Monday 9 March 2020

"అలుకయె తిరుమలేశున కంద మొసగు"

దుర్మదాంధులు మత్తెక్కి దుష్టకర్మ
లాచరించుచు నుండిరీ యవనిలోన
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.1.

అన్యమతముల వైపున కాశజూపి
హైందవము గూల్చ యత్నంబు లమరె నిచట
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.2.

మాతృభాషను నేడిందు మరచుచుండి
నాట్య మాడుచునుండి రీ నరులు కనుక
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు. 3.

తల్లిదండ్రుల విషయాన తనయుల కిల
బాధ్యతలు గ్రుంగె విత్తమే ప్రాణమయ్యె
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.4.

ధర్మమునుగూల్చ దులలేని ధైర్యమునను
జంకకుండిరి యీనాటి జనులు కనుక
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.5.

అవుర కలియుగ వైకుంఠ మైన ప్రాంత
మన్యమతముల కాస్థాన మగుచు నుండ
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు. 6.

వావి వరుసలు లేవయ్యె భావమందు
నిర్మలత్వమ్ము  క్షీణించె నిఖిలజగతి
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.7.

భగవదర్చన దానంబు లగణితమగు
స్వార్థ మూలంబులయ్యెను వసుధలోన
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.8.

మమత కరువయ్యె నెందేని సమతలేక
కలుషజాలమ్ము క్రమ్మె నీ యిలను గాన
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు. 9.

క్రమము దప్పుచు దుర్మార్గ గమనమందు
నుత్సహించెడి జగతికి నొప్పు దెలుప
దడయకుండగ గలియుగ దైవమగుట
నలుకయె తిరుమలేశున కంద మొసగు.10.

No comments:

Post a Comment