Monday 18 April 2022

శ్రీనాథుడు

 

శ్రీనాథుడు

శా.

శ్రీనాథుండను నేనటంచు కవనశ్రీమంతు డైయొప్పుచున్

దా నిందున్ గవితాసుమాన్విత మహత్కల్యాణభావోల్లసత్

జ్ఞానైశ్వర్యవిధాయకక్షితిజముల్  సర్వోపయోగ్యంబులై

యానందంబును గూర్చురీతి నిలిపెన్ హర్షైకచిత్తంబునన్.   1.

సీ.

చిన్నారి వయసులో శ్రేయస్కరానేక

          కావ్యముల్ రచియించి గణుతి కెక్కె

కుకవిత్వ భావంబు కువలయంబున నిండ

          బర్యటించుచు దాని భంగపరచె

శాస్త్రచర్చలలోన సర్వాధికత్వంబు

          నందుచు దానందె వందనములు

బహురాజదర్శనం బహరహంబును జేసి

          సన్మానములు గాంచె సర్వగతుల.

తే.గీ.

తెలుగులోనైన గీర్వాణకలితమైన

పలుకులోనైన కవనంబు లలఘుగతిని

మేటియై చెప్పగలను కర్నాటభాష

గాగ యని పల్కె శ్రీనాథ కవివరుండు.                             2.

మ.

కవిలోకంబున “సార్వభౌము”డగుచున్ ఖ్యాతిన్ గనెన్ సారవ

ద్వివిధానేకసుకావ్యసద్రచనచే విస్తారరూపంబునన్

నవదీప్తిన్ బ్రసరింపజేయు రవియై నైజప్రభావమ్ముతో  

నవనిన్వెల్గెను సత్కవీశ్వరుడు తా నందింతు గైమోడ్పులన్.    3. 

సీ.

దాహార్తిచే గుంది “త్ర్యంబకా! నీకేల

          తరుణులి ద్దరటంచు” నురుము వాడు

“జొన్నన్నపున్ ముద్ద వెన్నుడా! తిని నీదు

          పస జూప రమ్మంచు” బలుకువాడు

“తెమ్మురా కస్తూరి తెల్గురాజా” యంచు

          బహుదర్పమున గోర వచ్చు వాడు

“రసికు డొక్కడు పోవ డెసగ బల్నా” డంచు

          నలఘుకష్టము తోడ దలచువాడు

తే.గీ.

తనను బోషించి నిచ్చలు ఘనత గూర్చు

వారి నవసాన దశయందు బహుళగతుల  

దలచి సురగురు డతిభీతి గలత చెంద

నరుగు చుంటిని దివికని యన్నవాడు.                             4.

సీ.

కాశీకాఖండాది కావ్యరాజంబులన్

          విరచించి సద్యశం బరయువాని,

కనకాభిషేకంబు ఘనతరంబుగ నాడు

          ముత్యాలశాలలో పొందువాని,

తాను కోరిన రీతి దానంబు లెన్నియో

          ప్రభువుల మెప్పించి పడయువాని,

విద్యాధికారియై విస్తృత సమ్మాన

          మలనాడు సర్వత్ర నందువాని

తే.గీ.

తెలుగువారల భాగ్యాన నిలను కవిగ

యవతరించిన సత్కవి ననుపము ఘను

ధీమతిని సర్వ కవిసార్వ భౌము దలతు

వందనీయుని శ్రీనాథ భట్ట కవిని.                                 5.

 

హ.వేం. స. నా. మూర్తి.

12.06.2021.

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment