Monday 3 October 2022

స్వాతంత్ర్య అమృత మహోత్సవము

సీ.మా.

శ్రీలకు నిలయమై చిత్కళావాసమై

ప్రఖ్యాతిగాంచిన భవ్య భూమి

వేదశాస్త్రాలలో విస్తృతవిజ్ఞాన

మవనికందించిన యట్టి భూమి

పౌరాణికములౌచు సారవంతములైన

శుభకర్మలకు తీరు చూపు భూమి

సంస్కారమును నేర్పు సంస్కృతీ విభవంబు

బహుళవాత్సల్యాన పంచు భూమి

ధర్మస్వరూపమై నిర్మలానందంబు

కూర్మిజూపుచు గూర్చు కర్మభూమి

మునిజనస్థానమై యనిశంబు పరహిత

మాత్మ నెంచెడి దివ్యమైన భూమి

ఆధ్యాత్మికతతోడ నఖిలప్రపంచాన

భాగ్యమ్ము నిత్యమ్ము పంచు భూమి

పాడిపంటలతోడ పైరుపచ్చలతోడ

కలిమిని విఖ్యాతి గాంచు భూమి

స్వపరభేదములేక భాతృభావంబును

పరులకైనను గోరి పంచు భూమి

తే.గీ.

యగుచు నుతులంది వెలుగొందు నట్టి నాదు

భరతఖండంబు స్వాతంత్ర్య మరసి నేడు

డెబ్బదైదేండ్లు నిండిన వబ్బురంబు

గొలుపు నమృతోత్సవంబున వెలుగుచుండె

భరతమాతకు జేజేలు పలుకరండు

మనత్రివర్ణ పతాకము ననుపమముగ

నెగురజేయగ కదలుడీ జగతిలోన.

శా.

స్వాతంత్ర్యంబున కయ్యె సప్తతిపయిన్ పంచాబ్దముల్ నేడిటన్

చేతోమోదము సంఘటించినది సత్ క్షేత్రంబుగా వెల్గుచున్

ఖ్యాతింగాంచిన భారతావనిపయిన్ గల్యాణభావోన్నతిన్

బ్రీతిన్ సోదరులారరండు సమతన్ విశ్వంబునన్ జాటగన్.

సీ.

శాంతిసౌఖ్యంబుల చల్లని గాలులే

వేళనీ నేలపై వీచవలయు,

నిర్మలానందంబు ధర్మకర్మములందు

నిత్యమీ భువిపైన నిలువవలయు,

హర్షానుభవముల వర్షంబులిచ్చోట

నిరతమ్ము సర్వత్ర గురియవలయు,

స్వపరభేదంబుల ఛాయలీ భూమిపై

నిలువక శీఘ్రమ్ము తొలగవలయు

తే.గీ.

ఇట్టి భాగ్యంబు చేకూర్చ నెల్లవారు

ప్రతిన బూనుడు భారత పౌరులార! 

హర్షదంబైనయ మృతోత్సవాఖ్యపర్వ

మమరె నిచ్చోట స్వాతంత్ర్యమందు నేడు. 

No comments:

Post a Comment