Sunday 7 July 2019

నిజమైన సౌందర్యం.


నిజమైన సౌందర్యం.
(05-07-19)

ఆ.వె.
మానవుండు సతము మాన్యత్వముం బొంద
సంచరించుచుండి సర్వగతుల
దేహసౌష్ఠవంబు దీప్తిప్రదంబైన
యంద మంద గోరు నన్నిగతుల.                      1.
ఆ.వె.
దేహదీప్తి గోరి దివ్యౌషధంబుల
రాశులిందునందు శ్రమకు నోర్చి
కూర్చు కొనుట లోన కువలయంబంతయు
తిరుగుచుండు టిందు నరయవచ్చు.                2.
ఆ.వె.
స్వర్ణమయములైన సన్నుతాభరణంబు
లతులరత్నఖచితమై వెలుంగు
నట్లు కూర్చి తాల్చ నమరిన యందాని
కనుభవించు మోద మహరహంబు.                    3.
ఆ.వె.
మోహమిం దదేల దేహంబు నిత్యమై
నిలువబోదు భువిని నిక్కముగను
దాని కంద మిచట నానావిధంబైన
భూషణంబు లొసగబోవు వినుడు.                    4.
ఆ.వె.
నిర్మలాత్ములార! నిజమైన సౌందర్య
మెందు గల దటంచు సుందరమగు
మనముతోడ నెంచ నతరమైనట్టి
యంద మిందు నంద రరయవచ్చు.                  5.
ఆ.వె.
మానవత్వదీప్తి, మమతానురాగాలు
సాటివారియందు సవ్యమైన
సానుభూతితోడ సమతను జూపించు
టందు నిక్కమైన యంద మమరు.                    6.
ఆ.వె.
స్వార్థబుద్ధి వీడి సర్వమానవులకు
నిత్యశుభము గోరు నిర్మలమగు
ఠీవియూని హితము భావించుచుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  7.
ఆ.వె.
ఎదుటివారి మనసు కిసుమంతయుం గాని
బాధ కలుగురీతి పరుషములగు
మాటలాడకుండ మనగల్గ జాలుట
యందు నిక్కమైన యంద మమరు.                  8.
ఆ.వె.
ఆత్మతుల్యు లంద రన్నలు తమ్ముళ్ళు
జగతి యంత నాకు స్వంతమైన
దగు కుటుంబ మనుచు ననుకొన గల్గుట
యందు నిక్కమైన యంద మమరు.                  9.
ఆ.వె.
ఇతరు లెన్నియేని యిక్కట్లు పడుచుండ
స్వీయసుఖము లందు హేయమైన
సంతసంబు గాంచు స్వాంతంబు వీడుట
యందు నిక్కమైన యంద మమరు.                  10.
ఆ.వె.
నాదు కుక్షి నిండ మోదమందెద నంచు
దలచకుండ తనదు ధనచయంబు
దీనజనుల జేరి దానంబు చేయుట
యందు నిక్కమైన యంద మమరు.                  11.
ఆ.వె.
తనను విశ్వసించి తనపక్షమున జేరు
వారి నమ్మకంబు కోరి ద్రుంచి
వంచనంబుతోడ బాధించకుండుట
యందు నిక్కమైన యంద మమరు.                  12.
ఆ.వె.
ఫలము లందగోరి పరుల పంచన జేరి
స్వీయధర్మ మన్న ఛీ యటన్న
భావ మూనకుండ పావనుండైయుండు
టందు నిక్కమైన యంద మమరు.                    13.
ఆ.వె.
అల్పసుఖములందు ననునిత్యమును పెచ్చు
కల్లలాడునట్టి కాంక్ష వీడి
సత్యవాదియౌచు నిత్యంబు చరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    14.
ఆ.వె.
జన్మభూమి కొరకు సన్మార్గగామియై
ధర్మదీక్ష బూని తనువు, ధనము
తడయకుండ జేరి త్యజియించు యత్నంబు
నందు నిక్కమైన యంద మమరు.                    15.
ఆ.వె.
గృహము జన్మభూమి లిహమందు సౌఖ్యంబు
కలుగజేయు నట్టి స్థలము లగుట
సతము వాటికైన స్వచ్ఛతాకార్యంబు
లందు నిక్కమైన యంద మమరు.                    16.
ఆ.వె.
వృక్ష మిలను జనుని రక్షించు గావున
లక్ష మాటలేల లక్షణముగ
చెట్లు నాటి వాటి సేవను తరియించు
టందు నిక్కమైన యంద మమరు.                    17.
ఆ.వె.
కలియుగంబులోన నిలపైన ధర్మంబు
మృగ్యమగుచునుంట యోగ్యు డగుట
తలచి నిష్ఠతోడ   దానిని రక్షించు
టందు నిక్కమైన యంద మమరు.                     18.
ఆ.వె.
మహిని దైవతములు మహిళలై యుండుట
మాతృభావమూని నాతుల గని
గారవించుటౌను కర్తవ్యమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    19.
ఆ.వె.
గురుజనంబులందు నిరతంబు భక్తితో
మెలగుచుండి యొండు తలపు లేక
క్షితిని వారిమాట హితకరమని యెంచు
టందు నిక్కమైన యంద మమరు.                    20.
ఆ.వె.
కనుక మేలుకొనుట కర్తవ్య మగుటను
జాగరూకులౌచు సర్వజనులు
నిష్ఠబూని భువిని నిజమైన సౌందర్య
మరయ గలుగు సరణి నందవలయు.                21.


No comments:

Post a Comment