Monday 18 April 2022

గురువందనము

 

శ్రీ శంకర సంస్కృత కళాశాల, రేపల్లె

గురువందనము

శా.

"శ్రీమచ్ఛంకరసంస్కృతా"ఖ్యమున రాశీభూత సద్విద్యతో

బ్రేమాప్యాయత లందజేయు స్థలియై "రేపల్లె"లో శోభిలెన్

నామౌన్నత్యము గాంచి పంచెను గదా నానావిధజ్ఞాన మీ

శ్రీమంతంబగు సత్కళానిలయమున్ జేజేలతో మ్రొక్కెదన్.                       1.

శా.

శ్రీలందంగల సత్వయుక్తి, సుమహచ్ఛ్రేయోమయస్ఫూర్తి,

చ్ఛీలప్రాపకభావదీప్తి, మమతాశ్రీప్రాప్తి, ధీశక్తి యే

బాలల్ జేరిన వారికిందు విలసద్భవ్యానురాగమ్ముతో

వాలాయమ్ముగ గూర్చె యీస్థలము సద్భక్తిన్ ప్రశంసించెదన్.           2.

శా.

ఈ విద్యాలయ మంద జేసినది నాకెన్నేని సామర్ధ్యముల్

భావస్వాస్థ్యము, జ్ఞానసంపదయు, సద్వాక్యస్థిరత్వంబు నే

నేవేళన్ స్మరియించు చుండెదను నన్నీరీతిగా జేయు నీ

దేవస్థానము నెందునున్నను  మదిన్ దీప్తిప్రదన్, శ్రీనిధిన్.                           3.

మ.

ఇది దేవాలయ మిందు వత్సలత తా మింపార జూపించి రా

సదయుల్ సద్గురుసత్తముల్, సుఖదసంస్కారప్రభావార్ద్ర స

త్పదమున్ బొందగ నొప్పు విద్యలను చేతం బుబ్బగా బంచు ధీ

ప్రదులవ్వారికి మ్రొక్కెదన్ వినయసంభారంబు దీపిల్లగన్.                          4. 

 

 

 

::2::

ఉ.

శ్రీయుతునిన్ మహామహుని జిన్మయరూపము దాల్చి నిత్య మా

ప్యాయతతోడ శిష్యులకు భవ్యయశంబులు గూర్చు విద్యలన్

స్వీయసుతాళి యన్బగిది జేర్చుచు నేర్పిన "ముళ్ళపూడి నా

రాయణశాస్త్రి"సద్గురుని బ్రాజ్ఞుని భక్తి దలంచి మ్రొక్కెదన్.                         5.

తే.గీ.

"ముళ్ళపూడ్యన్వయంబున" ముఖ్యుడైన

విజ్ఞసత్తము గొలిచెద విమలమతిని

ఛాత్రతతులకు విద్యలన్ సన్నుతముగ

గరపు "రామసుబ్రహ్మణ్య"గురుని నేడు.                                                  6.

శా.

శ్రీమంతంబగు హర్షసంతతి నిలన్ జేకూర్చు సద్విద్యలన్

బ్రేమన్ బంచుచు మార్గదర్శకునిగా వెల్గొందు పాండిత్య స

ద్ధామున్ గొల్చెద "ముళ్ళపూడిజయసీతారామశాస్త్ర్యార్యునిన్"

క్షేమాకారుని మద్గురూత్తముని రాశీభూతసౌజన్యునిన్.                                 7.

ఆ.వె.

"కలువకొలను"వంశ్యు నలఘుని "శివరామ

శర్మ"వర్యు గురుని సన్నుతింతు 

వేదశాస్త్ర నిపుణు విజ్ఞాన దీపితున్

నతు లొనర్చి యిపుడు నమ్రత నిట.                                                       8.

ఆ.వె.

"మద్దిపట్ల" వంశ్యు మాన్యు "సుబ్రహ్మణ్య

శర్మ”గురుని దలతు జయ మటంచు

ప్రణతి శతము లిచట భక్తితో నర్పించి

వినయశీలి నగుచు మనమునందు.                                                          9. 

 

 

::3::

కం.

"కొండా" వంశజు గురువరు

మెండగు నుత్సాహ మొదవ మేలగు విద్యన్

నిండు మనంబున గరపుచు

నుండిన "సుబ్రాయవర్యు"సుజను నుతింతున్.                                       10.

తే.గీ.

"గొర్తి నాగేశ్వ రాఖ్య"తో గూర్మి జూపి

సతము చారిత్రకాంశాలు  చతురగతిని

నేర్పి యున్నట్టి యాచార్యు నిపుణమతిని

"శాస్త్రి" వర్యుని వినుతింతు సంతసమున.                                               11.

ఆ.వె.

ఆంగ్ల భాష నేర్పి యత్యనురాగంబు

చూపి యుండినట్టి శుద్ధమతిని

పరమ హర్ష యుతుని "భాస్కరరాయార్యు"

దలచువాడ నిట్టి తరుణమందు.                                                              12.

 

హరి వేంకట సత్యనారాయణ మూర్తి

శిష్యపరమాణువు

 

 

No comments:

Post a Comment