Wednesday 28 September 2011

జవహర్ నవోదయ

 జవహర్ నవోదయ
"శ్రీరాజీవుని" భావనాబలమునే చేబూని తానంతటన్
కారుణ్యాత్ముడు నారసింహ ఘనుడా కార్యాను సంధాతయై
ధీరుండై జవహర్నవోదయకిలన్ దీవ్యచ్ఛుభారంభమిం
పారంగా జరిపించె ఛాత్రులకు సౌభాగ్యప్రదంబో యనన్.

పల్లెలలోన నుండుటను, భాగ్యవిహీనత, కాక్షలుండి తా
మెల్లెడ మంచి విద్యలకు నించుక నోచని బాలబాలికల్
సల్లలితాసుధామయసుసంస్కృతవిద్యల నభ్యసించున
ట్లుల్లము సంతసించి భరతోర్వర తన్మయమందునట్లుగా.

చిక్కటి స్నేహగంధములు శిష్యులచిత్తములందు నింపి తా
రెక్కడి వారలైన వికసించగ సోదరభావజాలముల్
చక్కని వర్తనమ్ములును, సద్వినయాభ్యుదయంబు చేకురన్
మిక్కిలి దక్షతన్ మలచి మేటిగ జేయుదురొజ్జలిచ్చటన్.

విద్యార్థుల్ కడుశ్రద్ధతోడ నిచటన్ వేర్వేరు కార్యక్రమాల్
సద్యోచాతురి, సాధువర్తనమికన్ సంగీత సాహిత్యముల్
చోద్యంబందగ జేయు చిత్రరచనల్ శోభిల్లు సత్క్రీడలున్
విద్యభ్యాసముతోడ నేర్తురు సదా విస్తారచిత్తంబులన్.

కులముల యూసుమాని, తమగోత్రములన్ స్మరియించకుండగా
కులము నవోదయంబనుచు, గోత్రము మైత్రియటంచు నిత్యముం
దలచి నవోదయానుగతధార్మికవర్తనతోడ నేకతా
బలమును బొంది ఛాత్రతతి భాగ్యములందుచు నుందురిచ్చటన్.

గురులే తల్లులు, దండ్రులాప్తులగుచున్ కోరంగ సర్వార్థముల్
నిరతం బందగ జేసి, శిష్యులహృదిన్ నిర్మాయికత్వంబు, యీ
ధరలో సద్విజయాల సిద్ధికొరకై దారుఢ్యతన్ నింపు యా
సరణుల్ చూడగ లభ్యమౌనె? జవహర్ శాలన్ వినా యెందునన్.

సదనంబుల్ మరి నాలుగున్నవిచటన్ సద్గోత్ర మారావళీ
యిదియుం బిమ్మట నీలపర్వత శివాలిఙ్మోహనాకారులా
యుదయాద్రుల్ తమపేరులై ఘనముగా నొప్పారుచుండంగ తా
మెదలో సోదరభావముల్ నిలిపి క్రీడింతుర్ సదా బాలకుల్.

No comments:

Post a Comment