీరసంబయి యకారణ రుగ్మత హెచ్చుచుండె నీ
ధ్యేయము తెల్వరానిదయె యేమి టింపగ బూనినావు మా
యాయువు లెండగట్టి యడియాసలు చేయుట లాస లీవిధిన్
న్యాయమె? చూపవోయి కరుణన్ పిసరంతయునైన గ్రీష్మమా!              4.
ఉ.
మా పసివారు, వృద్దులును, మాగృహలక్ష్ములు  నిన్ను గాంచుచున్
దూపిలుచుండ లేక పలుదోముల వేళల నుండి యింటిలో
ప్రాపును గోరుచుండి బహుభంగుల గుందుచు తారకల్ దివిన్
దీపిలుదాక ముంగిలి గతిన్ పరికించగ బోరు గ్రీష్మమా!                       ౫.

ఉ.
ఏమని పల్కువాడ నిను నీవిధి గాంచగ మానసంబునన్
కామన లంతరించదగు  కాలము గూడిన యట్టులుండె యీ
భూమిని నిల్వగా దగిన పోడిమి యందక పోవుచుండె యే
ధీమతికైన నెంచగల దీప్తి నశించుచు నుండె గ్రీష్మమా!                                 6.
చం.
వరుణునితోడ నీ వకట! వైరము బూనితి వేమి? లేనిచో
సరసత కాస్పదంబయిన చల్లని వృష్టి ధరాతలంబునన్  
కురియగ నీయకుంటి విక కూరిమి జూపవు మేమొక్క టం
బరమున గానిపించుటకు  వాస్తవ మియ్యది కాదె గ్రీష్మమా!                  7.
చం.
ఋతువున నున్న ధర్మమిది యెందుల కీగతి కుందు టందువా
కతిపయవారముల్ గడుచు కాలము నందున శీతలాంబువుల్
క్షితిపయి వర్షరూపమున జేరగ జూచెడి మానసంబు నీ
యతులిత మైన దీక్ష కిల  నౌనె నిరోధక? మోయి గ్రీష్మమా!                   8.
చం.
కదలక యింటిలోపలను  కార్యము లన్నియు మాని యుండగా
మదిని దలంచుచుండినను మాకది భారమె యయ్యె దేహ మీ
యదనున ర్మబిందువుల కాస్పదమై విసిగించుచుండె నీ
వదలని ధర్మదీక్ష కిదె వందన మందగదోయి గ్రీష్మమా!                                 9.  

హ.వేం.స.నా. మూర్తి.
౩౧.౦౫.18.