Sunday 25 March 2018

శ్రీ దుర్గ


శ్రీ దుర్గ
జగన్మాత్రే నమః

కందములు

శ్రీకరి! శుభకరి! శాంకరి!
చేకొని మా వందనంబు క్షేమంకరివై
లోకంబుల రక్షించుట
కేకాలము తడయకమ్మ! యేవిధి దుర్గా!          1.

వందనము లోకమాతా!
వందన మో భాగ్యదాత! వైభవయుక్తా!
వందనము భావదీప్తా!
వందనములు గొనుము సర్వవందిత! దుర్గా!    2.

నీపాదసేవ యెల్లెడ
పాపాపహ మౌచు నిలుపు పావనత నిలన్
దీపిల్ల జేయు విభవము
లో పార్వతి! వందనంబు లొప్పుగ దుర్గా!        3.

వసుధాస్థలిలో నెన్నగ
నసదృశ సద్భాగ్యదాత వయి యెల్లెడలన్
ప్రసరింప జేయు చుండెద
వసమానదయార్ద్ర దృక్కు లనయము దుర్గా!    4.

తల్లులకు దల్లి వీవయి
యెల్లరి క్షేమంబు గోరి యీ వసుధ పయిన్
కొల్లలుగ భావసంపద
లెల్లపుడుం బంచుచుందు వీశ్వరి! దుర్గా!    5.

మనమందున వాక్కులలో
పనులందున సామ్య మొదవు భాగ్యము నాకున్
ఘనతరముగ నిప్పించుము
ధనరాశులు గోరబోను తల్లీ! దుర్గా!               6.

కరుణను జూపిన జాలును
నిరతము నీ నామజపము నిష్ఠాగరిమన్
సురుచిరగతి జేయుటకయి
ధరవారికి శక్తి గలుగు తథ్యము దుర్గా!          7.

మల్లెలు పొన్నలు జాజులు
ఫుల్లాబ్జంబులను జేర్చి పూజింతు నినున్
తల్లీ! నీదయ జూపుచు
నుల్లంబున శాంతి గూర్చు చుండుము దుర్గా!  8.

నవరాత్ర దీక్ష చేకొని
స్తవములతో గొలుచుచుండి తన్మయు లగుచున్
భవదంఘ్రుల శిరముంచెడి
కవులను సద్భక్తకోటి గావుము దుర్గా!           9.

జేజే పర్వతపుత్రీ!
జేజే శర్వాణి! కాళి! జేజే గౌరీ!
జేజే కాత్యాయని! యుమ!
జేజేలు భవాని! నీకు జేజే దుర్గా!                 10.

No comments:

Post a Comment