Thursday 20 February 2020

శ్రీ శివాయ నమః.

శ్రీ శివాయ నమః.
(సర్వలఘుకందములు)

కం.
శుభకరునకు సురవరునకు
విభవము లొసగుచును భువికి  వివిధ సుఖములన్
బ్రభుడయి నిరతము దెలుపుచు
నభయము గలుగగను నిలుచు నభవునకు నతుల్.  1.
కం.
గిరిశునకు పరమశివునకు
హరహరయని బలికి జలము లట శిరముపయిన్
వరమగు విధమున జిలికిన
వరమొసగెడి యతని కిపుడు ప్రణతుల శతముల్.  2.
కం.
శిరమున జలమును జిలుకుచు
ధరగల దళములను బయిని దనకొసగినచో
సురకుజమును మన గృహమున
పెరడున నిలబడగ బిలుచు విబుధునకు నతుల్.  3.
కం.
పురహరునకు భవహరునకు
స్మరహరునకు  విసము మెసవి సకలజగములన్
సరగున నిలిపిన ఘనుడగు
హరునకు నతులనెద దలచి యనవరత మిటన్. 4.
కం.
గిరిసుతను సగము తనువున
సురుచిరముగ నిలిపి గళము శుభకరుడయు యా
యురగముల కొసగు పశుపతి
నరుసమునకు నిలయు డయిన యభవుని గొలుతున్. 5.

No comments:

Post a Comment