Monday 18 April 2022

శ్రీముక్తీశ్వర స్తుతి

 

శా.

శ్రీముక్తీశ్వర! లోకనాయక! ప్రభూ! చిద్రూప! గౌరీపతీ!

ప్రేమస్వాంత! పురారి! భక్తవరదా! విశ్వేశ్వరా! శ్రీకరా!

యీముక్త్యాల పురాన రక్షకుడవై యింపారు రూపమ్ముతో

స్వామీ! వాసముచేయు నిన్ను గొలుతున్ సద్భావనాదీప్తికై.                                  1.

మ.

బలి యానాడు త్వదీయభక్తతతులన్ భవ్యానురాగమ్ముతో

నిలలో గావగ గోర, వల్లెయని నీ విచ్చోట ముక్త్యాలలో

సలిలంబందున లింగరూపమున నైశ్వర్యాది సౌఖ్యప్రదా!

లలి ముక్తీశ్వర! నిల్చినాడవు నతు ల్దాక్షిణ్యభావోజ్జ్వలా!                                      2.

మ.

జలమందుండి కృపాకటాక్షవిలసత్సౌఖ్యప్రసారంబు లీ

స్థలమందున్ బ్రసరింపజేసెడి శివా! సర్వజ్ఞ! ముక్తీశ్వరా!

యలనాడా రఘురాముడున్ శుభగుణైకాకారు డౌ ధర్మజుం

డలికాక్షా! నిను మోక్షదున్ గొలిచి రత్యానంద సంయుక్తులై.                                   3.

శా.

ఈముక్త్యాలయు, గృష్ణ, యిచ్చటిజనుల్  హేవిశ్వనాథా! మహత్

క్షేమప్రాపక! నీదుసంగతిని సచ్ఛ్రేయంబు లేవేళ నీ

భూమిన్ బొందెద రయ్య, నన్ను  నటులే పూర్ణానురాగాన శ్రీ

రామారాధిత పాదపద్మ యుగళా! రక్షించు ముక్తీశ్వరా!                                       4.

 

No comments:

Post a Comment