Sunday 25 March 2018

శుభాకాంక్షలు


శ్రీ నారుమంచి అనంత కృష్ణ గారి షష్టిపూర్తి
శుభాకాంక్షలు
శ్రీమదనంత కృష్ణకవిశేఖరు నద్భుతభావపరంపరాయుతున్
ధీమతి నార్యు భవ్యగుణ దీపితు నున్నతు నెల్లకాలమున్
క్షేమకరుల్ సురప్రవరు లెల్లరు  శ్రీలను గూర్చుచు సద్యశంబు లీ
భూమి నొసంగు చుండి పరిపూర్ణ మనోరథు జేయ గోరెదన్ .

ఈ షష్ట్యబ్ద సమాప్తి వేళ సుకవీ! యింపారు సౌఖ్యంబు సం
తోషంబున్ విభవంబు స్వాస్థ్యము సదా తోరంపు సత్కీర్తియున్
భాషాయోష  యనుగ్రహించ సుమహద్వాక్య ప్రభావంబు స
ద్భూషల్ మీరు నిరంతరంబుగ నిలన్ పొందంగ కాంక్షించెదన్.

నవ్యంబై వెలుగొందు తేజమున నో నార్మంచి వంశాగ్రణీ!
దీవ్యద్వైభవ యుక్తమైన కృతులన్ ధీశక్తి సృష్టించుచున్
శ్రావ్యంబైన నుతిన్ గడించి బహుధాసంతోషముల్ చూచుచున్
భవ్యంబైన సుఖంబు గాంచుడు లసద్భాగ్యార్హులై యెల్లెడన్.

న్యాయమె నమ్మి బల్కుచు సదాశయ దీప్తుల నెల్లవారికిన్
శ్రేయము లందజేసెడి విశిష్టత దాల్చిన సజ్జనాగ్రణీ!
శ్రీయుత! నారుమంచి కుల శీతమయూఖ! మీకు నా
ప్యాయత నిండనాశిషము లీయగ నంబఁ గోరెదన్.

ధార్మికత్వము నిండు నార్మంచి వంశంబు
నానందమున ముంచు జ్ఞాన ధుర్య
సాహిత్య సేవలో సన్నుతుల్ నిరతంబు
గాంచు చుండిన యట్టి కవివరేణ్య
న్యాయాను సరణంబె ధ్యేయంబు గా నెంచి
భాషించు చుండెడి భాగ్యశాలి
సల్లాప రుచితోడ సన్మిత్ర కోటికి
హాయి బంచుచు నుండు హాస్యచతుర
శ్రీయుతానంత కృష్ణార్య చిరము ధరణి
నాయురారోగ్య భాగ్యంబు లందుచుండి
శుభము లన్నింట గాంచుచు సురుచిరమగు
జీవనంబిట నిలలోన చేకొనుండు.

No comments:

Post a Comment