Sunday 25 March 2018

శార్దూల మాలిక (ప్రజ-పద్యం)


శార్దూల మాలిక
(ప్రజ-పద్యం)
ఈరో జేవిషయంబు చెప్పగలనో యీపద్య సత్క్రీడలో
సారాఢ్యంబగు శబ్దజాలమునకై సర్వప్రయత్నంబు నే
నారంభించిన దాది చేసితి గదా హర్షంబునం దల్చుచున్
ధీరత్వంబును గోలుపోనటులుగా ధీశక్తి నందించగా
నీరేజాక్షు జనార్దనున్ శివుని వాణీగౌరులన్ లక్ష్మినిన్
కారుణ్యాత్ముని వేంకటేశ్వరుని విఘ్నూధీశు నా బ్రహ్మనున్
వీరాగ్రేసరు నాంజనేయుని జగద్విఖ్యాతు శ్రీరామునిన్
వీరున్ వా రనకుండ దేవగణమున్ విజ్ఞప్తులం జేయుచున్
కోరం బిల్చితి పల్కబోవరు గదా కూర్మిన్ మహత్ శక్తులన్
వా రీయందగు నర్హతల్ గలిగినన్ బాగంచు నీబూనరే
యౌరా నేనొక యల్పుడన్ సరికదా యజ్ఞాని నైయుంట న
వ్వారిం గొల్చెడి సవ్యమైన ఫణితిన్ భావింప లేనే నమ
స్కారం బైనను జేయు మార్గ మెరుగంగా లేని మూఢుండ నా
కేరీతిన్ దయ జూప నెంతు రకటా హే దేవతా సంఘముల్
నోరారంగను మీ శుభాహ్వయములన్ నూత్నానురాగంబు వి
స్తారంబౌ గతి పల్కగల్గు నటులన్ శక్తిన్ బ్రసాదించగా
నేరంబుల్ గనకుండ నాశిష మిడన్ నేనిందు బ్రార్థింతు స
త్కారార్హంబగు సత్కవిత్వ రచనన్ కాంక్షించు మిత్రాళికిన్
చారుప్రాభవదీప్తి సంతత మిలన్ సంధిల్లగా జేసి స
ర్వారాధ్యంబగు సద్యశంబు నిడగా నర్ధించుచున్నాడ మా
ప్రారంభించిన కర్మలన్నిట మహద్భాగ్యంబు చేకూరగా
శ్రీ రామా యని వ్రాయబూను రచనల్ శ్రేష్ఠత్వముం గాంచగా
ధీరత్వంబు సదా మనఃఫలకమున్ దేజోమయం బౌనటుల్
చేరన్ దీవనలీయ మిమ్ము దలతున్ చిద్రూపులౌవారినిన్.


No comments:

Post a Comment