Tuesday 14 January 2020

శ్రీమన్మహావిష్ణవే నమః


శ్రీమన్మహావిష్ణవే నమః
శా.
శ్రీమన్మోహనదివ్యకాయయుతుడై చిద్రూపియై యెల్లెడన్
క్షేమంబుల్ గలుగంగ జేయుచు లసచ్ఛ్రేయంబులం గూర్చుచున్
భూమిన్ సర్వవిధాల గాచుచు మహద్భోగంబు లందించు నా
స్వామిన్ విష్ణుని గొల్తు గావు మనుచున్ సద్భక్తితో నిచ్చలుల్.           1.
శా.
శాంతాకారుని, భోగితల్పశయనున్, సౌజన్యరత్నాకరున్,
సంతోషప్రదు, సాధుసజ్జనహితున్, సన్మార్గదున్, శాశ్వతున్,
చింతానాశను, భక్తవత్సలు, విభున్, శ్రీనాథునిన్, జిన్మయున్
స్వాంతంబందున నిల్పి కావ సతమున్ బ్రార్థింతు గోవిందునిన్.                   2.
మ.
ఇలపై ధర్మము క్షీణతన్ గనుచు దా నెంతేని కుందంగ త
త్ఫలమై దౌష్ట్యము వృద్ధిచెందెడి తరిన్ దానిందు వాత్సల్య సం
కలితుండై యవతారముల్ గొనుచు సంకల్పించి పాపాదులౌ
ఛలముల్ గూల్చుచు గాచు నచ్యుతు హరిన్ సద్భక్తితో గొల్చెదన్.                3.
మ.
దురితంబుల్ నశియింప జేసి భువిపై దుఃఖార్తులన్ బ్రోచుచున్
నిరతం బన్నిట నిండియుండి మదులన్ నిత్యానురాగమ్ముతో
గరుణం జూపుచు నింపుచుండు ప్రభునిన్ గైవల్యదున్ జిన్మయున్
హరినిన్ గొల్చెద లోకరక్షకుని నే నత్యంత మోదమ్మునన్.                              4.
చం.
వరముల నిచ్చి భక్తులకు వైభవముల్ గలిగించుచుండి యీ
ధరపయి నిత్యసౌఖ్యము లుదారత గూర్చుచు రక్షసేయుచున్
నిరుపమహర్షసంతతులు నిత్యము జూపుచు దేవదేవుడై
సురుచిరసద్యశంబు లిడు సుందరరూపుని గొల్తు శార్ఙ్గినిన్.                              5.
చం.
చతురత జూపి యా సుధను సన్నుతరీతిని బంచువాని, దు
ర్మతుల మనోవికారములు వ్రయ్యలు చేయగ జక్రధారియై
యతులిత సత్వముం దెలుపునట్టి మహాత్ముని, ధర్మరక్షకున్,
సతతము గొల్తు నా హరిని, సర్వసుఖప్రదు, నార్యసన్నుతున్.             6.
ఉ.
కారణజన్ముడై జనుల గాచుచు సజ్జనకోటికెల్లెడన్
దోరపు మోదమిచ్చుచును దుష్టుల దైత్యుల ధర్మదూరులన్
మేరలు మీరువారలను మిక్కిలి క్రోధము జూపి గూల్చు న
వ్వీరుని సర్వభారకుని విశ్వమయున్ వినుతింతు నెప్పుడున్                       7.
ఉ.
దానవకోటికిన్, గతులు దప్పుచు లోకమునందు  దౌష్ట్యమున్
మానక చేయుచుండుటయె మాన్యతయంచు దలంచువారికిన్,
దీనజనాళిసౌఖ్యములు ద్రెంచెడి వారికి నంతకాలయం
బౌనదె యోగ్యమంచు నట కంపెడు వెన్నుని సన్నుతించెదన్                       8.
కం.
వందనములు శివసన్నుత!
వందనములు దైత్యనాశ! వైకుంఠ! హరీ!
వందనము లోకపూజిత!
వందనములు దేవ! నీకు వందనము లయా!                                                9.
కం.
నారాయణ! జగదీశ్వర!
కారుణ్యపయోధి! యఘహ! కైటభవైరీ!
వీరాధివీర! సంకట
హారీ! వందనము లిప్పు డందుము శౌరీ!                                                      10.
కం.
సిరిమగనికి వరసుఖదున
కరుసము సకలమున కొసగు హరి కనఘునకున్
నిరుపమునకు శుభగుణునకు
నిరతము నతులనిన బలిమి నిఖిలమున కిలన్.                                           11.

No comments:

Post a Comment