Sunday 25 March 2018

శ్రీమతి


మా వైవాహిక జీవితం ఈరోజున 25 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నా విజయాలనే నిరంతరం కాంక్షించే నా అర్థాంగి హృదయ పరిమళాలకు పద్యరూపం.
ఉ.      
శ్రీమతియై, మదీయమగు జీవనమందున తోడు నీడయై
 క్షేమమె గోరుచున్ సతము కిమ్మన కుండగ నాదు భావనల్
నామదిలోని వందుకొని నాకిల సన్నుతి గూర్చుచుండు నే
నామె సుశీల సంపదకు హర్షము నందుదు నన్నిరీతులన్.                                  1.
చం.    
ఇరువది యైదు వత్సరము లిప్పటి కాయెను లెక్కజూచినన్
పరిణయ కాలమందు బహుభంగుల జేయు ప్రతిజ్ఞ లీయెడన్
సరియగునట్టు  లాచరణ సాధ్యము చేయుట కామె చూపు త
త్పరతను మెచ్చకుండుటయె? ధర్మపరాయణ యందు నన్నిటన్.                     2.
ఉ.      
తల్లిని దండ్రినిన్ విడిచి తద్గత చిత్తము మార్చి నాయెడన్
సల్లలితాదరంబునను సర్వము నేనె యటంచు నమ్మి తా
నెల్ల విధాల నాసుఖము నిమ్మహి గోరుచు నన్ని వేళలం
దుల్లము  సంతసించునటు లుండెడి మత్సఖి కందు హర్షముల్.                          3.
శా.     
దూరప్రాంత మటన్న భావము మదిన్ దూరంగ బోనీక నా
యూరన్ రాష్ట్రము వీడి నే నెచట నుద్యోగంబు నందున్న తా
జేరెన్ సర్వవిధాల నాకు విజయశ్శ్రీ లంద జేయంగ నా
నారీరత్నము నాత్మధర్మసతి నెన్నం జూతు ప్రాణంబుగన్.                              4.
ఉ.      
ఆయమ విజ్ఞతన్ గడిచె నద్భుత రీతిని నిర్వదైదు లీ
హాయనముల్ సుఖాస్పదము లౌచును మా శుభజీవనంబునం
దాయసమాన సద్గుణకు నారమణీయ వచోవిలాస కే
మీయగ నాకు సాధ్యమగు నీశ్వరు వేడెద సౌఖ్యసిద్ధికై.                                       5.




No comments:

Post a Comment