Wednesday 25 March 2020

శ్రీ “శార్వరి”కి స్వాగతం

శ్రీ “శార్వరి”కి స్వాగతం

(వచన కవిత)
(మాత్రాబద్ధము)


శార్వరి! కొనుమా స్వాగతమంటూ
సంతోషంతో సన్నుతరీతిని
స్వాగతించుటకు సర్వజనాలను
సిద్ధపరుచుటకు చేరితి నేనిట.
సత్శబ్దంబులు, సద్భావంబులు,
పంచాంగాదులు, బహువిధ రసములు,
పత్రపుష్పములు, పాత్రల నిండుగ
సంభారంబులు సర్వము గైకొని
మన”యుగాది”యిది మానవులారా!
ఘనగుణులారా! కవివరులారా!
బంధువులారా! పావనులారా!
వేంచేయండని విస్తృతరీతిని
చాటించితి గద సర్వజగంబున,
ప్రచురించితిగద బహుపత్రికలను
రాగహృదయులై స్వాగతించగను
అందరు రండని ఆహ్వానించితి
పిన్నలు పెద్దలు మన్నించందగు
సద్గురువర్యులు సర్వజనంబులు
పూర్వపు రీతిగ “శార్వరి” కెదురై
స్వాగతింతురని భావన చేసితి
కూడలి వద్దకు గూరిమి జూపుచు
వెళ్లితి మిత్రమ!  విను నాకథనము.
అక్కడ జూడగ నొక్కండైనను
కనిపించరు మరి కారణమేమని
యాలోచించగ నప్పుడు తెలిసెను
పాడు “కరోనా” ప్రాకుచు నుండెను
అంటిన ముట్టిన నటునిటు మసలిన
అందరు కూడుచు నానందంబున
నాట్యము చేసిన నానావిధముల
యత్నము చేసిన నది పిశాచమయి
ఉగ్రభూతమయి ఉర్వీస్థలమున
పీడను గూర్చుచు వీడని దగుచును
తాకుచునుండెను దానికి భయపడి
సోదరులందరు మోదము వీడుచు
గేహస్థలమున దేహరక్షకయి
దాగియుండిరని తథ్యం బిదియని”
కానీ తప్పదు కాలం బాగదు
మహిని వత్సరము మారక మానదు
మోదము గాంచిన ఖేదం బందిన
ఆదరించరని ఆగదు “శార్వరి”
ఇష్టంబైనను కష్టంబైనను
తుష్టిం జూపుచు నిష్ఠురమాడక
“శార్వరి” నీకిదె స్వాగతమంచును
బాలబాలికలు పౌరజనంబులు
భీతిని వీడుచు విజ్ఞత నిండగ
స్వాంతంబందున సమ్యగ్రీతిని
ఆహ్వానించుడు, ఆనందించుడు
కర్మభూమి యిది ధర్మభూమి యిది
జంకది యేలా? శంక యికేలా?
పద్యములందున పాటలయందున
కవితలలోనను వివిధరకంబుల
శుభములు గోరుచు విభవప్రదమగు
“శార్వరి” నిప్పుడు స్వాగతించుడని
మిమ్మర్థించుచు సమ్మోదమ్మున
“నూతనాబ్దమా! భూతలమందున
శాంతి సౌఖ్యములు స్వాస్థ్యభాగ్యములు
క్షేమము గూర్చుము క్షామము గూల్చుము
రోగక్రిములను వేగము తోడను
పారద్రోలుమని ప్రార్థన చేయుచు
స్వాగతించెదను “శార్వరి” నిన్నని”
పలుకుచునుంటిని పరమ హర్షమున.





No comments:

Post a Comment