Sunday 25 March 2018

3--సరదాగా ఒక సన్నివేశం (ప్రజ-పద్యం)


3--సరదాగా ఒక సన్నివేశం 
(ప్రజ-పద్యం)
ఉ.
పొత్తము బూనియుండె ప్రణవుండు మహత్తరమైన శ్రద్ధతో
చిత్తమునందు సారమును జేర్చగబూని యదేమి చిత్రమో
మొత్తము గా దొకించుకయు మోదయుతంబుగ నంద లేకతా
నత్తరి భాగ్యహీనుగతి నార్తిని  మున్గి దలంచు నిట్టులన్.

కం.
మనమున కొంచెము దూరదు
ఘనతరమగు శక్తిరాదు కడగి పఠించన్
విననగు మానస మబ్బదు
పెను భూతం బయ్యె నాకు విద్య కనంగన్.

సీ.
అన్నయ్య చూడరా యద్భుతంబైనట్టి
ప్రతిభతో శ్రేష్ఠతన్ బడసి యుండె
అక్కయ్య నటుచూడు మత్యున్నతంబైన
వైద్య విద్యను దాను విజయ మందె
చుట్టుప్రక్కల వారి జూడుమురా వార
లేరీతి విద్యలం దారి తేరి
సమసమాజము నందు సత్త్వోన్నతింగాంచు
చున్నార లీనాడు శోభనముగ
తే.గీ.
ననుచు నాలోన చదువుపై ననుపమపగు
శ్రద్ధ గల్గించి ప్రేమతో నుద్ధరించ
యత్న మొనరింతు రెల్లప్పు డమ్మ నాన్న
విద్యయే సర్వమా యేమి విశ్వమందు.
మ.
కన రొక్కింతయు నాదు భావనములన్ కారుణ్యతా దృష్టితో
వినరింతైనను నా మతంబు సతమున్విద్యా జపంబే యిటన్
ధన మత్యున్నత భోగభాగ్యవితతుల్ తద్దూరుడైయున్న మే
దినిపై గూడవె? యెంచరెవ్వ రకటా! దీనిన్ బ్రశాంతంబుగన్.
మ.
అదిగో క్రీడల ప్రాంగణం బెదురుగా హర్షాస్పదం బౌచు  నా
మదిలో నిండిన స్వప్న సంతతులకున్ మాన్యత్వముం గూర్చిసం
పదలం గోరగ నిచ్చు దేవత విధిన్ బల్మారు నన్ జీరుచున్
ముదముం బంచుచునున్నదేగ వలయున్ మున్నంద సన్మానముల్.
చం.
చదువుచు నుండె నాసుతుడు శ్రద్ధగ పైగదిలోన నంచు నా
సదమల చిత్త తజ్జనని స్వాదు రసంబుల నీయ నెంచ నీ
యదనున వానిబిల్వ వలదంచును దండ్రి వచించ మెల్లగా
పదములు వేసె యాటలకు భావి దలంచుచు వాడు దీప్తితోన్.


No comments:

Post a Comment