Tuesday 24 March 2020

శార్వరి

శార్వరి

(తోటకములు)

(య య య య - అక్షరం యతి)

వరసంపద లిచ్చట పంచుటకై
నిరతంబగు సౌఖ్యము నింపుటకై
స్థిరతంగొని వచ్చెను క్షేమములన్
ధర జూపగ 'శార్వరి' తానిటకున్. 1.

ఇటజూడ 'కరోనకు' నెల్లెడలన్
పటుసత్వము కూడె ప్రపంచమునం
దెటులైనను మ్రింగగ నిద్ధరణిన్
నటియించుచు నుండెను నాశకయై. 2.

సభ యొక్కటి చేయరు శార్వరికై
విభవంబులు చూపరు విజ్ఞు లిటన్
శుభకామన లంచును  సోదరులం
దభయంబున జేరరు హర్షితులై. 3.

కవివర్యులు శ్రోతలు కర్మఠులున్
స్తవనీయులు వక్తలు సన్మతులీ
యవనిం గలవారలు 'హా'యనుచున్
జవముం గొన రందగ సన్నుతులన్. 4.

హరి రక్షకుడై సకలామయముల్
నిరతంబును గూల్చుచు నిత్యమిలన్
పరిపాలన చేసెడి వాడగుటన్
గరుణించును క్షేమము కల్గుటకై. 5.

విను "శార్వరి"! సత్యము భీతికిటన్
నిను జేర్చము సన్నుత నిష్ఠలతో
ఘనకీర్తిని గూర్తుము  కావున నీ
వనుమానము వీడుము హాయనమా! 6.

కవులందరు పావన కాంక్షలతో
భవదీయశుభాగమ వైభవమున్
కవనంబున  నింపుచు కావ్యముగా
ప్రవచింతురు నిస్తుల భాగ్యముగన్. 7.

వర"శార్వరి"నీకిదె స్వాగతమీ
ధరణిన్ సుఖజీవన దార్ఢ్యతలన్
నరులందున నింపుము నాన్యము నిన్
వరమిమ్మని కోరెద  వందనముల్. 8.

హ.వేం.స.నా.మూర్తి.
24.03.2020.

No comments:

Post a Comment