Thursday 29 September 2011

వేంకటసత్యాలు

వేంకట సత్యాలు
ఛందము - ఆటవెలది

శ్రీలనొసగుచుండి చిన్మయ రూపివై
నిఖిలజగతి నేలు నిన్ను దలచి,
నీతిపద్యశతము నిష్ఠతో బలికెద
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.   1.

వేంకటేశ్వరుండు వినయసంపన్నుండు
జనకు డమలచరిత జననినాకు
సాధుచరితతాను సామ్రాజ్యలక్ష్మియు
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.     2.

¶సూరిజనులు సత్యనారాయణుండంచు
పిలుచు చుంద్రు నన్ను పేర్మిమీర
¶సత్యవచన మాడి సత్కీర్తి నందెద
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.   3.

ముళ్ళపూడి వంశ ముఖ్యుండు నారాయ
ణాఖ్య గురుని కృపయె యఖిలజగము
బాగుగోరు పలుకు పలికించు నాచేత
వేంకటేశ! వినుమ, బొంకుగాదు. ౪.


పెద్ద చిన్న యనుచు భేద భావములేల?
మానవత్వ మొకటె, మమత యొకటె
కులములెంచ నేల? గుణమె ముఖ్యంబురా
వేంకటేశ! వినుమ, బొంకుగాదు.౫.


సారహీన మండ్రు సంసార మెల్లెడ
సారహీనమైన సంగమేల?
సంగరహితమైన సంసారముండునా?
వేంకటేశ వినుమ బొంకుగాదు. ౬.


కలిమిబలిమిచేత విలసిల్లు మనుజుండు
మందబుద్ధియయ్యు మాన్యుడగును
ఘనత వలయునన్న ధనమె మూలంబురా 
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭.


చదువు గల్గువారు స్వామివి నీవని
కూర్మితోడ ధనికు గొలుచుచుంద్రు
యిలను వాడె చూడ నింద్ర తుల్యుండులే
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮.


అంతులేని సిరుల కధికారి యొక్కడు
చూడ ధనములేని శూన్యుడొకడు
నిఖిలజగతిలోన నీలీల గనలేము
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౯.


అల్పమృగముజంపి హాయిగ నడవిలో
చింత లేక దిరుగు చిరుత యట్లు
బలముగలుగువాడు బలహీను బాధించు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦


ధనము గలుగు వాడె దైవంబు జగతిలో
వాని యులుకు పలుకు బ్రహ్మ వాక్కు
రాజకీయమందు రాణించు వాడింక
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౧


అంత మిథ్యయనియు నంతమందెవ్వరు
వెంటరారటంచు విశదమయ్యు
భార్య, పుత్రులంచు పరుగెత్తు మనుజుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౨


అవనిలోన జూడ నవినీతి యధికమై
లంచగొండితనము మించి పోయె
కలియుగాన నేడు కనరాదు ధర్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౩


కాసులివ్వకున్న కార్యాలయాలలో
పనులుగావు నేడు జనుల కిలను
కాసులాసజూప క్షణములో పనులౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౪


దేశరక్షణందు లేశమంతయు చింత
నవ్యజగతి లేదు నాయకులకు
ఎట్టులైన వారి పొట్ట నిండిన చాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౫


వాదులాడి జనుల బాధించు వాడును,
జూదమాడువాడు, చోరుడిలను
కలియుగంబులోన ఘనులయా వీరంత,
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౬


బాలుడైన గాని బహువృద్ధుడైనను
రూపహీనుడైన రోగియైన
చదువు గలిగెనేని సన్మాన మందును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౭


బొంకులాడువాడు, బొంకించువాడును,
తీవ్రవాది యగుచు తిరుగువాడు,
కుత్సితుండు వీరు గొప్పవారలు నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౮


ఎదుటివాని పనుల నెంత మంచివియైన
మెచ్చలేడు జనుడు హెచ్చుగాను,
కనుడు నాదు యశము ఘనుడ నేనంటాడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౯


అమలు సేయ డెప్పుడభివృద్ధి పథకాలు
నిజము చూడ దేశనేత నేడు,
ఎట్టులైన తనకు పొట్టనిండిన చాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౦


తనకు వలయు సుఖము తక్కువారేమైన
నేమి యంచు దలచు నిలను జనుడు
స్వార్థహృదయుడగుచు సాధించు సర్వంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౧


మంచివాడు వీడు మననేత యంచును
విజయవంతు జేసి విజ్ఞుజేయ
దేశభక్తి లేక తినుచుండు లంచాలు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౨


పట్టుబట్టగట్టి భగవాను గొలిచినా
కరము సంతసించి వరములీడు
సాటివారి యందు సహకారి గాకున్న
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౩


కలిగినంతలోన ఘనముగా జీవించి
పరులకెపుడు కలిమి బంచువాడు
స్వర్గసుఖము ధరనె సమకూరి వర్థిల్లు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౪


రాజకీయమందు రాణించ వలెనన్న
నిజము బలుకరాడు, నియతితోడ
పనులు సేయరాదు, భక్షించవలె గాని
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౫


విద్యగలిగి వేదవేత్తయు తానైన
ధరను జూడ మిగుల ధనుకుడైన
వినయశీలి యగుట ననయంబు ముఖ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౬


ధనము గలిగియున్న, ధరనేలు ప్రభుడైన
తార్కికుండునైన, తల్లిదండ్రి
వలచి కొలువడేని వ్యర్థజీవనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౨౭


గురువులన్న భక్తి కొంచెమైనను లేదు,
చదువుపైన శ్రద్ధ మొదలె లేదు,
అరయఛాత్రులందు నవగుణంబులు హెచ్చె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౮


అంగబలముతోడ హత్యలు చేయించి
మానవత్వమంత మట్టి గలిపి
నాట్యమాడువాడె నాయకుండిల నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౨౯


కుంభకోణమందు కోట్లను గడియించి
దేశభక్తిలోన దిట్టలమని
నీతి బల్కు వారె నేతలు నేడైరి
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౦


తాను తప్పు చేయు, తన తప్పు జూడక
యెదుటివారి తప్పులెత్తి చూపు
తప్పులేనివారు ధరణిలో కలరేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౧


ఛీదరించుకొనుచు, చిటపటలాడుచు
నెదుటివారి కలిమికేడ్చువాడు
ఘనత నంది యశము గనలేడు ధరణిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౨


బంధుజనుల బిలిచి భాగ్యరేఖనుబంచి
యొంటివాడు గాక నోర్మితోడ
మెలగుచుండువాని కిలను సౌఖ్యము గల్గు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౩


ధర్మభీతి యేల? దైవచింతన యేల?
మానవత్వమేల? మమత యేల?
స్వార్థపూర్ణుడైన చాలును నేడింక
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౩౪


ఎదుటివారి యూసు నిసుమంత యెత్తక
స్వీయసుఖము గోరు విమల మతియె
కలియుగంబులోన విలసిల్లు, ఘనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౫


వ్యర్థజీవి గాక, వార్థక్యమందున
సకలజన్మలభ్య సుకృతమనుచు
తల్లిదండ్రి గొలుచు తనయుండు ధన్యుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౬


స్వార్థబుద్ధివీడి సవ్యంపు మార్గాన
వర్తనంబు సేయు వాని కిలను
కలిమి యేల గల్గు? కలియుగంబిది గాదె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౭


స్వార్థరహిత సేవ, సత్యవాక్పాలన,
ధర్మభీతి మరియు దానగుణము,
కలిగెనేని మనుట కష్టమీయుగమందు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౮


అల్పబుద్ధియయ్యు నధికుడనేనంచు
పలువిధంబుగాను బలుకుటెల్ల
యవనిలోన జూడ నధమత్వమదిగాదె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౩౯


సకల శాస్త్రవేత్త, సర్వజ్ఞుడయ్యును,
మందబుద్ధినంచు మాటలాడు
దర్పహీనుడొండె ధన్యుండు జగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౦


మతములన్ని యొకటె, మనుజులమందరం
బంచు భాషణంబు మించి యొసగి
కూర్మిజూపువాన్కి కులమె సర్వంబులే
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౪౧


ఇల్లు చక్క బెట్టు, నింపైన వాక్యాల
పతికి సౌఖ్యమెపుడు బంచు నింతి
నిఖిల జగతి లోన నిరుపమ నిస్స్వార్థ
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౨


రేయి పవలు మరియు రేపును మాపును
కులమువారి సుఖమె గోరు చుండు
సార్థకంబు జూడ నర్థాంగి జన్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౩


సారవంతమైన సంసార జలధికి
సంతసంబు గూర్చు చంద్రరేఖ
సాధ్వి, యల్గెనేని సర్వంబు శూన్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౪.


జన్మనొసగు, బెంచు, జనునకు సతతంబు
నఖిలసుఖము లిచ్చు యశము గూర్చు,
జీవకోటికతివ జీవనాధారంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౫


ఆజ్ఞమీరకుండి యనుకూలవతి యౌచు
మగని మనసు నెరిగి మసలుకొనెడి
భార్య దొరుక జనుడు భవ్యజీవనుడౌను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౬


స్వీయసుఖముగోరి చేయదేపనియైన
భర్త, బంధుజనులు బాగుగున్న
చాలు నంచు దలచు నాలు యీజగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౭


ప్రాణనాథు కొరకు పరమకష్టములైన
వ్రతములెన్నొ సేయు సతతమతివ
భర్త నెంచు చుండు పరమదైవంబుగా
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౮


అతివ లేక యున్న నందహీనము గీము
రాజరహితమైనరాత్రి పగిది
అఖిలజగతికెన్న నతివయె మూలంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౪౯


వేతనంబు నంది విశ్వాసరహితుడై
స్వామికార్యమందు శ్రద్ధ లేక
నిల్చువానికంటె నీచుడు లేడొండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౦


మాయనెరుగకుండి మంచిగా వర్తించి
పరులకెపుడు సాయపడెడి నరుడు
ఘనతనందలేడు కలియుగంబున నేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౧


ఓటు కొరకు మొదట దీటైన వరముల
నిచ్చుచుంద్రు నేతలిలను నేడు
పదవినంది పిదప పల్కరింపగ రారు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౨


వినయవర్తనంబు, విద్వాంసశుశ్రూష
సత్యభాషణంబు, సాధుచరిత
మంచి గుణములివ్వి మరి సందియంబేల?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౩


దిక్కు మొక్కులేని దీనార్తులను గాంచి
చిత్తశుద్ధితోడ చేరదీసి
దయనుజూపువాడు ధన్యుండు జగతిలో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౪


ఉర్విలోన నేడు నుద్యోగమంచును
ప్రాకులాడుచుంద్రు పౌరులెల్ల
స్వీయవృత్తి నెవరు సేయంగరారయ్యె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౫


విత్తమున్ననేమి? విద్యనేర్చిన నేమి?
గౌరవాదరంబు గల్గనేమి?
మార్దవంబు, మమత, మానవత్వములేక
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౬


మాటలోన మిగుల మార్దవమొలికించి
సాటివారికెపుడు చేటు చేయు
నరుడు సత్వరంబె నశియించు తథ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౭


స్వీయ ధర్మమందు శ్రేయస్సు గలదంచు
శాస్త్రమందు నాడు చదువ లేదె?
బ్రతుకు తెరువు కొరకు పరధర్మమేలనో?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౫౮


శక్తిలేనివాడ, సాయమెట్టికజేతు
సాటివారికంచు జనుడు పల్కు
మనసు కుదిరెనేని మార్గంబు గల్గదా?
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౫౯


ధరణిలోన నేడు ధనవంతుడెల్లెడ
ఛీదరించుకొనును పేదవాని
జననమందునపుడె ధనము తెచ్చెనయేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౦


ధర్మపరుడనంచు దైవంబు గొల్చుచు
భక్తి నుపవసింప ఫలితమేమి?
ధరణి దీనులందు దయజూపకున్నచో
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౧


ఖ్యాతినందగోరి ఘనమైన దానాలు
చేయనేమి ఫలము? చిత్తశుద్ధి
శూన్యమయ్యెనేని చూడంగ నిసుమంత
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౨


అస్మదీయుడీత డన్యుడు వాడంచు,
నల్పబుద్ధి యేల? యఖిలమునకు
భవము నొసగువాడు భగవంతుడొక్కడే
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౩


వేదచయము జదివి, విద్వాంసుడైయుండి
వివిధశాస్త్రధర్మవేత్తయయ్యు
గర్వసంయుతుండు ఘనతనందగలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు.౬౪


వేలకొలది ధనము వెచ్చించి భగవంతు
గొలుచుగాని నరుడు కూర్మితోడ
పేదవారి కెపుడు మోదంబు గూర్చడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౫


అతిథి జనులకేమి యందివ్వలేకున్న
మంచి మనసుతోడ మమత జూపి,
మధువులొలుకు నట్టి మాటయె చాలొండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౬


సకలభోగభాగ్యసంపత్తి గల్గియు
సర్వజగతినేలు సత్త్వమున్న
చదువులేని బ్రతుకు సార్థక్యమందదు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౭


విశ్వవిదితమైన వీరత్వమదియున్న
నమల యశము మనుజుడంద బోడు,
ఒరుల పట్ల కొంత యోరిమి లేకున్న
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౮


అల్పబుద్ధి యయ్యు నధికుడ నేనంచు
తెలివిగల్గు వారి దెగడు చుండు
నధిక గర్వయుక్తుడవివేకి యీరీతి
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౬౯


ధనమదాంధుడౌచు దాయాదులను జూచి
కుడువ వచ్చిరంచు కోపగించు,
విత్తమంతమందు వెంటవచ్చున యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౦


పైకి నీతులెన్నొ పలికెడి వాడెప్డు
చెడ్డపనులె తాను చేయు టెల్ల
కాదు దోస మిదియె కలియుగ ధర్మంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౧


సత్యభాషణంబు నిత్యంబు చేయుచు
బహుళ ధర్మకార్యవర్తియైన
వాని కిహము పరము వైభవయుక్తంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౨


బుద్ధిమంతులగుచు బోధించు వారెల్ల
సుంత యేని యాచరింతురేమి?
చెప్పువారె గాని చేయువారిల లేరు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౩


నిత్యశంక లేల? యత్యాశయదియేల?
తుష్టిలేమి యేల? దు:ఖమేల?
జనుని జీవనంబు శాశ్వతంబా యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౪


బ్రతుకదలచి నరుడు మెతుకులు గొనవలె
తినుటకోసమిలను మనుట తప్పు,
కోటి పాపములకు కుక్షియె మూలంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౫


కొడుకు వలయు నంచు కోటి పూజలు చేసి
సుతుని గాంచి నరుడు సుఖములందు
దుష్టుడౌచు వాడు దూరిన శోకించు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౬


బుద్ధి గలిగి నరుడు పుణ్యంబు కోసమై
తీర్థయాత్రలంచు దిరుగుచుండు,
దేశసేవలేక దివమేల యబ్బును?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౭


బాహు బలము గల్గి దేహసౌష్ఠవమున్న
మాతృదేశసేవ మానె నేని
ధరణిలోన నరుడు ధన్యుడు గాలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౮


పరమధర్మశాస్త్రపారంగతుండయ్యు
వేదపఠన చేత విజ్ఞుడయ్యు
మాతృపూజలేక మాన్యుడు గాలేడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౭౯


సాటివారి యందు సమతను జూపించి
చిత్తశుద్ధితోడ సేవ జేసి
మనుచు నుండు నట్టి మనుజుడు ధన్యుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౦


దార, పుత్రులంచు తనవారు వీరంచు
పాటు పడును నరుడు పగలు రాత్రి
అంతమందు వీరలనుసరింతుర యేమి?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౧


మోహపూరితంబు దేహమనిత్యంబు,
సకలరోగజాల సంయుతంబు,
మమత దీనిపైన మహిలోన వ్యర్థంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౨


తేనెవలెను మిగుల తియ్యగ మాట్లాడి
కుమతి యగుచు గొంతు కోయువాడు
అసురశబ్దవాచ్యు డన్యుడు గాబోడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౩


కఠినమైన నేమి కంఠస్వరంబొండు,
వెన్నవంటి హృదయవిభవముండి
మమతగలిగియున్న మర్త్యుడె దివిజుండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౪


పరుషవాక్య మెపుడు బలుకకనుండుచు
మత్సరంబు వీడి మనెడువాడె
మౌనియనగ బరగు మరియొండు మౌనుయా?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౫


సాధుజనుల యందు శాంతంబు విడనాడి
క్రూరబుద్ధితోడ కుపితుడగుచు
మసలుచుండు వాడుమానవుడెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౬


ధర్మమన్ననేమి? దానంబులననేమి?
భగవదర్చనంపు భావమేమి? 
సతము దీనులందు సహకారమే గాదె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౭


ముక్కు మూసుకొనుచు, మూడువేళలయందు
ధ్యానమగ్నుడైన తపసియౌనె?
దానగుణము, భూతదయలేకయున్నచో 
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౮


సాధువర్తనంబు, సచ్ఛీలసంపద
వెలయు సహనముండవలయు గాని,
సోయగంబు గాదు సుదతికి ముఖ్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౮౯


మంచి పనులు సేయ మనకు భాగ్యంబబ్బు
చెడ్డపనుల తోడ చేటు గల్గు
భాగ్యకారణంబు భగవంతుడెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౦


అఘములెన్నొ చేయు, ననృతంబులాడును,
మార్చుచుండు రూపు మారుమారు
కుక్షికొరకు నరుడు కువలయంబున జూడ
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౧


తాను సాయపడడు, తనకు సాయము సేయ
నెవరురారటంచు నేడ్చుచుండు,
స్వార్థబుద్ధి నరుడు సంకుచితాత్ముండు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౨


జన్మనిచ్చి పెంచు జనకుల బోషింప
భారమనెడు తనయు బడయుకంటె
పుత్రహీనుడైన పుణ్యంబునందును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౩


అవనిలోన మనుజుడర్థార్జనార్థమై
ఎట్టిమార్గమైన నెంచుకొనును,
బ్రతుకుబాటనున్న పరమార్థమిదియేను
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౪


సిగ్గుపడగనేల స్వీయధర్మముజూచి?
యన్యధర్మమన్న నాశయేల?
మతము మార్చుటెల్ల హితకరియెట్లౌను?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౫


పనులు సేయ వలయు, ఫలములెంచగ నేల?
యనుట నాటి మాట, యదియె నేడు
ఫలముగొనగవలెను, పనులు సేయక యయ్యె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౬


నవ్యదుగ్ధజనిత నవనీత తుల్యంబు
నిరతమోదయుతము నిర్మలంబు
పరమపావనంబు బాలుర హృదయంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౭


తల్లిదండ్రియెవరు? తనవారలెవ్వరు?
అన్నదమ్ములెవ్వరాప్తుడెవడు?
అభయమిచ్చి మనల నాదరించెడి వాడె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౮


విశ్వదీప్తమైన విజ్ఞానసంపత్తి
బహుళయశము నరుడు పడయుటెల్ల
పూర్వజన్మలబ్ధ పుణ్యప్రభావంబె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౯౯


సజ్జనాళి గొలువ ముజ్జగంబులలోన
సద్గుణంబులబ్బు శక్తి హెచ్చు,
విమలమౌను తనువు వికసించు హృదయంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౦


చిర్రుబుర్రుమనుచు చీటికి మాటికి
బంధుజనుల మనసు బాధపెట్టి
యేమి పొందు నరుడు, యేకాకియౌగాని
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౧


ఒరుల జేరదీసి యుత్తమగుణుడౌచు
మమత బంచి యిచ్చు మానవునకు
వైభవంబు యశము భగవంతుడొసగును
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౨


శక్తిగలదు నాకసాధ్యంబు లేదంచు
విర్రవీగుచుండు వెర్రి జనుడు
నిత్యసత్త్వుడైన మృత్యుంజయుండౌనె?
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౩


బాగుగోరి సుతుని బహురీతి బోధించు
ఘనతనందు నంచు గాంక్షసేయు
ఎవ్వడెరుగు తనయుడెట్లుండునో భావి
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౪


పరులవలెను తనకు సిరులబ్బలేదంచు
నేడ్చుగాని మనుజు డించుకైన
దైవనిర్ణయంబు తనభాగ్యమనుకోడు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౫


చీకుచింత లేక చిన్మయరూపులై
పరుగులిడుచు నుంద్రు బాలలెల్ల
బాల్యమనగనేమి? బహుమూల్యమదిగాదె
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౬


దేహదీప్తిగోరి దవ్యౌషధంబులు
వాడనేమి ఫలము వసుధలోన
దయయు, వినయమున్న తనువది వెలుగొందు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౭


జంకు గొంకు లేక సాగిపోవలెగాని
యాదిలోన భీతి నందరాదు
ధైర్యవంతుడొందు కార్యసాఫల్యంబు
వేంకటేశ! వినుమ బొంకుగాదు. ౧౦౮   
                                               సర్వేజనాస్సుఖినోభవన్తు
                                                         -మూర్తి  
   
                   
   

                         



No comments:

Post a Comment