Wednesday 25 March 2020

శ్రీ “శార్వరి” నామ సంవత్సరమునకు స్వాగతము

శ్రీరామ


శ్రీ “శార్వరి” నామ సంవత్సరమునకు స్వాగతము.

ఉ.
శ్రీలకు స్థానమీ వసుధ చిత్సుఖ మందగ జేసె నెప్పుడున్
మేలగు కీర్తిసంపదలు మిక్కిలి వత్సలయౌచు గూర్చుచున్
బాలన జేసె సంతతిని భవ్యశుభాశయయై వెలుంగు తా
నీ లలితాత్మ "శార్వరి!" యభీష్టద పిల్చుచునుండె నిన్నిటన్.  1.
కం.
సర్వార్థసుఖము బంచుచు
నుర్వికి యశములను గూర్చి యుత్సవదీప్తుల్
పర్వన్ జేయగ వచ్చిన
"శార్వరి!" నీవందుకొనుము స్వాగత సుమముల్.  2.
ఉ.
స్వాగత మోయి! “శార్వరి!” శుభప్రకరాన్విత! శక్తిదాయకా! 
రాగమయా!సుహాయనవరా! శుభ భావ! మమత్వదీపితా!
త్యాగము, ధర్మదీక్షయును, తత్పరభావము, దేశసేవ, స
ర్వాగమలబ్ధ సంస్కృతుల నందగ జేయగ నిన్ను గోరెదన్    3.
చం.
తమకులధర్మమున్ వదలి ధారుణిలో జరియించువారి కీ
వమలినసాధుభావముల నందగజేసి స్వదేశ భక్తి సత్
క్రమమున “శార్వరీ!” ప్రజల కాయములందున నింపి చిత్తముల్
మమతకు స్థానమౌనటుల మార్చగ గోరెద నిన్ను వేడెదన్.  4.
చం.
సుమధురభావదీప్తిగొని సుందరమౌగతి నేగుదెంచు నిన్
సమధికమైన ప్రేమమున “శార్వరి!” పృథ్వికి స్వాగతించెదన్
భ్రమలను వీడి సత్యమగు వైభవమున్‌ గ్రహియించగల్గు సత్
క్రమమును జూపు మీభువిని గావగ బూనుచు నూతనాబ్దమా!  5.
సీ.
నీరాక పొడగాంచి నిస్తులానందమీ
 యాబాలగోపాల మందియుండె
ఘనతరంబుగ జేరె మనయుగాదియటన్న
 నూతనోత్సాహమ్ము భూతలమున
గృహిణుల యెదలలో గేహసీమలయందు
 షడ్రసలేహ్యాన స్పష్టమయ్యె
వశవర్తులై యుండె పశుగణంబులు సైత
 మామని సొగసుల కన్నిగతుల
ఆ.వె.
నిన్ను స్వాగతించ నిష్ఠతో కవికులం
బందియుండె పదము లందమొప్ప
సంతసమ్ము గూర్చి “శార్వరీ!” జగతిలో
నలఘు యశము గాంచు మన్ని దిశల.  6.


No comments:

Post a Comment