Monday 18 April 2022

బమ్మెరపోతన

 

బమ్మెరపోతన

 

శా.

శ్రీమద్భాగవతాఖ్యకల్పతరువున్ శ్రేయంబు లెల్లప్పుడీ

భూమిన్ బంచగ నాటినట్టి ఘనుడై, పూర్ణాచ్ఛసత్కీర్తు లా

శ్రీమన్మాధవసత్కృపాగరిమచే జేకొన్న పోతన్ననున్

ధీమంతున్ గవికోటివంద్యుని మహత్తేజోమయున్ మ్రొక్కెదన్.              1.

తే.గీ.

సహజపాండిత్యపటిమతో సన్నుతముగ

గావ్యరచనను జేసిన కవి యతండు

తెలుగువారల కారాధ్యు డలఘు డగుచు

వెలిగి యున్నట్టి పోతన్న విమలయశుడు.                                         2.

చం.

సురుచిరభక్తితత్వముల శోభల నంతట స్వీయకావ్యమం

దరయగ జూపి, పాఠకుల కద్భుతరీతిని దన్మయత్వమున్

వరలగ జేసి, భక్తగణభాగ్యము హెచ్చగజేయు  పోతనన్

బరమమహత్వ దీపితుని భాగవతోత్తము బ్రస్తుతించెదన్.                      3.

సీ.

రాగాంతరంగుడై “భోగినీ దండకం”

          బను కృతి నొనరించె నతడు నాడు

“వీరభద్రుని భవ్య విజయగాథ”ను బల్కి

          విస్తృతయశుడౌచు వెలిగె నతడు

మందారమకరంద మాధుర్యతుల్యమౌ

          భక్తిభావము నింపి భాగవతము

రచియించి యఖిలాంధ్ర రమ్యప్రదేశాన

          నభిమానకవి యయ్యె నతడు సతము

“నారాయణనునిగొల్వ తీరైన శతకమ్ము”

          వ్రాసి యీ యిలలోన వాసిగాంచె

తే.గీ.

పండితాళికి జనపదపామరులకు

నమృతనిభమైన సాహిత్య మందజేయు

ఘనుడు పోతన్న యతులిత వినయభరితు

డస్మదీయుడు కవివరు డనఘు డతడు.                                            4.

ఉ.

నేనొనరించు కావ్యమును నిక్కముగా "విను, పొట్టకూటికై

మానవనాథకోటికి నమానుషమౌ గతి నమ్మబోను, నీ

కేనొక కీడు చేయ"నని యెంతయు భక్తిని జూపి భారతిన్

జ్ఞానద నూరడించు కవి చంద్రుడు పోతన, యంజలించెదన్.                5.

చం.

పలుకగనైనయట్టి దిట భాగవతం బట, నాముఖంబునన్

బలుకగ జేయువా డిక నపారకృపామతి రాముడంట, నే

బలికిన మోక్ష మబ్బునట, పల్కెద నంచు రచింప బూను నీ

యలఘుని పోతనార్యకవి నాయతనమ్రత బ్రస్తుతించెదన్.                    6.

మ.

తనకోసం బిట నన్నయాదిసుకవుల్ తథ్యంబుగా జూడ నీ

ఘనమౌ భాగవతంబునున్ గొనరుపో కాంక్షించి యాంధ్రమ్మునన్

మును వ్రాయంగను, పూర్వజన్మకృతమౌ పుణ్యంబు నాకబ్బె నం

చను పోతన్నను భక్తిభావభరితున్ హర్షాత్మునిన్ మెచ్చెదన్.                  7.

చం.

పరవశ మందజేయు గద భాగవతస్థములైన పద్యముల్

హరి నిట విశ్వభారకుని నక్షులముందర నిల్పుచుండి, సు

స్థిరమగు భక్తిభావమును, జిన్మయతన్ గలిగించుచుండి యీ

నరులకు హర్షసంపద మనంబున జేర్చుచునుండు నిచ్చలున్.               8.

ఉ.

తొమ్మిది భక్తిమార్గములతోడను దేవుని జేరు పద్ధతుల్

కమ్మని మాధురీమహిమ కైతలయందున రంగరించి తా

నిమ్మహి కందజేసె, ఘను డీతడు సత్యము బల్కుచుంటి నీ

బమ్మెర పోతనార్యకవిఁ బావన మూర్తిని బ్రస్తుతించెదన్.                       9.

 

 

హ.వేం.స.నా.మూర్తి. 

06.06.2021.

No comments:

Post a Comment