Monday 9 March 2020

మహిళ


మహిళ
కం.
మహిళకు వందన శతములు
మహిపయి సృష్టికిని నెలవు మాన్యయు విలస
న్మహిమోపేతయు మాతయు
మహితగుణాఢ్యయును వనిత మమతలగనియున్. 1.
కం.
నరునకు జననమునుండియు
మరణించెడిదాక వెంట మసలుచు దానై
నిరతము బహురూపంబుల
సురుచిరగతి సాకు మహిళ  సుకృతికి జేజే. 2.
కం.
సహనంబున నీభువిపయి
మహిళకు పరికించ నిజము మహియే తులయౌ
నహరహమును మనుజునకై
తహతహ లాడుచును హితము తానొనరించున్.3.
కం.
ఘనసౌఖ్యంబును గోరును
తనవారికి సంతతమ్ము, తనకుముదం బా
పనిలో ననె గణియించెడి
యనుపమ నిస్స్వార్థ మహిళ యామెకు ప్రణతుల్.4.
కం.
లోకంబుల కన్నింటికి
నేకాధారంబ యౌచు నేకాలమునన్
శ్రీకరమగు సత్త్వంబున
కాకరమగు మహిళ నబల యనదగునె భువిన్.? 5.

No comments:

Post a Comment