Monday 30 March 2020

విజ్ఞప్తి

విజ్ఞప్తి

శా.
అంతర్జాలసమూహమందు సతతం బారోగ్యసంభాషణల్,
సంతోషప్రదసత్కవిత్వరచనాసత్కార్యనిర్మగ్నతల్,
చింతానాశకదేవతాగణ వరశ్రీదాయక ప్రార్థనల్
వంతల్ గూర్చు 'కరోన'రోధకములౌ వ్యాపారముల్ చూడగన్. 1.
ఉ.
పాలకు లేవిధంబునను బాడి యటంచును బల్కుచుండిరో
తాలిమి జూపి యాగతిని దప్పక స్వీయ గృహంబు లందునన్
మేలని చేరి యుండుటయె మిక్కిలిగా సుహితంబు గూర్చు నీ
వేళను మానవాళి తమ విజ్ఞత జూపిన క్షేమ మందెడిన్. 2.
చ.
కినుకను బూనగా వలదు కిమ్మన కుండుట సౌఖ్యదాయియై
జనులను జంప బూనుచును సాగు 'కరోనకు'నడ్డుకట్టయౌ
ననియెడి మాట నమ్మవలె నందరు మీసహకార మీతరిన్
మనుజుల గావ దెల్పుచును మాన్యత నందుట యుక్త మెల్లెడన్. 3.
మ.
ధనముం బంచుడు ధాన్యరాశుల నిటన్ దానంబుగా జూపు డో
యనఘుల్ మీరని కోరలేదుగద   న్యాయంబా గృహప్రాంతమున్
విను డెవ్వారును వీడకుండుటకునౌ విజ్ఞప్తులన్ మీరుటల్?
ఘనులారా! సహనమ్ము దాల్చుట యగున్ గర్తవ్య మిప్పట్టునన్. 4.
ఆ.వె.
జన్మభూమిపైన సమసమాజమునందు
మనములోన నున్న ఘనతరమగు
ప్రేమ దెలియజేయు వేళ యేతెంచెనో
యలఘుచరితులార! తెలిసికొనుడు. 5.

హ.వేం.స.నా.మూర్తి.
31.03.2020.

No comments:

Post a Comment