Sunday 25 March 2018

మాతృభాష


మాతృభాష
(౨౦౧౮ మాతృభాషా దినోత్సవం సందర్భముగా)
సీసమాలిక
మమకారమును జూపి మాతృభాషను నేర్చి అతుల యశము నందు డన్నలార!
మాట్లాడు సమయాన మాతృభాషను మీర లాదరించుడు నిత్య మక్కలార!
మాతృభాషను దాల్చి మనుచుండినను మీకు ధన్యత్వ మందునో తమ్ములార!
మనభాష నెదలోన నమని నిలుపంగ శ్రేయంబు లందునో చెల్లులార!
ఆలోచనము లెట్టి కాలమ్ము నందైన మాతృభాషనె సాగు మాన్యులార!
కలలు సైతము నిత్య మిల మాతృభాషలో ననిశంబు సాగునో యార్యులార!
సంతోషమున గాని వంతలందున గాని మనను వీడని భాష మాతృభాష
కులమత భేదాలు కొద్ది గొప్పలతీరు మహిని చూడదు గదా మాతృభాష
మాతృభాషను రోసి మరియన్య భాషలన్ నేర్చుచుండుటయన్న నిజము గాను
ఉట్టినందగలేని యువిద యాకాశంబు నందగా యెగిరెడి చందమౌను
తల్లిదండ్రుల దన్ని దైవంబులకు పూజ సల్పగ యత్నించు చందమగును
మాతృభాషను నేర్చు మహనీయకార్యాన శ్రమచేయ పనిలేదు సత్యముగను
ఉర్విపై నున్నట్టి సర్వభాషలలోన మాతృభాషయె మేటి మరువ కండి
సరమై సుఖదమై నిరత హర్షము గూర్చు నిల మాతృభాషయే పలుక రండి
విజయంబు చేకూర్చి విస్తార యశమిచ్చు నెందు నీభాషయే పొందరండి
ఆప్యాయతను బంచి హాయిని కలిగించునది మాతృభాషయే కదలి రండి
అప్రయత్నంబుగా ననుపమంబైనట్టి వైదుష్య మందించు భాషయిదియె
ఆత్మీయతాభావ న్నివేళల జూపి ప్రాధాన్యతను గూర్చు భాష యిదియె
మాటలందున గొప్ప మమకారమును జేర్చి పరమహర్షముగూర్చు భాష యిదియె
భావ మందం బొల్క లికించు యత్నాన బాధ కల్గించని భాష యిదియె
జ్ఞానార్జనంబునం దేనాడునుం గాని మాతృభాషను భువిన్ మరువ దగదు
నిత్యజీవనమునం దత్యంత హితమైన మాతృభాషను గొల్వ మాన దగదు
భావాన స్పష్టతన్ బాగుగా జూపించు మాతృభాషను వీడి మసలదగదు
కాఠిన్య మొక్కింత కలిగియుండనిమాతృభాష నేనాడైనవదల దగదు

ఆ.వె. మాతృభాషకున్న మహిమంబు తెల్పంగ నాల్గు ముఖములున్న నలువ కైన
సాధ్యపడదటన్న సత్యంబు సామాన్యు డెట్టు లెం గలుగు నెల్లగతుల.

ఆ.వె. మాతృభాషయన్న చేతనత్వము గూర్చి యుత్సహింప జేయు నున్నతముగ
మానవాళి కెపుడు మాన్యత చేకూర్చు భాష నిజము మాతృభాష యిలను.

ఆ.వె. మాతృభాష వీడ మాన్యత నాకందు నన్యమైన చోట ననుచు దిరుగ
గోరుచుండువాడు కువలయంబున తాను మనిషి యగునె దలపు డనుజులార.

No comments:

Post a Comment