Monday 18 April 2022

అంతర్జాలము

 

అంతర్జాలము

శార్దూలములు

అంతర్జాలమహత్వసత్వ మిదియం చాడంగ శక్యంబె తా

నెంతో సంతస మందజేయును సతం బింపార లోకమ్మునన్

జింతామగ్నులపాలి దైవముగతిన్ శీఘ్రప్రభావమ్మునన్

జెంతన్ జేరును తృప్తిగూర్చును గదా సేవైకచిత్తంబునన్.                      1.

 

వ్వా రెట్టులు పృచ్ఛసేయ నటులే యింపార స్పందించుచున్

వ్వెంతైన గణించబోక త్వరగా తత్ కాంక్షితోదంతముల్

చివ్వం బంపెడి సచ్ఛరంబు పగిదిన్ చెన్నొందగా నందుచున్

రవ్వంతైనను గుందకుండ దెలుపున్ బ్రహ్లాదమున్ బంచుచున్.             2. 

 

అంతర్జాలము కామధేనువనినన్ హాస్యంబు గాబోవ దా

శాంతంబుల్ గనవచ్చు గాని యిట నాయారంభమే సత్య మే

చెంతన్ బూనియు నంత మిచ్చటనుచున్ జెప్పంగ సాధ్యంబు గా

దింతింతై వటుడంతయైన గతి దా నింపార సాగున్ గదా.                      3.

 

బాలల్, వృద్ధులు, స్త్రీసమూహము లిటన్ ల్రీతులన్ జేరి య

ర్థాలన్ గాంతురు విద్యలున్, స్థితిగతుల్, ప్రజ్ఞల్ ప్రదర్శించుటల్

వాలాయంబుగ బోధనల్, పఠనముల్ వ్యాపారకార్యంబులున్

మేలౌ చర్చలు సర్వ మిందగుగదా మిన్నంట హర్షం బిటన్.                  4.

 

నీవే మానవ! దీనిసృష్టి యిచటన్ నిష్ఠాగరిష్ఠుండవై

భావౌన్నత్యము జూపి చేసితి వికన్ బాగౌను జాగ్రత్తతో

ధీవైదుష్యము దాల్చి దీనిని గొనన్ దీపిల్లు దేహంబు కా

దో విస్తారముగా ప్రమాద మగు నీయుర్విన్ గనన్ నిచ్చలున్.                        5.

No comments:

Post a Comment