Sunday 25 March 2018

“టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం"


“టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం"

.   ఎల్ల జగంబునం గనగ నింతుల కెంతయు బ్రీతి పాత్రమై
        పిల్లలు పెద్ద లీరనెడి భేదము జూపక సర్వకాలమం
        దుల్లము దోచుచుండునది యుత్సవదంబుల మేటి యన్నచో
        తెల్లము 'దూరదర్శిని' యతీవ మహత్తర వస్తు విచ్చటన్.             1.

తే.గీ. దూరదర్శిని చెంతకు జేరుచుండి
         మహిళ లాబాల గోపాల మహహ యనుచు
         కాంచునట్టి  ధారావాహికల మహిమను
         బలుక దరమౌనె భువిపైన నలువ కైన.                                      2.

సీ.     విద్యార్థి సంఘాల విజ్ఞతన్ బలురీతి
                       విరువగా వెనుకంజ వేయ బోవు
        జాతిధర్మము లెన్నొ ఖ్యాతి కడ్డము లంచు
                       సూచించ భయమింత చూప బోవు
        సుదతుల సమయమ్ము ముదమునన్ నిత్యమ్ము
                       హరియించ సంకోచ మంద బోవు
        పసికందు లని చూడ కసదృశ ఘోరాలు
                       వినిపించ జూపించ వెరవ బోవు
తే.గీ. స్వపర భేదంబు లెంచక సర్వ జనుల
         మదులు దొలుచుచు నింతేని యదరకుండ
         నడతలను మార్చగల శక్తి నవ్యజగతి
         కలదు వినుడు ధారావాహికలకు జూడ.                                  3.

కం.    ధారావాహిక లున్నను
         నీరంబును దలచబోరు నిఖిల జగానన్
         కోరగ బోరిక యశనము
         లౌరా! యీకాలమందు నంతట జూడన్.                                 4

శా.    ధారావాహిక దూరదర్శినులలో తథ్యంబు లందించుచున్
         చేరన్ వచ్చెడి వారి మానసములన్ జిజ్ఞాసతో నింపుచున్
         సారోదంచిత వృత్తముం గలిగినన్ సర్వత్ర శక్తి స్థితిన్
         పౌరాళిన్ గనవచ్చు దేశమున సద్భాగ్యంబు చూడం దగున్.     5

No comments:

Post a Comment