Tuesday 31 March 2020

సమస్యాపూరణం-12


సమతాభావము సర్వవస్తువులపై సంధించి యశ్రాంతమున్
భ్రమలన్ గూలక బంధనాదికములౌ వర్గంబులన్ వీడి సత్
క్రమతన్ ధ్యానము బూనియుండి విలత్ కైవల్యసంప్రాప్తికై
మమతాపాశము వీడకున్న మనుజుల్ మౌనీశులైపోరొకో!                                 1055
పోకార్చి యంధకారము
లేకాలము సంతసమ్ము లెంతయు నిష్ఠన్
లోకంబున బంచుటకై
చీకటి లేకున్న వెలుగు సిగ్గున నొదుగున్.                                                                 1056

తగునొకటి ద్వాపరమునకు
నగుపడు త్రేతంబునందు నతడొక్కరుడున్
తగవేల యెప్పు డెక్కడ
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్?                                                     1057

నిగమంబులు నేజదివితి
నగుపడ డన్యుండు సాటి యవనిని నాకెం
చగనని యొక డిట్లాడెను
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్.                                                                1058

వరకల్పకభూజంబా!
వరదాయిని! వాంఛితార్థవైభవదాయీ!
సురలోకజన్య!తరు శే
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా                                                    ౧౦౫౯

అత్యుగ్రమైన లేమికి
ప్రత్యహమును గుందు నొకడు బహుదీనుండై
సత్యం బిట్లని తలచెను
మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్                                        ౧౦౬0

రవిశాస్త్రి పండితుం డొక
యవధానికి పూరణార్థ మందరు మెచ్చన్
జవమున సమస్య నిట్లిడె
నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్                                                         ౧౦౬౨

ధవుడి ట్లాడెను సతితో
జవసత్వము లుడిగి పోయె చా లతినిష్ఠల్
సవితా! వృద్ధవు నీకిక
నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్                                                         ౧౦౬౩

అమలిన భక్తితోడ కడు హర్షము నందుచు  నుండి నిత్యమున్
సమతను జూపి శంకరుని సన్నుత మూర్తిని విష్ణు మూర్తినిన్
క్రమతభజించు నొక్కరుడు కాంచెను స్వప్నము దానిలోన నా
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్                            ౧౦౬౪

శివుడు కేశవు డొక్కరే, క్షితిని భేద
మెంచ రాదంచు విశ్వాస ముంచినట్టి
జనుని స్వప్నంబులో జూడ ననుదినమ్ము
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు.                                                  ౧౦౬౫

ఖలులు చోరులు వంచనా కలితు లరులు
ననిశ మవినీతి జరియించు జనుల సత్య
వాదులు నధర్మమార్గులు పర్వి యున్న
కాపురము కంటె కన నరకమ్ము గలదె.                                                                   ౧౦౬౬
(కాపురము - చెడ్డ పురమని అభిప్రాయము.)

అనుమానము లేదించుక
ఘనతర నిస్స్వార్థబుద్ధి గర్మఠు లగుచున్
తనకిది కావలెనని తల
పనివారల పెత్తనమ్ము భాగ్యము లిచ్చున్.                                                    1067

అటునిటు కుటిలత నిండెను
కటకట! కలియుగమునందు కావున సతతం
బెటులైనను సౌజన్యము
నటియించక జీవిత మ్మనర్థము లందున్!                                                      1068

చూడుము మిత్రమా! బహుళ శోభలతోడ తెలంగణావనిన్
వేడుకలందు మిన్నయయి వెల్గెడు నా బ్రతుకమ్మ పండుగన్
చేడియ లేవిధిన్ రచన చేతురు చెప్పుము నాకటంచు నీ
వాడిన, పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మ పేర్చగన్.                               1069

కవనంబున కాధారము,
స్తవనీయము ప్రియుల కిలను, సత్వప్రదమై
నవతేజము కలిగించెడి
నవలామణి నవ్వు గెల్చు నవరత్నములన్.                                                  1070

జన్మదినోత్సవంబున సంతసమున
వత్సలతమీర దరిజేరి బహుళగతుల
వరుస దీవెన లొసగిరి పంక్తిరథుని
భార్యలు మువురు శ్రీరామభద్రునకును.                                                                1071

ఆగ్రహించిన గురువర్యు డడుగ నపుడు
ఛాత్రు డిట్లాడె నొకరుడు సర్వగతుల
భీతి జెందుచు తడబడి వేగముగను
భార్యలు మువురు శ్రీరామభద్రునకును.                                                                1072

ధైర్యముతోడ చెప్పెదను ధర్మమె రూపముగా చరించి
త్కార్యములందు నిత్యమును గర్మఠుడై విలసిల్లియున్నవా
డార్యుడు సీతకన్న నొక యన్య నెరుంగనివాడు తానిలన్
భార్యలు మువ్వురా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్?                                       1073

నిగమంబులు నేజదివితి
నగుపడ డన్యుండు సాటి యవనిని నాకెం
చగనని యొక డిట్లాడెను
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్.                                                                1074

తగునొకటి ద్వాపరమునకు
నగుపడు త్రేతంబునందు నతడొక్కరుడున్
తగవేల యెప్పు డెక్కడ
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్?                                                     1075

నిలబెట్టగలుగు స్వప్నం
బిలవానిని క్షణములోన నింద్రత్వమునన్
కలియుగమున సాధ్యంబా
కలలును నిజములు తలఁబడ కలవరము లగున్.                                            1076
ఈశ - హర - శివ - భవ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
దుర్గాదేవిని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
 (ఈ శ)రత్తులోన నింపార దుర్గాంబ
పాప(హర)ణ గోరి వత్సలతల
రా(శి వ)గుట నిన్ను బ్రస్తుతించెద నమ్మ
శు(భవ)చస్సుమాల నభవురాణి!                                                                         1077

అంశము - దసరా సంబరములు
ఛందస్సు- తేటగీతి
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ద - శ - హ - ర' ఉండాలి.
 (ద)శముఖంబుల వాడును దానవుడగు
(శ)త్రువును జంపి రాముండు సన్నుతముగ
(హ)ర్షమును బంచు కాల మీయవని కందు
(ర)రయ దశహరోత్సవముల కరణి నిచట.                                                   ౧౦౭౮

(ద)నుజు డైనట్టి మహిషుని తగినరీతి
(శ)క్తి జగదంబ దుర్గయై సంహరించ
(హ)ర్షమును బూని జనులంద రవని జేయు
(ర)మ్యపర్వంబు దశహరా కామ్యదంబు.                                                      ౧౦౭౯

(ద)క్షులైనట్టి పాండవు లక్షయమగు
(శ)స్త్ర సంపత్తులను శమీశాఖిక పయి
(హ)రికి మ్రొక్కుచు దాచ నా యవనిజమును
(ర)మణులను గూడి పూజించు సమయ మిద్ది.                                                        ౧౦౮౦

(ద)శ దినంబుల పర్వమీ ధరను జూడ
(శ)స్త్రములపూజ, సర్వార్థ సంపదలన
(హ)రహమును గోరి జగదంబ కర్చనలును
(ర)మ్యగతి జేయుట దశహరా యనంగ.                                                                 ౧౦౮౧

విజయశంఖ వృత్తము (న భ భ న న న న లగ) యతి 13

అమలభావము, భక్తియు, నిరత మతుల మయిన వినయ మికన్
క్రమత జేసెడి పూజలు శుభము కలుగుటకయి తెరవు లగున్
సమత గోరుచు నంతట సతము జనని గనుచు నతుల నిడన్
భ్రమల బార్వతి కూల్చుచు నొసగు పరమపదము జనుల కిలన్.                        ౧౦౮౨

తనుజు డొక్కడైన తనకు లేకుండుటన్
శత్రు పీడితుండు సాయమునకు
చేర బిలిచి వాని చేకొని సత్వాఢ్యు
నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున.                                                             ౧౦౮౩.

జవమేల సంబరాలకు
స్తవనీయా! గ్రీష్మమగుట చా లురుదీక్షల్
పవలందు వలదు విను మభి
నవ! రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.                                            ౧౦౮౪

నిరతం బందుచు కష్టసంతతు లిలన్ నిస్సార సంసార సా
గర మధ్యంబున గూలియున్న జను డ  క్కైవల్య ధామంబు నే
కరణిన్ బొందుటయోయటంచు మదిలో గాక్షించినన్ జంద్ర శే
ఖర పాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్.                           1085

కరుణాపూర్ణుడు, దేవతానికర సౌఖ్యప్రాపకుం డన్నిటన్
వరహర్షంబును భక్తకోటి కిడుచున్ భాగ్యంబు లందించునా
హరి, లోకంబుల నేలువాడు సదయుం డైనట్టితద్దేవ శే
ఖర పాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్.                           1086

అగణితదుర్భావంబున
వగనిడ నట జేరినట్టి వానిని ఖలునిన్
తెగ నరుక బూని దలచుచు
మగనిన్, వాకిటనె నిల్పు మగువా జేజే"                                                                 ౧౦౮౭
తగురీతి నతిథివర్యుని
నగణిత సద్భక్తితోడ నాహ్వానించన్
సుగుణాన్వితుడై వెలిగెడి
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే.                                                                   ౧౦౮౮

పురహితంబు గోరు భూసురుండని యెంచి
భువిని మ్రొక్కు చుందు రవనతులయి 
దుష్టుడౌచు వాడు దుర్మార్గగముడైన
స్నాన జపము లేల జంధ్య మేల                                                                          1089

గోపాలా! సన్మిత్రమ
యీపాదమునందు చూడు మింపుగ గణముల్
చూపెద "గాసనలభస"లు
"దీపావళి నాడు వెలిగె దివ్వెలు మతులన్"                                                                  1090

బాల్యమునుండియు ననిశము
కాల్యమ్మున నిదురలేచి కడుపున నింపన్
శల్యములను నుసి చేయును
శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?                                                                1091

మున్నొక డాంగ్లేయుండిటు
లెన్నుచు నాంధ్రీయదీప్తి నీగతిపలికెన్
చెన్నుగ "స్థితి"యన దడబడి
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో.                                                        1092

జ్ఞానదను భక్తకోటికి
నానందము గూర్చుదాని ననిశము శుభముల్
మానక నొసగు శివునిదొర
సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.                                                                 1093


పంచపాండవు లన్నచో మంచమునకు
కోళ్ళవలె ముగ్గురని రెండు వేళ్ళుచూపు
వాడు మిక్కిలి యోచించి పలికె నిట్లు
అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ.                                                                         1094

కృష్ణ జన్మోత్సవం బిందు కీర్తితముగ
నష్టమికి జరుపగ నొప్పు, నట్లతదియ
తెలుగు వారల పండుగై వెలుగుచుండు
తదియనాడన సందియం బది యికేల.                                                             1095

పావనమైన మాసమది, భర్గునిరాణికి దీక్షబూనుచున్
సేవలు చేయు కాలమది, శ్రీప్రద, మాశ్వయుజంబు, దానిలో
నావల నంత్యమందు కడు హర్షము గూర్చెడి రోజు "దర్శ", దీ
పావళి పండుగన్ జరుపనౌగద పున్నమి! నాటి రాతిరిన్.                                        1096
దర్శ = అమావాస్య
కావలె సంపదల్ బహుముఖంబుల సౌఖ్యము లందుచేత నే
బోవలె నావిదేశమను బుద్ధిని జేరి స్వకీయసంస్కృతిన్
బోవిడి యందె లీనుడగు పూరుషు డీగతి బల్కె నౌర! దీ
పావళి పండుగన్ జరుపనౌగద పున్నమినాటి రాతిరిన్.                                           1097

కేవల మాంగ్లసంస్కృతియె కీర్తిని బెంచును దానిచేతనే
పావనమౌను జన్మమను భావము  పుత్రుని లోననింప వా
డావల నజ్ఞుడౌచు నిటు లాడెను వింటిరె మాఘమందు దీ
పావళి పండుగన్ జరుపనౌగద పున్నమి నాటిరాతిరిన్.                                           1098

సుద్దులు చెప్పుచుండె నొక చోటను పుత్రుల కొక్కరుం డిటుల్
వద్దుర మీర లిట్లు బహుభంగుల వీరిని దూరుచుండుటల్
పెద్దలు చెప్పుమాట యిది విజ్ఞత బూనుచు నమ్ముడోరి! మీ
రిద్దరు, భార్యలే మగని నెప్పుడుఁ గాతురు బాధ లన్నిటన్!                                               1099

సత్యము పూరణ చేసిన
నత్యుత్తమమైన ధార నందుచు కవితల్
స్తుత్యంబులౌను గావున
నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్.                                                                1100

సందియములేదు విష్ణువు
సుందరముగ సర్వమందు శోభిలు సకలం
బందుండు నతనిలోననె
యంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్.                                                                 1101

వదలుము చింతల నాముని
సదయుడు సంఘోపకారి సన్నుతమతి నీ
విదివిను మాతని మహిమను
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్.                                                  1102

ఇది కలికాల మీజగతి నెన్నియొ వింతలు చూచుచుంటి మే
యదనున నైన నేటిజను డెయ్యది యైనను బొందగల్గి సం
పదలు సృజించు శక్తి గనె వాని కసాధ్యము లేదు చూడగన్
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్.                                1103

పుత్రు నొకడు స్వీయ మిత్రుని కడకంప
బూని పలికె "వినుము బుద్ధిజీవి
యగుట విడుపు జూప తగురీతిగను పొడు
పిచ్చి వాడు తెలివి బెంచువాడు"                                                                             1104
        (పొడుపు-విడుపు)


ఇచ్చవచ్చినట్లు నిచ్చోట నచ్చోట
దిరుగుచుండు చేరి యరచుచుండు
నూరకుండ డెపుడు యోచింప జేయును
పిచ్చివాడు తెలివి బెంచువాడు.                                                                     1105

దుష్టములగు కీటకముల
చేష్టలనుం ద్రుంచి రైతు చిత్తజమగు నా
కష్టంబు నణచి పంటకు
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్.                                                  1106

నాడొక పర్వంబందున
చేడియ శర్కరనుగాచి చేయ మిఠాయిల్
కోడల! తెమ్మని యందలి
కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్.                                                                  1107

కలియుగంబు గాన  కల్లలాడెడివారు
స్వార్థపరతతోడ సంచరించు
వారు బుద్ధిజీవు లౌర! సన్మార్గులై
మంచి బెంచువారు మందమతులు.                                                                          1108


మించిన స్వార్థభావమున మేదినిపై జరియించువారలున్
వంచన చేయుచుండుటయె భవ్యపథంబుగ నెల్లవేళలం
దెంచెడివార లీ కలిని నెంతయు విజ్ఞులు‌, ధర్మవర్తనుల్
మంచినిఁ బెంచువార లిల మందమతు ల్గద యెంచి చూడఁగన్                                 1109

భూతలమున సిరులొసగెడు
మాతలు మువు,రైన నొక్క మాతఁ గొలుతువా
చేతన! యందువె మిత్రమ!
యాతల్లుల యాత్మ యొక్క టని తెలియవొకో?                                                  1110

క్షయమొందించు సమస్తపాప పటలిన్, సద్గోష్ఠులం జూపుచున్
జయముల్ గల్గగజేయు జీవనమునన్, సర్వత్ర సత్కార్యసం
చయముల్ చేసెడి శక్తినిచ్చు, యశముల్ సంధించు నుర్విన్ శివా
లయమే శాంతిని గల్గజేయును గదా రంజిల్ల సన్మార్గమై.                                         1111

స్తబ్ధత దూరమౌను బహుధా శ్రమియించెడి సత్వ మబ్బు ప్రా
రబ్ధ మటంచు నెంచక పరాజయ భీతిని దాల్చకుండగన్
లబ్ధములైన శక్తులనిలన్ వినియోగము చేయుచుండ క్షీ
రాబ్ధిని బుట్టినట్టి సుధ యట్లు జయంబులు గల్గు నిచ్చలున్.                                              1112

చరకు డనెడివాడు నరకుడన్ మిత్రున
కనియె వరములంది యాకసమున
దిరుగు దుష్టులైన త్రిపురదైత్యులకును
నరక! హంతకుండు గరళగళుఁడు                                                                           1113

నిరతము జీవకోటులకు నిస్తులపీడలు గూర్చుచుండి యీ
ధరపయి దుర్మదాంధుడయి దైత్యబలంబున సంచరించ నా
హరి యట కృష్ణుడై నిలిచి యంగనతోడ మహాహవంబునన్
నరక నిహంత యయ్యెఁ గద నాగగళుం, డగజాత మెచ్చఁగన్"                                1114

తుల్య 1 వృత్తము
- గణములు
7, 13, 19 అక్షరములు - యతి స్థానములు

తుల్య-1.

దీపావళియన - దీపంబుల ఘన - తేజం బిలపయి - దీపిల్లుట గద
పాపం బణగును - భాగ్యం బమరును- పారున్ దిమిరము- పాయున్ కుటిలత
కోపం బుడుగును - కూర్ముల్ పెరుగును - గోవిందునిపయి - కూడున్ హృదయము
తాపం బవియును - తథ్యం బగుటను - ధాత్రిన్ వెలుగుల - తావుల్ చిలుకుడు.            1115

సద్భక్తిన్  హృదయాధివాసమునకై సర్వేశ్వరా! యంచు వి
ద్వద్భావాఢ్యత జూపి పిల్చి నిలువన్ భక్తాగ్రణీ! యంచు నా
సద్భాగ్యప్రదుడన్నికాలములలో సంతోషముల్ గూర్చు ను
ద్యద్భానూపమదీప్తినిచ్చు ననుటల్ తథ్యంబులౌ వాక్యముల్.                                 1116

"భుక్త్వా" యన్నను తినియగు
"త్యక్త్వా" యన విడిచి యౌను తథ్యం బటపై
"నుక్త్వా"వచియించియు నిక
నీ"క్త్వా" ప్రాసకును పద్య మిట్లమరు గదా!                                                                  1117

క్రమతన్ సర్వవిధంబుల
నమలినసంతోష దీప్తి అన్నివిధాలన్
శమియించ జగములందున
తిమిర, మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"                                                               1118

"భుక్త్వా మోదక పాయసాన్న సహితం భోజ్యం సుపర్వే దినే
త్యక్త్వా సంశయ మంతరంగ నిహితం యైర్భావనైః పూరితమ్
ముక్త్వా క్షుత్కృత పీడనా దతిసుఖం మోదం దేహ్యంబికే
త్యుక్త్వా హర్షితమానసోస్మి" యనియెన్ యోచించి మిత్రుండిటన్.                                      1119

కం.
చక్కని కవితా పంక్తుల
నక్కజమగురీతి నిప్పు డందించిన మీ
మక్కువగల శుభకామన
లెక్కుడు మోదంబు గూర్చె యీ పర్వమునన్.                                                   1120

కరుణించుము నన్నగ్రజ!
ధరణీపతి వీవె నేను తథ్యము నీ కిం
కరుడను వినుమని మ్రొక్కగ
భరతుఁడు రామున, కొసంగెఁ బాదుక లెలమిన్.                                                  1121

పరమదయామయా! పతితపావన! దీనజనావనా!భవత్
కరుణను జూపుమా! యని యకల్మషుడై వినుతించి వేడగా
భరతుఁడు, భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను, రామమూర్తికిన్
కరములు మోడ్చి మ్రొక్కి శుభ కామనలం గొని యేగె నంతటన్.                              1122

శుభములనుగూర్చు నిరతంబు సోదరులకు,
పుట్టినింటను సంతోష మెట్టులయిన
నిండవలెనంచు కాంక్షించు నిరుపమముగ
తోడఁ బుట్టు వేయన్నకుఁ గీ డొనర్చె?                                                                       1123

ఏడన్ జూడనిరీతి మారె జగముల్ హేయంబులౌ భావముల్
నే డీమానవచిత్తసీమ నలమెన్ నిక్కమ్ముగా స్నేహముల్
కూడెన్ విత్తమునందు దానికొరకై కూలంగ బంధుత్వముల్
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!.                                               1124

క్షయమొందించు సమస్తపాప పటలిన్, సద్గోష్ఠులం జూపుచున్
జయముల్ గల్గగజేయు జీవనమునన్, సర్వత్ర సత్కార్యసం
చయముల్ చేసెడి శక్తినిచ్చు, యశముల్ సంధించు నుర్విన్ శివా
లయమే శాంతిని గల్గజేయును గదా రంజిల్ల సన్మార్గమై.                                         1125

ఆశుతోషు డౌచు నమలమౌ సద్భక్తి
దనను గొల్చుచుండు జనుల కిలను
సిరు లొసంగు కొరకు చేరిన శివుని ని
లయమె శాంతిఁ గూర్చు నయముగాను.                                                                   1126

పెద్ద కర్రతోడ వేగంబుగా వచ్చి
సద్దు చేయుచుండి శమనుని గతి
భీతి గలుగజేయు నాతని నచట వెం
కప్పను గని పాము కలఁతఁ జెందె.                                                                           1127

ముంగిసవలె నొక్క యంగీని ధరియించి
వేగమపుడు పెంచి విస్తృతముగ
నడవియంత దిరుగు నవ్వేషధారియౌ
కప్పను గని పాము కలఁతఁ జెందె"                                                                          1128

క్షణమున కొక్కటి చొప్పున
గణుతిని భువిపయిని గాంచగ  సమస్యలకున్
ఫణుతులుగని చేసెడి పూ
రణములెగద పండితులకు రమ్యక్రీడల్.                                                            1129

గణములు యతులును ప్రాసలు
గుణనిధులై నేర్చు శిష్యకోటికి విద్వ
చ్చణులై చేసెడి వగు సవ
రణములె గద పండితులకు రమ్యక్రీడల్.                                                           1130

రాఘవు డనువా డొక్కడు
వాఘోరా నదికి జేరి పామరు డగుటన్
మేఘములు క్రమ్మ ననుకొనె
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్.                                                   1131

అందరి యెదుటను పలికెడి
చందంబును నేర్వనట్టి ఛాత్రుం డనియెన్
నందిని ననుటకు తడబడి
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్.                                                    1132

మాంత్రికుండొకండు మహిమలు చూపుచు
పలుకుచుండె ప్రక్కవానితోడ 
క్షణములోన మారు కర్రయే కొంగగా
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము.                                                           1133

అమ్మా! నవరాత్రంబుల
నిమ్మహి కాపాడు తల్లి కింటను బూజల్
నెమ్మది జేతుము నీవును
రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్                                                          ౧౧౩౪
మూఁడు - ఆరు - ఏడు - పది
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
కీడు (మూడు) నిజము కిమ్మనకుండిన
సుఖము(లారు) తెగులు సోకు నధిప!
(
ఏడు)గడయె లేక ఈ నీ సమూహంబు
చచ్చు (పది)ల మనియె శార్ఙి సభను.                                                           1135

ఊరి జనుల జూచి యోర్వలేకుండెడి
చుప్పనాతి నాతి సుందరమ్మ
కెదుటివారి నరసి యేరీతి నైనను
కనుల నీరు నింప, కడుపు నిండు.                                                                         1136

పిలకను దువ్వి ఫాలమున వేగముగా సరియైన రీతిలో
తిలకము దిద్ద రమ్మన సతీమణినిన్, విని పంతులమ్మయున్
బలపము పట్టి పుత్రులకు వర్ణము లింపుగ నేర్పువేళ నా
పలకలు, పిల్లల న్వదలి పంతులు గారినిఁ జేరె దిద్దగా .                                               1137

అయ్యయ్యో స్వర్గంబున
కియ్యెడ తానేగె నంచు నిలనొక చిత్రం
బయ్యదనున గీసి యటన్
కొయ్యకు వ్రేలాడదీసె గురువును భక్తిన్.                                                                 1138

అంబురుహ వృత్తము
చూతమ టన్నను చిత్తము లందున శుద్ధతల్  గనరావుగా
భూతల మీకలి కాలము నందున పోడుముల్ విడ నాడెగా
నీతుల జెప్పుచు గోతుల ద్రవ్వెడి నేతలే మన ధాత లౌ
చేతలు శూన్యము కోతలు కొల్లలు క్షేమముల్ వినరావుగా.                                ౧౧౩౯

వంచకేశ్వర నాముడై వసుధనేలు
నృపతి యాదేశములు చేసె "నిత్య మిచట
చోరవరులను మైత్రికై చేరవలయు,
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"                                                   ౧౧౪౦

అతులిత మగు శ్రద్ధను గొని
సతతము సద్భక్తు లౌచు సన్మార్గగులై
క్షితివారు చేయు గౌరీ
పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్.                                                    ౧౧౪౧

సురుచిర భారతీయ ఘనసుందర సంస్కృతి నడ్డగించి పై
మెరుగుల జూపి  రండనుచు మించిన యాశల దేల్చుచుండి యీ
ధరణిని నాట్యమాడు పరధర్మము లందగబోక త న్నిరా 
కరణము నమ్మువారలకు కల్గు శుభంబులు నిశ్చయంబుగన్                              1142

పొరను గోలుపోయి పొరిపొరి పొక్కుచు
దూరదర్శనాన కోరి వినెడి 
వాని మిత్రు జూచి పలికె నొక్కరు డిట్లు
వేణు! రవము విన్న వెతలు హెచ్చు                                                             1143

నిరుపమముగ ననృతంబులు
ధర నాడెడి స్పర్ధలోన తానొక డిట్టుల్
బిరబిర పలికెను వింటిరె
పరపతి పరసతిని గాంచి వాంఛలఁ దెల్పెన్!                                                   1144

సామాజికం

ఒక్క తన్వంగి యిట్లాడు చుండె నొకట
నొప్ప దిదియండ్రు శుభముల కుర్విలోన
నాదు సుతుడిందె జనియించి మోదమందె
యీ యమావాస్య వెలుగుల నేరి కిడునొ.                                                                1145


శ్రద్ధతోడ సకల శాస్త్రముల్ చదివియు,
నఖిలధర్మవేత్త యయ్యు భువిని
సతము ఛాత్రు డౌచు జ్ఞానార్జనంబున
తనివి లేని మనిషి దక్షత గను.                                                                    1146

శాపమును బొంది ఖిన్నుడై సంచరించు
వాని జూపించి సఖునితో బలికె నొక్క
డనయ మున్మాదియై యుండు నతని గనుము
పవన! తనయుండురా, మునిఁ బరిహసించె.                                                  1147

పరమ పావనమై యొప్పు, సురలకు నిది
వాస మౌచును వెలుగొందు వసుధ పయిని
ననుచు పల్కెద రార్యులు నావనియెడి
పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట.                                                     ౧౧౪౮

పట్టిన వ్రతమును విడువక
నెట్టన కార్తీకమందు నిత్యము నిష్ఠన్
గట్టిగ పశుపతి గని జే
కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్.                                                                    1149.

శ్రద్ధతోడ సకల శాస్త్రముల్ చదివియు,
నఖిలధర్మవేత్త యయ్యు భువిని
సతము ఛాత్రు డౌచు జ్ఞానార్జనంబున
తనివి లేని మనిషి దక్షత గను.                                                                     1150.

No comments:

Post a Comment