Friday 28 February 2020

పుస్తకము

ఉ.
పుస్తకమిందు జ్ఞానమును బొందగ జేయుచు సర్వకాలమున్
వాస్తవజీవనస్థితిని వైభవ మొప్పగ నేర్పుచుండు  నీ
మస్తకమున్ దిగంతముల మాన్యత లందగ జేయునట్టిదౌ
వస్తువు మానవా! నిజము భాగ్యద మియ్యది యన్నిరీతులన్. 1.
చం.
నరవర! గ్రంథరాజపఠనంబున యోగ్యములైన భావముల్
వరగుణముల్ ప్రవర్తనము ప్రస్తుతు లందగజాలు పద్ధతుల్
ధరపయి గూర్చగల్గుటలు తథ్యము మానవజీవనంబునం
దరయగవచ్చు సౌఖ్యముల నార్యజనావళి చూపినట్లుగన్. 2.
శా.
పొత్తం బీభువిలోన సర్వగతులన్ బూజ్యుండునౌ మిత్రుడై
చిత్తంబందలి కల్మషప్రకరమున్ ఛేదించి దుర్భావనా
పత్తిం గూల్చెడి యౌషధంబు వినుమా! బ్రహ్మాండముం గెల్చు సం
పత్తి న్నీకు వశంబు చేసి జయముల్ పండించు నో మానవా! 3.
మ.
అమితానందఫలప్రదాయి యయి తా నన్నింట యోగ్యంబునై
భ్రమలం గూలక శాశ్వతంబయిన సౌభాగ్యంబు నుం గాంచు సత్
క్షమతన్ నేర్పును పుస్తకంబు విధిగా సన్మార్గమందించు నీ
క్షమపై దీనిని మించు సాధనమి కొక్కండైన లేదెన్నగన్.
 5.
సీ.
పుస్తకస్థంబైన వాస్తవజ్ఞానంబు
పూజ్యతాకాంక్షులై పొందవలయు
పొత్తంబులంగాంచి చిత్తదీప్తిని బెంచి
మహనీయులై జనుల్ మసలవలయు
గ్రాంథికంబైనట్టి కమనీయ భావంబు
లంది సభ్యత్వంబు నందవలయు
వీనిలోనున్నట్టి విజ్ఞాన సంపత్తి
నింపుగా నెదలలో నింపవలయు
ఆ.వె.
పుస్తకంబు భువిని హస్తభూషణమన్న
పలుకు లోని భావ పరిమళమును
తెలిసి యందులోని స్థిరతరజ్ఞానంబు
మదిని నిలిపి జనుడు మసలవలయు. 6.

హ.వేం.స.నా.మూర్తి.
29.02.2020.

No comments:

Post a Comment