Tuesday 27 September 2011

సీతమ్మ

శ్రీరామార్థశరీరిణీ! ధరణిజా! చిద్రూపిణీ! జానకీ
కారుణ్యామృతవర్షిణీ! సురనుతా! కైవల్యసంధాయినీ!
ధీరాత్మన్ నినుగొల్చు భక్తజనముల్ దీవ్యత్ప్రభాపూర్ణులై
నీరేజాక్షుని జేరి కాంతురుగదా, నిత్యోత్సవంబెప్పుడున్.

ఎల్లజగంబువారలకు నింపుగ నీకరుణామృతాంబుల్
చల్లని దృక్ప్రసారములు, సర్వశుభంబులు సంతతంబు సం
ధిల్లగజేసి కష్టముల దీర్తువు, గూర్తువు సౌఖ్యసంపదల్
తల్లివి నీవు లోకమున తల్లులకెల్లరకమ్మ! జానకీ!

అమ్మా! నిన్ను దలంచి కార్యములు చేయంబూనినన్ మాతవై
సమ్మోదంబును గల్గజేసెదవికన్ సన్మార్గసంధాతవై
మమ్మెల్లన్ విజయోస్తటంచు శుభముల్ మాకందజేయించు సీ
తమ్మా! చల్లగ జూడుమమ్మ, అభయంబందించి రక్షించుమా.

మాతకు, సర్వభక్తజనమానససంస్థితకామ్యరాశిసం
ధాతకు, రావణాదిఘనదైత్యవినాశనకారణైకసం
జాతకు, పుత్రవత్సలత సర్వశరీరము నిండినట్టిదౌ
సీతకు నే ప్రణామములు చేసెద బుద్ధివివర్థనార్థమై.

నమ్మితి నెల్లకాలముల నమ్రతనిండిన నామనంబునన్
నమ్మితి రామచంద్రులను, నమ్మితి సీతను లోకమాతనున్
నమ్మితి నాంజనేయులను, నమ్మితి నిత్యము నిండుభక్తితో
నమ్మినవారి కెల్లెడల నవ్యసుఖంబులు గల్గుచుండెడిన్.

No comments:

Post a Comment