Sunday 25 March 2018

“తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం ”


తెలుగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర - మన కర్తవ్యం

శా.     శ్రీమంతం బగు జీవనంబునకునై చేయూతగా నిల్చుచున్ 
క్షేమం బన్నివిధాల గూర్చుచు మహత్ శ్రేయంబు లందించుచున్
ప్రేమం బెల్ల జగాన బంచగల సద్విజ్ఞత్వముం జూపుచున్
నీమంబుల్ దలపించు వాక్చతురతన్ నేర్పించు నాంధ్రం బిలన్.                  1.

చం.             సుమధురమైన శబ్దములు  సుందర భావము లూని  యంతటన్
సమధికమైన సౌహృదము సంతత మందగ జేయునట్టి యీ
యమలినమై వెలుంగు తెలు గన్నిట లెస్సగ కీర్తి నందెనీ
క్రమమున దీని రక్షణము కార్యము తెల్గుల కన్నిరీతులన్.                            2.

సీ.                మన ప్రభుత్వమువారు మన్నించి తెలుగును
మాన్యగా దీర్చుచు మసల వలయు
అధికార భాషగా నాంధ్ర మన్నింటిలో
అమలు చేసెడిరీతి నరయ వలయు
తెనుగులో సత్కావ్య దీప్తికై కవులకు
తీరైన యండను తెలుప వలయు
బడులలో నన్నింట పఠన పాఠనము లీ
భాషలో నగునట్లు పలుక వలయు
ఆ.వె.           తెలుగు భాషలోని తియ్యందనాలను
తెలియ జేయుచుండి దీని వలన
బుద్ధి వికసనంబు భువిలోన నగు నను
ధైర్య మొసగవలయు తడయ కుండ.                                                       3.





సీ.                తెలుగు వారలలోన నలఘు రూపంబైన
ప్రేమ యీ భాషపై పెరుగ వలయు
ఆంగ్లాదు లందున్న వ్యామోహ మొక్కింత
తథ్య  మీ నేలపై  తరుగ వలయు
ఆంధ్రసాహిత్యంబు ననుపమంబుగ నెంచి
యందున్న లాలిత్య మంద వలయు
తెనుగులో పలుకుట  దివ్యభాగ్యంబుగా
నీభూమి  వారెల్ల రెంచ వలయు
తే.గీ.            సర్వ విధముల జగతిలో సద్యశంబు
కూర్చునట్టిది నాభాష కూర్మిమీర
నేను నేర్చుచు నేర్పింతు నిష్ఠతోడ
ననుచు మనమంత ప్రతినల నంద వలయు.                                             4.

కం.              నిరతము మన సర్కారులు
సురుచిరగతి నాదరింప, సుందర ఫణితిన్
ధరలోని వారు నేర్వగ
పరిరక్షణ తెలుగున కగు భయమేల యికన్.                                               5.


No comments:

Post a Comment