Tuesday 27 September 2011

జ్ఞాపకాలు

2008  మే నెలలో హైదరాబాద్ నగరం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో  జవహర్ నవోదయ విద్యాలయాలలో తెలుగుభాషను బోధిస్తున్న ఉపాధ్యాయులకు 21 రోజుల శిక్షణాశిబిరం నిర్వహించ బడింది. ఆ శిక్షణకు గుర్తుగా సంస్కృతభాషలో వ్రాసుకున్న శ్లోకాలు. 

ఆంధ్రప్రదేశ్ రాజ్యస్య రాజధానీ మహాపురీ
విమలా భాగ్యసంపన్నా హైదరాబాదు రద్భుతా |

తస్యాం నగర్యాం నాంపల్యాం పొట్టి శ్రీరామ నామకే
విశ్వవిద్యాలయే తత్ర స్వల్పకాలికశిక్షణమ్ ||


ప్రాప్తుమధ్యాపకాస్సర్వే తెల్గుబోధనతత్పరా :
ఆగతాస్సర్వప్రాంతేభ్య: జ్ఞానార్జన సముత్సుకా:|


ఉత్తరే భారతే కేచిత్ కేచిదాంధ్రేచ సంస్థితా:,
శిక్షణార్థంతు తే సర్వే భాగ్యపట్టణమాగతా:||


విశ్వవిద్యాలయస్యాస్య అధిపా మంజుభాషిణీ,
మంజులతా యశ:పూతా, సాధులక్షణ లక్షితా||


శ్యామలార్యాధిపత్వేతు, కేశవార్యాస్సహాయకా:,
ద్వయోర్నిర్దేశమాశ్రిత్య, సంభూతం శిక్షణం ఖలు||


ఆచార్యైర్బహునిష్ణాతై: అత్యంతప్రతిభాన్వితై:,
భాషాబోధన సంబంధి బహవో విషయాస్స్మృతా:||


మునిరత్నాఖ్యసద్విద్వాన్, గౌరీశంకరపండిత:,
వేంకటాద్యశ్చ, స్వామిశ్చ, రెడ్డిశ్యామల నామకా:||


ఆశీర్వాదార్యచెన్నప్పౌ, చంద్రశేఖరమధ్యగౌ
నాగలక్ష్మీశ్చ, తోమాస:, వేంకటేశ్వర సంయుతా:||

రామాంజనేయశ్శ్రీకృష్ణ:, ఉషాదేవీ చ సర్వదా,
అధ్యాపకాస్తు తే సర్వే, నన్మాసానంద సమ్మితా:||

సరోజినీ మార్దవపూర్ణభాషిణీ,
సుహాసినీ, భవ్యవచ: ప్రసారిణీ,
సమగ్ర విద్యావిషయప్రణాళికా
మనన్యసామాన్యమివాత్ర దర్శితా||

మధ్యే మధ్యేతు కంప్యూటర్ జ్ఞానం సర్వత్ర లాభదమ్,
దత్తం నిత్యం తు భారత్యా విస్పష్టం చ సువిస్తరమ్||


విజ్ఞానసంధాత్రి రనంతలక్ష్మీ
రత్యంతమాధుర్యవచ: ప్రపూర్ణా
సౌమ్యా చ మందస్మిత భూషితా చ
నాన్యోపమా భారతిరూపిణీ చ||


సత్యనారాయణో విద్వా నుక్తవాన్ ప్రీతి పూర్వకమ్
సంఘే చ సాహితీ రంగే, సంస్కారం చాధునాతనమ్||


అతిచతురమయీ సా సారపూర్ణా చ దివ్యా
బహువిషయసమేతా భావగంభీరయుక్తా,
సురుచిరపదయుక్తా, సంశయఘ్నా చ భవ్యా
నరహరిగురువాణీ నాన్యసాధారణా చ||


ద్వానాశాస్త్రివరేణ్యశ్చ బేతవోల్వన్యయాబ్ధిజా:,
శరజ్జ్యోత్స్నా చ శ్రీరామ: రాధా పవన నామకా:||


నూనం శిక్షణమేతత్తు లాభదం మార్గదర్శకం,
నమాంసి పునరేతేషాం సర్వేషాం గురుమూర్తినామ్||


జవహర్ నవోదయ విద్యాలయం, వెన్నెల వలస, శ్రీకాకుళం జిల్లా 
నుండి 
హర్యానాకు ట్రాన్స్ ఫర్ అయిన సందర్భంగా   
ది. 09.07.2007వ తేదీన జరిగిన వీడ్కోలు సభలో 
ఉపాద్యాయ మిత్రులనుద్దేశించి చెప్పిన పద్యములు.

శ్రీకాకుళసన్మిత్రుల 
నేకాలము మరువజాల నెచ్చటనున్నన్
మీకారణమున గాదా
నాకిచ్చట లభ్యమయ్యె నవ్య యశంబుల్.


చక్కని ఫలితంబులతో
మిక్కుటమగు యశముతోడ మేదిని లోనన్
చిక్కని యున్నత దశకీ
చిక్కోలు నవోదయంబు చేరగ వలయున్. 
(శ్రీకాకుళానికి పూర్వ నామం - చిక్కోలు)


2005 సెప్టెంబరు నెలలో 
జ.న.వి., వర్గల్(మెదక్ జిల్లా)లో ఐదు రోజుల పాటు జరిగిన 
"ఆర్ష్"శిక్షణ సందర్భముగా 
వ్రాసిన పద్యములు.
కం.
పెనుభూతము ఎయ్ డ్సన్నది
కనగా నతిదుష్టయగుచు క్రమముగ నేడున్
తన విస్తృతి చూపించగ
జనజీవిక కష్టమయ్యె సకల జగానన్.
ఆ.వె.
అంటుకొనెడు జబ్బు అసలిది కాదండి
కోరి తిమిరమందు గోప్యముగను
అన్యకాంత జేరి యంటించు కొన్నచో
మరణమేనటంచు మరువవద్దు.
ఆ.వె.
మందు లేదటంచు మరి చింత వలదోయి
సోకకుండు విధము సులభమోయి
మనసు నిగ్రహించి యనువర్తనము చేయ
నిన్ను చేరరాదు నిజము నిజము
ఆ.వె.
తెలిసి తెలియకుండ దీని బారిన బడ్డ
వారి పట్ల కరుణ వలయు నండి,
మంచి మాటలాడి మమతానురాగాలు
పంచి హేయమనక బ్రతుక నిండు. 
ఆ.వె.
మాయలాడి ఎయ్డ్సు మంత్రాల తంత్రాల
నుపశమించబోదు ఓర్పుతోడ
సవ్యవర్తనంబు సరియగు బాసలు
చేసుకొన్న చాలు చేరబోదు.
ఆ.వె.
కనగ జీవితాన కౌమార దశయొండె
మానవాళి నెల్ల మలచు చోటు
లలితమైన సరణి లైంగిక జ్ఞానంబు
వలసినంత మేర తెలుప దగును. 
ఆ.వె.
మైథునంబులోని మాధుర్యమునుగోరి
తెలుసుకొనుట కొరకు కలలు గనుచు
నీమ మెరుగ కుండ కౌమార దశయందు
పాడి దప్పుచుండు బాలకులకు.
ఆ.వె.
విస్తరించి చెప్పి విజ్ఞాన మందించి
పాడిదప్ప గల్గు బాధలన్ని
ఎయ్డ్సటన్న నేమొ, ఎంత మాత్రముగాడి
తప్పవలదటంచు చెప్పవలయు
ఈవిషయంలో
కం. 
శ్రీ సదగోపను గారలు
భాసిల్లుచు శిక్షణంబు బహుదక్షతతో
నాసాంతము చేయించిరి
మాసాంతముదాక మాకు మాన్యులనంగా.
ఆ.వె.
"ఆర్ష" శిక్షణాన నధికంపు సామర్థ్య
మందగలిగినార మందరమును
ఘనత బాలలందు కౌమార దశవారి
భావ సరళి నింక బాగు బరుచ.
తే.గీ.
ఆది నారాయణాఖ్యుండు మోదమొప్ప
లక్ష్మి కాంతునితో గూడి లలితరీతి
వేంకటార్యుండు  గూడంగ విస్తృతముగ
బోధ జేసెను బహువిధ సాధనముల.
కం.
మరికొందరు నిష్ణాతులు
సరసంబగు భాషణాల సద్విషయాలన్
నిరతము చెప్పుచునుండిరి
సరణులు రక్షార్థమపుడు చక్కగ వారల్.
తే.గీ.
ఔర! వర్గల్నవోదయమందజేయు
మథుర మాతిథ్య మెన్నడు మరువలేము
అచటి విద్యార్థులందున నధికమైన
వినయవర్తన, గురుభక్తి విశదమయ్యె.

 ది.22-06-2005 నుండి 03-07-2005 వరకు  
జ.న.వి. కొమ్మాది, విశాఖపట్టణం లో  
జవహర్ నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులకు 
నిర్వహించబడిన కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం (ప్రాజెక్టు శిక్ష) 
సందర్భంగా వ్రాసిన పద్యములు.  

కం. 
బోధనలో కంప్యూటరు
సాధనముగ జేసికొనుచు చక్కగ పాఠాల్
బోధించుచు విద్యార్థుల
మేధస్సును పెంచవలయు మీరిట పైనన్.
కం.
"ప్రాజెక్టు శిక్ష" పేరున
వైజాగున నేర్పగలరు వాసిగ నౌరా
యేజాగు చేయకుండగ
పోజెల్లును మీరలిప్డు పోవలె నింకన్.
తే.గీ.
అనుచు నాకును సాంబశివాఖ్యునకును
అందజేసిన యాదేశ మందుకొనుచు
జాగుసేయక వేసవి కాగ కుండ
సిద్ధమనుచును వైజాగు చేరినాము.
ఆ.వె.
మధురవాడనుండి విధమెద్దియోచేర
తెలియరాకపోయె దిశలలోన
జోరుగల్గు వర్షసూచనలందంగ
శీఘ్రమాటొ యెక్కి చేరినాము.
కం. 
చేరీ చేరకమునుపే
భారీ వర్షంబు గురిసె బహుచిత్రముగాన్
ఆరేయి సేదదీరితి
మారంభంబయ్యె శిక్షణా మరునాడున్.
కం.
"ఆదిత్యుం""డానూపుం"
డాదిని "ప్రాజెక్టు" పరిచయంబును జేయన్
మీదట "సుబ్రతు"డాఖ్యుడు
మోదంబుగ్ బోధ చేసె ముఖ్యుండనగా.
ఆ.వె.
మొదట"మైక్రొపేంటు’ ముఖ్యంబుగా జూపి
యందులోని మర్మ మంత దెల్పి,
"ఫైలు,ఫోల్డరు"లకు బహువిధ పద్ధతుల్
తెలియ జెప్పినారు తిరముగాను.
ఆ.వె.
"సాఫ్టువేర"టన్న సరియగు నర్థంబు
"వర్డు డాక్యుమెంట్లు" వరుస నంత
"వర్డు"లోన పేంటు వైభవంబుగ దెల్పి
"కాపి, పేస్టు" చెప్పె ఘనముగాను.
తే.గీ.
"పవరు పాయింటు" లోపల బహువిధమగు
"స్లైడు" నిర్మించు పద్ధతి చక్కగాను
కూర్మి స్లైడుల బొమ్మలు కూర్చు విధము
వాటి"హైడింగు" లను గూర్చి వరుస దెల్పె.
ఆ.వె.
అక్షరాలు యెగిరి యాకాశమందుండి
"స్లేడు" చూపు నపుడు చేరు విధము
చోద్యమంద ధ్వనులు జోడించు పద్ధతి
సుబ్రతుండు చూపె సులభరీతి.
ఆ.వె.
"ఎక్సె"లన్న నేమొ, యేవిధమందులో
చూపవచ్చు గణన సులభముగను
కూడి తీసివేత, గుణకార శాతాలు
చేయు విధము దెల్పె సెకనులందు.
కం.
ఆదిత్యు డప్పుడప్పుడు
సాదరముగ జెప్పుచుండె సరియగు ప్రశ్నల్
మాదిరి యభ్యాసంబులు
రాదగియున్నట్టిదంత రమ్యపు ఫణితిన్.
తే.గీ.
పవరుపాయింటు  సాహాయ్య భాగ్యమునను
మిత్రులందరు ప్రాజెక్ట్లు మేలనంగ
స్వీయ విషయంబులందున చేసినారు
సడల కున్నట్టి యధికంపు శ్రద్ధతోడ.
కం.
"ఈమై, లింటర్నెట్టులు"
సామాన్యముగానె యౌర! సర్వజగత్తున్
సామీప్యమందె గాంచుట
నీమంబుగ జెప్పినారు నిర్మల బుద్ధిన్. 
కం. 
ఒకరోజున వైజాగున
సకలంబును చూచిరాగ సద్భావముతో
నకటా! ప్రాచార్యులు తా
మొకకొంత యనుజ్ఞ నివ్వ నుత్సాహముగాన్.
కం.
ఎదలో భక్తిని నింపుక
ముదమున సింహాచలేశు మ్రొక్కుట కొరకై
ఉదయమె సింహాద్రికరిగి
సదమల భావంబు తోడ చక్కగ నపుడున్.
తే.గీ.
సింహగిరినాథు ముందట శిరము వంచి
ప్రణతు లర్పించి పిమ్మట భక్తితోడ
అచట శ్రీవారి సాదంబు నారగించి
సింధు తటమున విహరించ చేరినాము.
తే.గీ.
సింధు తటమున కాసేపు సేదదీరి
యుద్ధ నౌకను దర్శించి యుత్సహించి
సుందరంబైన వనమున్న చోటి కేగి
వరుస నటపైన కైలాస గిరిని గాంచి.
కం.
అచ్చటి సౌందర్యంబే
ముచ్చట లను గొల్పుచుండు, మోక్షప్రదులౌ
సచ్చరితులు శివపార్వతు
లచ్చట గనుపింతురింక నద్భుతరీతిన్.
కం.
కొమ్మాది నవోదయమది
ముమ్మాటికి సుందరంబు మోక్షప్రదుడౌ
సమ్మానిత శాయీశుం
డమ్మనుజుల బ్రోచు నెప్పుడతివత్సలతన్.
కం. 
ఈవిధి కంప్యూటరుపయి
గావింవిన శిక్షణంబు ఘనముగ మాకున్
భావిని సద్బోధనలో
భావావేశంబు బెంచ బహుయోగ్యంబౌ.  


జ.న.వి. మెదక్ నుండి పాబ్రా-హర్యానాకు వచ్చిన విద్యార్థుల నుద్దేశించి 
తరగతి గదిలో (సరదాగా) ఆశువుగా చెప్పిన పద్యములు
తే.గీ.
శ్రీనివాసుడు, విజయుండు చెప్పనింక
సాగరాఖ్యుడు, జాకీరు, శ్యామచరణు
సాయి, యాకోబు, గోవిందు చక్కగాను
మరి సతీష్ప్రశాంతులు దినకరుడు పైన
తే.గీ.
నాగరాజు, నవీననురాగులంత
రమ్య, యశ్విని, యామిని సౌమ్య మరియు
మౌనిక, శిరీష, గౌతమి మానితముగ
వచ్చియుండిరి వర్గలు వారలిటకు.
ఆ.వె.
మెదకు పిల్లలార! సదమలబుద్ధితో
మెలగుచుండ మీకు మేలు గలుగు
వాదులాడవద్దు, పాబడా వారితో
కలసి మెలసి యుండి కనుడు సుఖము.
ఆ.వె.
పుణికి పుచుకొనుడు భోజనరీతిని
భవ్యమైన హింది భాష గనుడు
చక్కనైన వీరి సంస్కృతి నేర్వండి
యందమొప్ప మీరలహరహమ్ము.
ఆ.వె.
మన నవోదయంపు ఘనతను బెంచుచు
వినయవంతులౌచు ననయ మిచట
గురుల మనములందు కూర్మిని నింపుచు
మంచివారలౌచు మసలు కొనుడు. 
ఆ.వె.
ఆంధ్రదేశయశము నన్నింట బెంచుచు
తెలుగువారలన్న వెలుగువార
లనెడు సూక్తి మీదు యాచరణంబున
చూపి కాంచుడోయి శుభము లెందు. 

 ది.18.02.2007వ తేదీ   
12 వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సందర్భంగా 
వ్రాసిన పద్యములు.
ఆ.వె.
చదువు లెన్నొ చదివి సన్మార్గ వర్తులై
వివిధ యశము లంది, విత్తమంది
తల్లి దండ్రి కలల నెల్ల సత్యముజేసి
మనుడు ఛాత్రులార! ఘనత మీరు.
ఆ.వె.
సత్యవాచనంబు, సాంఘిక సేవయు
హృదయమందు నిల్పి ముదము తోడ
సాటివారి కింత సాయంబు నందించి
మనుడు ఛాత్రులార! ఘనత మీరు.
ఆ.వె.
మరల దుర్లభంబు మానవ జన్మంబు
నిర్మలాత్మతోడ నిత్య సేవ
జనకవరుల కట్లె జన్మభూమికి జేసి
మనుడు ఛాత్రులార! ఘనత మీరు.
ఆ.వె.
ఆదరించ బోకు డవినీతి పరులను
దుష్ట జనుల పట్ల దూరులగుచు
నిష్ఠతోడ నెపుడు నిస్స్వార్థ బుద్ధితో
మనుడు ఛాత్రులార! ఘనత మీరు.
ఆ.వె.
సత్త్వవృద్ధి మరియు సర్వత్ర విజయాలు
వివిధరకములైన విద్యలందు
సర్వకార్యములను సత్ఫలంబులు భావి
కనుడు ఛాత్రులార! ఘనత మీరు.  
జ.న.వి. వెన్నెల వలస, శ్రీకాకుళం.

చిత్తూరు జిల్లా "కుప్పం" ద్రావిడ విశ్వవిద్యాలయంలో 
"జవహర్ నవోదయ విద్యాలయాలలో" పనిచేస్తున్న 
తెలుగు భాషోపాధ్యాయులకు ది.21-9-2006 నుండి ది.30-9-2006 వరకు శిక్షణ నిర్వహించ బడినది. 
ఆ సందర్భంలో గుర్తుగా వ్రాసుకున్న పద్యములు.
కం.
శ్రీదంబై భక్తులకున్

మోదంబును గల్గజేసి మోక్షప్రదమై
మేదిని తిరుపతి పేరున
నే దివ్యక్షేత్ర ముండె నింపుగ నచటన్.  1.
తే.గీ.
కలదు చిత్తూరు జిల్లాకు ఘనత బెంచు
రమ్య సాహిత్య నిలయంబు ద్రావిడాఖ్య
విశ్వవిద్యాలయంబది విదితమగుచు
"కుప్ప"మనియెడు గ్రామాన మెప్పునంది.  2.
కం.
పర్వత తీరం బగుటను
సర్వంబును శిలలమయము సౌందర్యయుతం
బర్వాచీన వినిర్మిత
ముర్వీసతి కంఠహారమో యన చూడన్.  3.
తే.గీ.
ఏకవింశతి దినముల నేకగతుల
శిక్షణా కార్యమింపార చేయు కొరకు
ఘన(మన) "నవోదయసమితి" వారనుపమగతి
తెలుగు పండితు లందరఁ బిలిచినారు.  4.
కం.
అది సంస్తవ నీయం
బది తెల్గుల, కన్నడికుల నద్భుత రీతిన్
ముదమొప్పగ తమిళులతో
మది గూర్పగ జేసినట్టి మందిర మౌరా!  5.
తే.గీ.
బీ ప్రభాకరు గారలు విస్తృతముగ
శిక్షణంబీయ ముఖ్యులై చేరియుండ
సిద్ధగౌడార్యవర్యులు సిద్ధము గను
చేరి రనయము బోధన చేయు కొరకు.   6.
తే.గీ.
రామకృష్ణార్యులచ్చట రమ్యఫణితి
కోర్సు డైరెక్టరైయుండి కూర్మిమీర
చిద్విలాసము నిండంగ శిక్షణంబు
నిర్వహించుచు నుండిరి నియతముగను.   7.
సీ.
శిక్షణ కాలాన చేయించ నున్నట్టి
          ముఖ్యకృత్యంబులు మొదట దెల్పి
సమయసారిణి జూపి సానుకూలంబుగా
          స్పందించ వలెనంచు చక్క బలికి
వ్యాయామ యోగాల నారోగ్యవర్ధనం
          బందించు చుండిరి యనుదినంబు
భోజనాత్పూర్వంపు బోధనంబంతయు
          ఆంగ్ల భాషను జేసి యంతనింక
ఆ.వె.
నిత్యమాంధ్రమందు నిష్ణాతులైనట్టి
వారిచేత పలుకుబడుల విధము
చిత్రమైన రీతి చెప్పించు చుండిరి
తెలుగు భాషలోని వెలుగులన్ని.   8.
తే.గీ.
వేంకటేశ్వర వర్యుండు వినయశీలి
తెలుగు శాఖకు ముఖ్యుండు తేట బరిచె
అస్మదీయుల కారణ మాంధ్రమునకు
వర్తమానపు దు:స్థితి నార్తితోడ.   9.
సీ.
"ద్రవిడభాషలలోన ధరణి తెల్గునకున్న
          స్థానంబు బోధించె""సత్యవాణి"
"విశ్వనాథార్యుడు" విజ్ఞుడు చూపించె
          "లేఖన పద్ధతి" లిపికిఁ దాను
"రాజేశ్వరీదేవి" రమ్యంపు ఫణితిని
          "మాండలికంబుల మనుగడయును"
"ప్రామాణికత్వంబు భాషకేర్పడు రీతి"
          వివరించి చెప్పిరి వివిధ గతుల
ఆ.వె.
"సత్యవాణి"గారు నిత్యసంతోషిణి
"దాక్షిణాత్యమైన ద్రవిడ భాష
లందు నిలిచి యున్న అత్యంత సారూప్య"
మదియు తెల్పినారు ముదము నంద.   10.
సీ.
కర్నాట సాహితీ కమనీయ భావాలు
          "కవిరాజమార్గంపు కథ"ను దెల్పి,
తమిళసాహిత్యంపు దారుఢ్యతనుఁ జూపి
          "తొలికాప్పియమ్ము"ను తెలియ బరచి
మళయాళ సాహితీ మాధుర్యమును గూర్చి
          "లీలాఖ్యతిలకమ్ము" మేళవించి
తెలుగు భారతియొక్క తీరుతెన్నులు చూపి
          యందలి మాధుర్యమందజేసి
ఆ.వె.
"సత్యవాణి" గార లత్యుత్తమంబైన
"భక్తివాఙ్మయంపు పద్ధతులను"
ద్రవిడభాషలైన తమిళాదికములందు
తులన జేసినారు తెలుగు నపుడు.   11.
సీ.
"వాక్యనిర్మాణంపు వరుస"ను జూపించి
          "వివిధ సంబంధాలు" విశదబరచి
వాక్యాని కున్నట్టి "బాహ్యస్వరూపంబు,
          నాంతరంగిక రూప"మందజేసి
"నామబంధంబు"ను నీమంబుగా దెల్పి
         "క్రియల బంధంబుల" రీతి జూపి
"చక్కని పదముల సన్నిహితత్వంబు"
          "లవయవావయవుల"నందజేసి
తే.గీ.
అంత "నాధార మాధేయ" మనగ నేమొ
"అంతరానంత కేంద్రక"మనెడు దాని
తెలియ జెప్పిరి చతురత వెలయు నట్లు
ఘనత "రాజేశ్వరీ దేవి" గార లవుర!  12.
ఆ.వె.
"నవల" యనగ నేమొ, నవలాది యెప్పుడో
దాని లక్షణంబు ధర నదేమొ
వివరణంబు నిచ్చి విస్తృత బరచిరి
"సత్యవాణిగారు" చక్కగాను. 13.
ఆ.వె.
ఆది నాంగ్లమందు నారంభమౌటయు
తెలుగు లోన నవల వెలుగు టెల్ల
వరుస నాంధ్రమందు వైవిధ్యముండుట
విశద పరచె నామె విజ్ఞయనగ.   14.
ఆ.వె.
"విశ్వనాథవారి వేయి పడ్గల"జూపి
"ఏకవీర" దలచి యింతలోన
"అడవిబాపిరాజు" నంతట స్మరియించి
బోధ జేసినారు పూర్ణముగను.   15.
కం.
అటపైని కథానిక తా
నెటులుండునొ తెల్పినార లింపలరంగా
నిటనుండిన సత్కథలను
పటుతరమైనట్టిరీతి భాగ్యవశానన్.  16.
కం.
అనుపమవాచాచాతురి,
వినయాద్భుత సచ్చరిత్ర, విషయజ్ఞత, తా
ననుగుణ బోధన పద్ధతి
కనగానివి యామె సొంత మనదగును గదా!  17.
కం.
శ్రీవాణీగిరిజాదులు
పావనమౌ యశము నొసగి బహుసంపదలన్
జీవన మతి సుందరముగ
గావింతురు "సత్యవాణి" గారికి నెపుడున్.  18.
ఆ.వె.
"సత్యవాణి" గారు నిత్యసంతోషిణి
దాక్షిణాత్యమైన ద్రవిడభాష
లందు నిలిచియున్న యత్యంత సారూప్య
మదియు దెల్పినారు ముదము నంద.  19.
తే.గీ.
కవుల కాద్యుడు "నన్నయ్య" కథనశైలి
నాటకీయతఁ "దిక్కన" పోటు తనము
"ఎఱ్ఱనార్యుని" వర్ణన లింపుగాను
"పెద్దనా"ధీన మగుటకు పేర్మిమీర.  20.
కం.
పెక్కులు తార్కాణములను
మక్కువతోఁ జూపి యంత మైమరపించే
చక్కని చర్చాకృత్యము
లక్కట! చేయించి నార లద్భుత రీతిన్.   21.
సీ.
"శ్రీ విశ్వనాథుండు" చిద్విలాసంబుతో
          మధ్యాహ్న సమయాన మమ్ము జేరి
వ్రాతలో దోషాలు బాలుర కెరిగించి
          సరిదిద్ద వలయుట వరుసఁ జూపి
అక్షరలేఖనం బతిసుందరంబుగ
          కూడు టెట్లనుదానిఁ గూర్మితోడ
అహ్నత్రయంబున నతివిస్తృతంబుగ
          తెలియ జేసెను తాను తిరముగాను
తే.గీ.
పిదప స్వరముల త్రిభుజంపు వివరణంబు
మత్తకోకిల మొదలైన వృత్తములకు
లక్షణాదులు తెల్పుట శిక్షణమును
సఫలమొనరించుటే గదా! సర్వగతుల.   22.
కం.
శతకంబుల లక్షణములు
గతకాలమునందు గల్గు ఘనదశకంబుల్
శతకావిర్భావమునకు
శతశాతము హేతువగుట  సాక్ష్యంబులతోన్.  23.
ఆ.వె.
సత్యవాణిగారు చక్కగ వర్ణించి
మోదమంద క్రియల భేదములను
అనుపమంబనంగ తనదైన శైలిలో
నేర్పినార లచట  నేర్పు మీర.  24.
సీ.
"వేణుగోపాలుండు" విజ్ఞాన మందించె
          ఉపవాచకమ్ముల నోర్పుతోడ
బోధించవలె బాలమేధస్సులను బెంచు
          నట్లుగా నెల్లప్పు డంచు తాను
బహుపద్ధతులు చూపి బంధుర ప్రేమతో
          మంచి మాటలు నాల్గు మాటలాడి
ఏగిన పిమ్మట నేగు దెంచె నతండు
          "విశ్వనాథార్యుడు" వేగిరాన
తే.గీ.
భాష నేర్చుట లోనున్న భవ్యములగు
శ్రవణ భాషణ పఠనాల సరణులన్ని
వివరణాత్మక బోధన మవుర యనగ
చేసె నాతడు విజ్ఞుడు చిత్రముగను.  25.
సీ.
కౌశల్యమలరంగ ఘనముగా బోధించె
          బహువిషయములు "ప్రభాకరుండు"
"సిద్ధరామయగౌడ" చెప్పినాడెన్నియో
          సంతోషమును గొల్పు సంగతులను
"బాలసుబ్రహ్మణ్య" వర్యుండు దక్షుండు
          నవ్వించి, మురిపించి నైజములగు
బహువిషయమ్ములు బాగుగా దెల్పెను
          భారమన్పించక తోరముగను
తే.గీ.
ఘనుడు "దామోదరాఖ్యుండు" క్రమముగాను
మూడు భాషలవారికి ముఖ్యములగు
నూత్న విషయాల నింక వినూత్న ఫణితి
తెల్పినాడౌర! తానెంతొ ధీరుడనగ.   26.
ఆ.వె.
"పళనియప్పనార్య" ప్రాచార్య వర్యుండు
యోగమందజేసె బాగుగాను
"శ్రీరమేశు" డంత చెప్పి నాడెన్నియో
చక్కనైన యట్టి సంగతులను.  27.
కం.
అనుదినము మిత్రులందరు
వినయంబున ఛాత్రులట్లు విధిగా నచటన్
మనమలరించెడి కృత్యము
లనుపమ మగురీతి చేతు రనవరతంబున్.  28.
కం.
బోధించుట బహుసులభము
బోధించెడి వాటి నెపుడు బుద్ధిగ వినగా
సాధక బాధక మెంతో
మాధవ! యిదె తెలియవచ్చె మాకచ్చోటన్.  29.
ఆ.వె.
బాలురట్లు మేము ప్రార్థనా సభలోన
సతతమందమొప్ప ప్రతిన జేసి
సచ్చరిత్ర గల్గి సామూహికంబుగా
పాట లచట జేరి పాడినాము.   30.
ఆ.వె.
పలురకంబులైన ప్రశ్నపత్రంబులు
వాసి గొల్పునట్టి వ్యాస తతులు
నిత్యమందమైన కృత్యంబులెన్నియో
చేరి మిత్రులచట చేసినారు.   31.
ఆ.వె.
చిత్ర మౌర! సకల మిత్రవర్గంబుతో
సంగ మచట కూడె, సమితి వారి
నిర్ణయంబువలన, నిత్యమానందంబు
కలిగె  నందరకును  క్రమముగాను.  32.
ఆ.వె.
ఏది యెట్టులైన నిది యద్భుతంబైన
యనుభవంబుగాదె, అందరకును
మోదమిచ్చు"మా నవోదయంబున"కివ్వె
ధన్యవాదశతము లన్యమేల?  33.

ద్రావిడ విశ్వవిద్యాలయం(నాటి) వైస్ ఛాన్సలర్ 
శ్రీ లక్ష్మీనారాయణ గారి నుద్దేశిస్తూ 
వ్రాసిన పద్యములు
సీ.
ఎవ్వాని కృప చేత నిచ్చోట మనమంత
          శిక్షణార్థము నెమ్మి చేరినాము
ఎవ్వాని కారణంబీ శిక్షణంబందు
          బహువిధ విషయ సంపర్కమబ్బె
ఎవ్వాని పల్కులో నిహపరసంబంధి
          పలు విషయంబులు దెలియవచ్చె
ఎవ్వాని గళములో నింపు సొంపులనొల్కు
           నవరసంబులు చేరి నాట్యమాడు
తే.గీ.
ఔర! మూర్తీభవించిన శారదాంబ
యతడు ద్రావిడ భాషల కనుపమమగు
కీర్తి ప్రకటించు వాక్చక్రవర్తి గాదె!
లక్ష్మి నారాయణాఖ్యుడు లలిత గుణుడు. 1.
కం.
శ్రీలక్ష్మీ నారాయణు
శ్రీ లెప్పుడొసంగి బ్రోచు, చిన్మయుడగు నా
శ్రీలక్ష్మీ నారాయణు
డాలోకింపంగ యశము లమిత సుఖాలన్.  2.
తే.గీ.
అవుర! శారద మీరూప మంది నేడు
ద్రవిడ భాషల నిలయమౌ "ద్రావిడాఖ్య
విశ్వ విద్యాలయంబు"ను వెలుగ జేయ
నిచట కులపతిత్వంబందె యింపు లొలుక.  3.
తే.గీ.
ఏకవింశతి దినములనేక గతుల
శిక్షణాకార్య మింపార చేయు కొరకు
మమ్ము రప్పించి యత్యంత మధురముగను
ఆదరించిన మీప్రేమ యనుపమంబు.  4.
తే.గీ.
అనఘ! మీయాధిపత్యంబు నంది యుండ
వివిధ శాఖోపశాఖలై విస్తరిల్లి
విశ్వవిద్యాలయంబిది విమల యశము
లందు గావుత, ధర్మజ్ఞ! యెందు జూడ.  5.
కం.
మీ మాటలు మధురంబులు
మీ మనమతి కోమలంబు, మీ బోధనయున్
మామక హృదయాకర్షిత
మో మహనీయా! సుధీర! యున్నత చరితా!   6.

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి 
శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు గారి నుద్దేశిస్తూ 
వ్రాసిన పద్యములు(శ్లోకములు)
శ్రీవేంకటేశేతి శుభాభిధాన:
హసన్ముఖ: పూర్ణసుధాకరాభ:
బూదాటి వంశాఖ్యసుధాసముద్రే
సంజాత ఏక స్సుగుణాలవాల:||  1.

విశ్వవిద్యాలయే తస్మిన్
ద్రావిడాఖ్యే మహావనే
ఆంధ్రశాఖాధిపత్వేన
రాజతే౮యం గుణాన్విత:||  2.

సంఫుల్ల మందార మరందతుల్యా
మాధుర్యతాపూర్ణ సుదీప్త వాచ:,
గంభీరవిస్తార సుబోధనం చ
నాన్యస్య సాధ్యా ఖలు వేంకటేశ!  3.

విశేష విజ్ఞాన విచారధారా
దత్తా త్వయా లాభకరీ సురమ్యా
నమాంసి భూయాంసి వినమ్ర శీలిన్
స్మరంతి సర్వే భవత: ప్రపాఠమ్||  4.

గద్యం చ పద్యం చ కథాదికం చ
నవీన భావాభ్యుదయం చ యేన
విస్తారరూపేణ ప్రబోధితం తం
శ్రీవేంకటేశార్య మహం నమామి||  5.

ఆ.వె.
వేంకటేశ్వరార్య! విజ్ఞాన సంపన్న!
సాధు హృదయ! వినయసచ్చరిత్ర!
అమలమగుచు వెలయు ననుపమ సత్కీర్తి
యబ్బవలయు మీకు ననవరతము. 6.

శిక్షణ మధ్యలో కొన్ని విషయాలు బోధించిన 
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ 
శ్రీ శ్రీనివాసరెడ్డి గారి నుద్దేశించి 
వ్రాసిన పద్యములు
 ఆ.వె.
శ్రీనివాసవర్య! మానిత చారిత్ర!
అరటి పండు నొలిచి యందజేయు
విధము మీరు చేయు విస్తృత బోధనం
బకట! ధీవరేణ్య! యనుపమంబు.  1.
ఆ.వె.
చదివి యుందురేని సకల శాస్త్రంబులన్
నిత్యమెన్నొ శ్రుతులు నేర్తురేని
ఏరి కబ్బగలదు యిటువంటి మధురిమ
శ్రీనివాసవర్య! చెప్పుడార్య!  2.
ఆ.వె.
గతము నందు నున్న ఘనమైన మంచిని
స్వాగతించుడంచు చక్కగాను
ఆధునికములోని అందాలు చూపించు
సుందరాంగ మీకు వందనంబు.   3.
కోర్సు నిర్వాహక వర్గంలో వారగు 
శ్రీ బాలసుబ్రహ్మణ్యం, ప్రాచార్యులు, జ.న.వి,. కాసర్ గోడ్ 
మరియు 
శ్రీ దామోదరరెడ్డి, ప్రాచార్యులు, జ.న.వి., రంగారెడ్డి ల 
నుద్దేశిస్తూ
శ్రీసుబ్రహ్మణ్యాఖ్య సుధీవరిష్ఠం
సదాహసన్తం విషయజ్ఞ మేనం
బ్రహ్మాచ్యుతేశాన సమస్త దేవా:
రక్షన్తు దత్వాత్ర సుఖం, సుకీర్తి:||  1.

ధీమన్త మత్యద్భుత బోధనాఢ్యం
ధీరం చ గంభీర గుణాన్వితం చ
ప్రాచార్య రూపేణ విరాజమానం
శ్రీబాల బ్రహ్మణ్య మహం నమామి||  2.

దామోదర వర్యాఖ్యుని
దామోదరు డెల్ల వేళ దయతో బ్రోచున్
మామక హృదయాకర్షితుఁ
గామితములు దీర్చుచుండి ఘనముగ నెపుడున్.  3.

చివరిగా కొన్ని సరదా పద్యాలు - అక్కడి సాధక బాధకాల గురించి 
(సరదాగా మాత్రమే)
కం.
పేరుకు తెల్గుల శిక్షణ
వారేమో యాంగ్లమందు  వచియింతురహో
యేరీతి యర్థమౌనట?
హేరామా! చూడవయ్య! యీ యన్యాయం.  1.
కం.
చెప్పెడి పాఠాలన్నియు
గొప్పవి, సందేహ మేల? కూర్మిగ వారల్
చెప్పుచునుండిరి కానీ
తిప్పలవాంగ్లంబు తోడ తీరక పోయెన్. 2.
కం.
"టీ" లో రుచిలేదాయెను
పాలల్లో నీటిపాలు బహ్వధికంబై
మూలంబౌ టీచూర్ణము
లాలితముగ తక్కువాయె ద్రావిడశాలన్. 3.
కం.
రెండే టేబుళ్ళున్నవి
తిండికి చూడంగ నేమొ తెల్గులు, తమిళుల్,
మెండుగ కన్నడ వారలు
నిండంగా నెట్లు తినుట నిత్యం బచటన్.  4.
కం.
సాంబారే పప్పాయెను
సాంబారే కూర తరచు చట్నీ గూడన్
సాంబారే సర్వస్వము
సాంబారును వీడి యచట శాకము శూన్యం.  5.
కం.
తక్రము రూపము మార్చెను
వక్రత్వము నందుచుండె వాసన తోడన్
చక్రాయుధ! శ్రీకృష్ణా!
సక్రమతే లేకపోయె సాపాటునకున్.  6.
కం.
అరకప్పు "చాయి" కోసం
బరగంట కనీసమైన నతిసహనముతో
వరుసన్నిలబడవలసిన
సరణిని వర్ణించదరమె సాధు చరిత్రా!  7.

జ.న.వి. పాబ్డా, నుండి వీడ్కోలు సందర్భంగా

పంచ వర్షాణి పాబ్డాయాం
లబ్ధం చ స్నేహ మద్భుతమ్
కథం వా విస్మరిష్యామి
సర్వా నాత్మీయ బాంధవాన్.


స్మృతిచిహ్నం చోన్నతేభ్య:
దాతుం శక్తిర్నవిద్యతే
సర్వాన్ జ్యేష్ఠాంశ్చ, మిత్రాంశ్చ
నమస్తస్మాత్కరోమ్యహమ్.

భవతాం దివ్యసల్లాపే
ఏకవారం స్మరంతు మాం
సుహృదానాం శుభాకాంక్షా:
సుఖసంతోషదాయిన:

మిత్రం చ సోదరం మత్వా
క్షమ్యతాం మాం సుహృజ్జనా:
జ్ఞానాజ్ఞానేన యత్కించిత్
కష్టం దత్తం మయా యది

శ్రీద: సర్వేశ్వరో దేవ:
కరుణాభరితాత్మక:
పాబ్డా నవోదయే నిత్యం
దద్యాత్ విద్యాం చ వైభవమ్



















 







No comments:

Post a Comment