Tuesday 31 March 2020

సమస్యాపూరణం-14


పౌరుల్ సజ్జను లోకబాంధవు హితున్ ప్రజ్ఞాన్వితుండైన సం
స్కారింజూచి వచించుచుండి రిటులన్ సత్యంబు దుర్మార్గులౌ
వారీవ్యక్తికి నేరముం బులిమి రా వైకుంఠునిన్ గొల్చుటన్
గారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే.                                  1251.

తాపసవేషధారియయి తాను మహాత్ముడనంచు జిత్రముల్
జూపెడివాని నైజమును జూచినవా డిటు లాడుచుండె యీ
పాపిని జేరబోవలదు వంచకు డీతడు నమ్ము డంతటన్
బాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్.                          1252.

అలఘుస్వచ్ఛమనంబుతోడ ఫల మాకాంక్షించి యన్యంబులౌ
తలపుల్ సేయక లక్ష్యగామి యగుచున్ ధైర్యంబుతో విఘ్నముల్
కలుగన్ గుందక వాంఛితార్థముల సాక్షాత్కార మైనట్లుగా
కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే.                                    1253.

ఘనతరమైనసభ్యత సుఖప్రదభావము సాధుశీలముల్
మనుజుని చిత్తమున్ వదలె మానుషధర్మము లంతరించుచున్
ధనమె ప్రధానమైన దిది తప్పని దీగతి సాగుచుండినన్
జనహననైకతత్పరుఁడె సజ్జనుఁడై యశమందు నిద్ధరన్"                                1254.

మునువచియించె నిందు మునిముఖ్యుడు బ్రహ్మము భావికాలమం
దనయము సాగుచుండ గల వాసురకృత్యము లంతరించు నా
ఘనతరధర్మవర్తన మఘంబు బలంబును జూపుచుండగా
జనహనైకతత్పరుడె సజ్జనుడై యశమందు నిద్ధరన్.                                     1255.

స్తవనీయంబగురీతి చిత్తపటలిన్ సంధించగాలేక
చ్ఛివముల్ లోకమునందు గూడుటకునై శ్రేష్ఠప్రయత్నమ్ము లీ
యవనిన్ జేయగలేక స్వార్థమతివై యార్భాటముం జూపి మా
నవ! దీపమ్ము లవేలకో గృహవితానమ్మందు నీవేళలో.                               1256.

పంకజనేత్ర సత్యయను భామ సురారిని దుష్టవర్తనున్
సంకటనాశనా! వినుము చంపెద నేననుచుండ నామెతో
బంకజనాభు డాతరిని వల్లె యటంచును దైత్యభాగ్యలే
శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై"                                       1257.

నేదంపూర్వవిధాన దుష్టమతులై నిత్యమ్ము సన్మార్గులన్
వేదారాధ్యుల దూరుచుండి ఖలతావేశమ్ముతో దీనులన్
మోదం బందుచు ఖేదసాగరమునన్ ముంచంగ యత్నించుచున్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా.                                1258.
గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"
మన కవిమిత్రుల ఇంటిపేర్లైన
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
తే.గీ.
భటులు (గుఱ్ఱం)బునకు (మైలవరపు)సీమ
బాగు (గుండా) నొకయింత యాగు టొప్పు
నలఘుఖాద్యంబు దొరకు(రా వెల)యు సుంత
యనిరి ధర్మజు యజ్ఞాశ్వ మనుసరించి.

నీమమొకింత లేదిచట నిక్కముగా యుగధర్మ మౌటచే
స్వామిని నేను చూడుడని వస్త్రము గట్టిన మాత్ర మీభువిన్
కామము చావనట్టి ఖలకర్ముడు వంచకుడై చరించు నా
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా.                                       1259.

వార్తలలోని కెక్కె నిది వాస్తవ మొక్కగృహంబునందు దీ
నార్తుల బ్రోచు దైవముల నాగక దిట్టుచు నాస్తికత్వమున్
ధూర్తత నందియున్న యొకదుష్ట యనెన్ దనవారి కీగతిన్
కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్"                                        1260.

తలపున నిర్మలత్వమును దన్మయ మెల్లసుకర్మలందునన్
బలుకులలోన మార్దవము పావనవర్తన మన్నిజీవులం
దలఘుదయాస్వభావ మిట నంది చరించుచునున్నవారికిన్
గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్"                         1261.

నూతనమైన మార్గముల నొవ్వగ జేయుచు నమ్మకంబులన్
బాతరబెట్టుచున్ నిధు లపారముగా దమ కుక్షిలోనికిన్
బైతృకమంచు నెంచుగతి బంపు స్వభావము గల్గువారలౌ
నేతల నమ్మ భాగ్యము లనేకము దక్కును శ్రామికాళికిన్!                                      1262.

(
నేతలను+అమ్మ)

ఎల్లవిధాల సర్వులకు నింపొనరించెడి శబ్దజాలమున్
ఫుల్లసరోజతుల్యమగు పూర్ణతరాచ్ఛశుభాంతరంగమున్
కల్లకు బోని వర్తనమకారణవైరము లూనకుండుటల్
పిల్లల వద్ద నేర్చుకొని పెద్దల బుద్ధుల మార్చ మేలగున్!                                1263.

తల్లి తండ్రి యతిథి తథ్యమ్ము దైవముల్
గురుడు బ్రహ్మ విష్ణు డరయ శివుడు
సత్య మతడు భువిని సర్వోన్నతుండంచు
పలుకు బడుల వెలుగు భారతమ్మ !                                                               1264.

కోరిక జీవనంబునను గూరిమి నింపుచునుండు సత్వముల్
కోరిక కూర్చు దేహికిని కుంభినిలోన జయంబు లెల్లెడన్
గోరిక యందజేయు సమకూర్చును భాగ్యము లీవిధిన్ గనన్
గోరిక లేవి లేక సమకూరును సౌఖ్యము మానవాళికిన్?                                 1265.

స్వామినంచు జేరి సన్యాసి రూపాన
కపటి యౌచు దిరుగు ఖలుని చెరను
సత్య మెరుగలేక సర్వార్థములతోడ
చిక్కినమ్మను గన చింత హెచ్చె !                                                                  1266.

పలురీతుల వ్యతిరేకపు
పలుకులు సత మాడువనిత పలికెను పతికిన్
వలదన్నను నిలు వెడలుచు
పిలవని పేరంటమునకు వెళ్ళ శుభమగున్!                                                        1267.

క్షుత్తు నరయకుండ చిత్తమ్ము దోచంగ
జేరి యెదుటనున్నవారి నోట
తినుడు తినుడటంచు ననుచితమౌరీతి
గూర దిన్నవారి కోర్కె చచ్చు.                                                            1268.

నారి యొకతె దాల్చె నవరత్నహారమ్ము
కాంచ దానిలోన కనకమునకు
స్థాన మధికమయ్యె సత్యమ్ము హితులార!
యాకు చాటు పిందె లయ్యె మణులు.                                                    1269.

కారుణ్యమూర్తియగు కైటభదైత్యవైరిన్
నారాయణా! యనుచు నమ్ముచు సంతతమ్మున్
జేరంగ భూమిపయి చిత్సుఖ మబ్బుచుండున్
నూరేళ్ళ జీవనము నోములపంట యౌగా                                                         1270

 దేహబలము చేత దీపిల్లబో డిందు
బుద్దిలేని నరుడు పుడమిలోన
భంగపడుట నిజము పలుమాట లికయేల
అబల చేత నోడు నతిబలుడును !                                                                  1271.

అన్నా! వింటివె బ్రాహ్మణబ్రువు డొకం డాడెన్ ముహూర్తంబులం
దెన్నంగల్గిన జ్ఞానముం గొనక తా నెప్డేని పంచాంగమున్
గన్నున్నిల్పుచు జూడకుండ నపు డక్కల్యాణికిన్ శుంఠయై
యన్నప్రాశనమాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్.                                       1272.
ఆసంద్రమ్మును ద్రచ్చువేళ నటకున్ హర్షంబునన్ జేరరే
దాసానుగ్రహసాగరుల్ హరిహరుల్ తద్భూమి నవ్వారికిన్
వేసంబయ్యెను భాగ్యకారకమహో వేయేల నిక్కమ్ముగా
వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే.                               1273.
కవిమిత్రులారా,
'సు - ప్ర - భా - తం'
పై అక్షరాలతో వరుసగా నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
(సు)మధురానందభాగ్యమ్ము చొప్పుమీర
(
ప్ర)తిదినమ్మును భువిపైన బంచగోరి
(
భా)ను డేతెంచు జగతికి బంధుడగుచు
(
తం)బి! మ్రొక్కంగ రావోయి తన్మయమున.

(సు)దృఢమైనట్టి ధైర్యమ్ము నెదలలోన
(
ప్ర)స్ఫుటింపగ జేయుటే పనిగ గొనుచు
(
భా)సురంబైన రూపాన బ్రాచి నదిగొ
(
తం)డ్రి యౌచును విచ్చేసె తరణి కనుడు.
నరకసమాన మాపురము నమ్ముడు రాజయి దానికొక్కడున్
నిరత మనంతదుఃఖములు నిల్పుచు పౌరుల జీవనంబునన్
చెరచుచునుండ సౌఖ్యములు, చేకొన దౌష్ట్యము జూపి సంపదల్ 
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.                                                1274.

సురుచిరమైనరీతి నట శోభిలుచుండును కౌస్తుభంబు తా
నురమున, ఫాలభాగమున నొప్పును కస్తురి, నాసికాగ్రమం
దరయగ మౌక్తికం, బొడలినంతట చందన మట్లె కంససం
హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"                                  1275

సతతానందదసత్కవిత్వరచనా సత్కార్యయత్నస్థితా
యతభావాఢ్యకవీంద్రసంఘమునకీ యజ్ఞంబునందిందు
న్నుతసామాజికవస్తుజాలముపయిన్ నూత్నంబుగా వెల్గు
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.                                  1276

లలనామణి పర్వంబున
పలు వంటలు చేసి యుంచె వానిం గొనగా
తలపడిన మగని ముఖమున
చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్                                                                    1277

మగడొకనాడు మేలమున మానినిపై సరసోక్తు లెన్నియున్
దగునని వైచుచున్ కుసుమ తాడనమున్ బొనరించుచుండ దా
నగణితమైన ప్రేమమున నాయమ భక్ష్యము లందిత్రోయగా
తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.                                        1278

వడ=గారె.

నిజమిది సత్కవిత్వ మనునిత్యము సంఘహితమ్ము గోరుచున్
విజయము గూర్చుచుండవలె విజ్ఞత జూపుచు నట్లుగానిచో
సుజనశిఖామణుల్!రచన శోభిల దీయుగ మందటంచు నీ
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో"                                    1279

ఘనుడయి మంత్రివర్యులకు గాంక్షలు దీరగ నాంధ్రభూమికిన్
దనపరిపాలనంబునను దన్మయతన్ గలిగింతుగాన
న్ననయము నమ్ముడీ రనుచు నందము లొల్క వచించువా డనెన్
మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో.                             1280

విభుడయి దుష్టు డొక్కడు వివేకవిహీనుడు విస్తృతంబుగన్
సభలను జేసి దేశమున సత్కృతులన్ విరమింపజేసి ధీ
విభవము జూపువారలకు భీతిని గొల్పుచునుండ నచ్చటన్
శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్.                                        1281

సదమలసంస్కృతీవిభవసంస్తుతమై వెలుగొందుభూమి నా
హృదయము హర్షపూర్ణమగు నిందలి ధర్మము గాంచ దీనికై
వదలెద ప్రాణమైన నను భావమునంది విదేశ విద్యలన్
జదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్"                                 1282

మస్తుందయ్య సమస్య పెద్దమనిషీ మాకెప్పు డిట్లున్నచో
వస్తుందయ్య బలంబు పూరణకునై వాదమ్ము లింకేల మా
బస్తీవారలు మెత్తు రిట్టి పనులన్ బల్మారు మీయూరికిన్
వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్.                                        1283


రాస్తాలే పది మస్తుజోకులు సఖా! రారా బజారందునన్
పిస్తాయొక్కటి తెచ్చియిమ్ము నిజ మీవేళన్ నాకు మూడొచ్చెరా
నేస్తం! నమ్మర నీదు బస్తికయినన్ నిక్కమ్ము జల్దీగ నే
వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్.                                        1284

నిర్మలచిత్తుడై సతము నిష్ఠనుబూని చరించుచుండి
త్కర్మల జేయుచుండినను గానక సౌఖ్యము దుఃఖమగ్నుడై
శర్మ వచించె మిత్రునకు "సత్యమురా కలికాల మిచ్చటన్
ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్".                        1285

అనుపమమైన రత్నముల హారము, మేలిమిపట్టుచీరెలున్,
ధనకనకాదికంబులును దా ననిశంబును గాంక్షసేయుచున్
దనపతి దైన్యమున్ గనక తాండవ మాడుచునున్నదానినిన్
గనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై.                                     1286

పూజ్యము దేశభాషలను బోడిమి గల్గి వెలుంగుచుండుటన్
త్యాజ్యము సంశయమ్మనుచు దాను వచించెను కృష్ణరాజె యీ
వ్యాజ్యమలేల దీనిపయి నౌర! మహాపద వచ్చె నిచ్చ టీ
రాజ్యము రాజధాని గనరానిది, రాజెట నుండి యేలునో.                                1287

సుతునిం జీరి యొకండు తెల్పె నిటులన్ శుద్ధాత్ముడై "బాలకా!
మతిహీనుల్ తమమేలుగోరి పలుకన్ మన్నించ రెందేని, నీ
వతులానంద యుతుండవౌచు సతతం బాసక్తినిం జూపుచున్
హితబోధల్ విను, వారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్".                         1288

అనుమానం బొకయింతలేదు సతతం బన్నింట కష్టం బిటన్
దనకుం గూర్చుచు నెల్లవేళల మనస్తాపంబు కల్గించుచున్
తన జ్యేష్ఠత్వమునైన గాంచనియెడన్ ధర్మాత్ముడౌవానికిన్
ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే.                                           1289

వాస్తవమోయి స్వచ్ఛమగు భావనతోడ బఠించువారికిన్,
నేస్తములైనవారికిని, నిర్మలులౌ ఘనఛాత్రకోటికిన్
విస్తృత రీతి గ్రంథములు ప్రేమను బంచుటయొప్పు నిద్ధరన్
పుస్తక చౌర్య మేయశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్?                     1290

పలుకుచునుండె నత్త బహుభంగుల గోడలికిట్లు మూర్ఖతన్
గలుములతల్లి పెన్మిటిని గామ్యము దీరగ సంతతం బిటన్
దలచుట యౌను వైష్ణవుల ధర్మము, తప్పకుమీవు, వింటివే
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్.                                      1291


పరుల కుపకార మొనరించు పావనులగు
నరులపైనను సతతంబు బురద జల్లు
పనియె దినచర్యగా నెంచి వారి జీరి
"
గట్టిగా తిట్టు వాడేను ఘనుడు నేడు "                                                   1292

తెలుగువారయ్యు సతతమ్ము పలుకులందు
వలచి పాశ్చాత్యభాషను నిలుపు కొనుట
గౌరవంబని తలచెద రౌర! యిచట
నాంగ్ల మేనాంధ్రులకు మేటి యయ్య! భాష. "                                          1293

మాతృభాషయు నిచ్చోట మనకు తెలుగు
చెప్పు డెయ్యది తండ్రియౌ శిష్యు లనిన
గురున కిట్లనె నెల్కేజి కూన యొక్క
డాంగ్ల మేనాంధ్రులకు మేటి యయ్యభాష. "                                                      1294

అవురా! యేమిది మాతృభాష యిపు డీయాంధ్రావనిన్ బళ్ళలో
స్తవనీయంబగు బోధనంబునకునై తానయ్యె దూరం బెటుల్
జవసత్వంబులు గాంచునో యికపయిన్ సత్కావ్యసంపత్తితో
కవిసింగమ్ములు కావ్యకన్యకల సింగారించు రో జెద్దియో!                                       1295

వత్స! వచించుచుంటి విను! బ్రహ్మము చెప్పిన నాటివాక్యముల్
మత్సుత!యంచు దెల్పె నొక మాన్యుడు తండ్రి "జగంబునందునన్
సత్సుఖమందు దుష్టమతి, సన్నుతి గాంచును దొంగ , భావినిన్
కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.                       1296

వరకరుణాసముద్రుడయి భాగ్యముగూర్చెడి చంద్రశేఖరున్
నిరతము మానసంబునను నిష్ఠనుబూని స్మరించువారికిన్
ధరపయి సత్వవృద్ధియగు తథ్యము తద్గత చిత్తదీప్తితో
గరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో.                                    1297

చూతమురారె యందరును చోద్యమ టంచును దెల్పుచుండె నా
నాతి కుటుంబమంతకును "నమ్ముడు మాంత్రికు డొక్కరుండటన్
జేతను మంత్రదండమును జేయని పల్కుచు నూపినంతనే
రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"                      1298

రాట్పతినామధారియయి ప్రాజ్ఞమహోదయపండితాళి స
మ్రాట్పరమేశనందనుడు మందుడు మూర్ఖుడసత్యవాక్య సం
సృట్పరివేష్టితుండొకడు చేసెను ప్రశ్న వివేకశూన్యుడై
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్?                      1299.

అంచితమైన సద్యశము లందిన వానిని బండితోత్తమున్
బంను జేరి పిల్చె తన పౌత్రుడు దాగుడుమూత లాడగన్
గాంచుడు  చిక్క కాత డతికాయుడు శీఘ్రము శబ్దశూన్యుడై   
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు వివేకవంతుఁడై.                         1300.

ఊహాలోకమునందు దేలుచు సతం బుండంగ యోచించు నీ
యీహాజీవికి సత్య మింద్రపదమం దిచ్ఛానుసారమ్ముగా
నాహాయంచు జరించగాదగును కావ్యస్రష్టయై యాతడే
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్.                       1301.

అడ్డగబోను మిమ్మనుచు నాయమ పల్కుచునుండె భర్తతో
"నడ్డెడు పాయసాన్నమున నచ్చట శర్కర యావగింజయే
మెడ్డడమేల మీరు మధుమేహము నెంచుచు జంకనేల యా
వడ్డన చేయువాడు పగవాడె తినందగు నిర్భయంబుగన్"                        1302.

కొండయనంగ రాతికి నకుంఠితరూపము పెద్దయాకృతిన్
గుండను జూడు మియ్యదియె కూన! యటంచును తండ్రి జూప వా
డుండినచోట రాయియొక టొప్పుగ గుండనువేసి బల్కె నీ
కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"                 1303.

శంక యొకింత లే దతడు సద్యశ మిందని యెంచి పుత్రునిన్
బంకజనామకున్ జదువ బంపె విదేశము జ్ఞానశూన్యుడై
జంకక నచ్చటాతడనె సత్యము భారతమందు జూడగన్
శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్.                      1304.

అమలిన భావసంపదల నందక స్వార్థముతోడ నిత్యమీ
క్షమపయి సంచరించుచు కుకర్మలదేలుచు మత్సరించుచున్
భ్రమగొని సుస్థిరత్వమున బాపము జేసెడి మానవా స్వకా
యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్.                1305.

నీమముతోడ దైవమును నిత్యము దిట్టుచు నాస్తికత్వమున్
గ్రామములందు బట్టణవరంబులయందును జేరి యెల్లెడన్
దామసుడై వచించెడి విధానము నేర్చిన మందబుద్ధికి
న్గాముఁడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తియౌఁ గనన్"              1306.

ఏడ నహంకృతీబహుళ మేర్పడియుండునొ స్వార్థకోపముల్
చీడకుబోలె గూల్చుటకు జేరునొ నచ్చట హర్షసంపదల్
గూడవు నాశకారులివి కుత్సిత పీఠము లౌట ముక్తియన్
మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్.                         1307.

చూతుము గాదె దేశమున శుద్ధమనంబున బేదవారికిన్
జేతము సంతసిల్లువిధి శ్రీలను బంచెడి వారులే రహో
ఖ్యాతిని గోరుచున్ బహుముఖాభినయంబులు దప్ప నేడిటన్
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో"                      1308.

ఇలపయి సాధుభావమున నెల్లవిధంబుల స్నేహపూర్ణులై
మెలగెడివేళ నొండొరుల మేలెదలంతురు మైత్రి క్షీణమై
తొలగినవేళ వారలతి దుర్మతులై కనిపింతు రచ్చటన్
గలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే                                      1309.

నన్నెన్నడు విడువకు నా
వన్నెల దొరసాని!  రమ్ము త్వరగా నిటకున్
నిన్నందకునికి నేడీ
వెన్నెలయే చెలి! తనువును వెచ్చగ జేసెన్.                                          1310.

సంతసమందుచున్ దనవశంబున నుండెడి ప్రాణనాథు డా
శాంతము దాక సౌరభము సన్నుతరీతిని నింపు మల్లెలన్
జెంతను జేర్చ దాల్చి బహుచిత్రముగా గనుగీటి పద్మినీ
కాంతుడు లేనివేళ కలకంఠి కిసుక్కున నవ్వె ప్రేమతోన్.                          1311.

జ్ఞానదుడున్ సుఖప్రదుడు సన్మతిదాతయు రక్షకుండు స్వీ
యానుగులై చరించెడి మహాత్ములపాలిటి కల్పవృక్ష మా
దీనజనావనుండు హరి, "దేవర" యన్న యశంబు గూర్చు స
న్మానము లేనివానికి, నమస్కృతులం బొనరింతు భక్తితో.                      1310.

ఆరేచీకటి భర్త పాలు పిదుకన్ హర్షాతిరేకమ్ముతో
జేరెన్ గోష్ఠమునందు గోవుకడకున్ శ్రీమంతమై వెల్గు నా
క్షీరస్థానము గానకున్కి నిలువన్ శీఘ్రంబు తానేగి యా
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్.              1311.

అలఘు ముదంబు గూర్చు "హరియాణము" రాష్ట్రములందు మేటియై
నిలిచితి నైదువర్షములు నిష్ఠను బూనుచు నందు వర్షముల్
కలుగుట యబ్బురంబు, బహుకాలము గ్రీష్మమె నిండియుండి యా
చలిపులి పల్కరించగనె చయ్యన  పారె సహస్ర రశ్మియున్.                     1312.

పరమశుంఠ వాడు పండితపుత్రుండు
శబ్దహీనుడగుట సభనుజేరి
పలికెనిట్లు వాని పలుకులుతడబడ
వరుని మెడకు గట్టె వధువు పుస్తె                                                                  1314

అబలలనుజేరి దుష్టాత్ముడౌచు నెవడు
సంచరించగ యత్నించు సన్మతియయి
వాని నెదిరించి దండించ నంతకపురి
కంపు మగవాని నమ్మిన కలుగు సుఖము                                            1315

ఆంగ్లేయుం డొకడాడె మిత్రునకు దానాస్వప్నవృత్తాంతమున్
"
కాంగ్లీ"!వింటివె యంచు "జూచితినహో క్షారోదధీతీరమం
దాంగ్లస్థాన మపూర్వవస్తుసహితం బాశ్చర్యదం బందునన్
బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్.                         1316.

మానవు డీధరాస్థలిని మాన్యత నందెను జ్ఞానసంపదన్
వాని కసాధ్యమెంచగను వాస్తవ మొక్కటి కానరాదు సం
ధానము చేసె కృత్రిమత దానిట నన్నిట దానిచేతనే
"
వానలు లేక మెట్టవరి బాగుగఁ బండెను వైపరీత్యమే"                                       1317.

జీవుల యిష్టముల్ మదుల జేసెడి భావనలున్ విభిన్నముల్
గావున పారిజాతముల గాంచిన గిట్టని వాడొకండు తా
నీవిధి బల్కె నేలపయి నియ్యవిరాలుచునుండు సత్య మీ
పూవులవల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్"                              1318.

జ్ఞానదులయ్యు, సన్మతుల సంగతి నుండెడి వారలయ్యు,
న్మానము లందువారలయి, నవ్యయశంబులు గాంచుచుండియున్
దీనత కోర్వలేక తమ దేహము దుర్వ్యసనోగ్రపీడకున్
దానము చేయగా గలుగు దారుణవేదన సజ్జనాళికిన్.                                       1319.

ప్రాకటమైనఛాయలను బాడిగ చిత్రములట్లు యంత్రమం
దేకమతిన్ గ్రహించి ముదమేర్పడ ధ్వాంతగృహంబునందు దా
జేకొని కడ్గువా డనెను శిష్యునితో మనవంటివారికీ
"
చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"                    1320.




No comments:

Post a Comment