Sunday 25 March 2018

శ్రావణ శోభ

1.   శ్రావణ శోభ

.   మాసములందు నున్నత ముమాపతి, కా లలితాంగి గౌరికిన్,
భాసుర భాగ్యదాయికి శుభప్రదయై వెలుగొందు లక్ష్మికిన్
మాసము శ్రావణంబు బహు మాన్యత గూర్చెడి దౌచు పృథ్విలో
వాసిని గాంచు చున్నయది వాస్తవ మాగతి చెప్ప శక్యమే?                 1.

సీ.           సస్యానుకూలమౌ సద్వృష్టి యీకాల
మవని కందుచునుండు ననుపమముగ
పైరుపచ్చలలోన తీరైన యందంబు
లీనేల గనిపించు నెల్ల యెడల
నీ నభోమాసాన నా నభంబున జూడ
మేఘంబు లలరించు మిక్కిలిగను
నారీ సమాజంబు కోరి సత్పూజలన్
సల్పెడి కాలంబు సంతసమున
.వె.       పచ్చ తోరణాల బాహుళ్యమున గేహ
సీమ లొప్పు చుండు క్షితిని సతము
శ్రావణంపు శోభ భావింప దరమౌనె?
యనుభవైక వేద్య మనుట నిజము.                                         2.

***





2. వరలక్ష్మీ వ్రతం
చం. వ్రతములలోన నుత్తమము వైభవ దాయక మీ వ్రతంబు స
ద్గతులను గూర్చుచుండి చిరకాల సుఖంబుల నందజేసి యీ
సతులను గాచుచుండు నిల సంతత భాగ్యదమౌచు శ్రద్ధతో
నతులిత భక్తిభావమున నా వరలక్ష్మిని గొల్చినన్ భువిన్.                           1.

కం.   వరలక్ష్మీ సద్వ్రత మిది
నిరతానందంబు నొసగు, నిరుపమ యశముల్
సురుచిర జీవన మిచ్చుచు  
ధరవారల కెల్లగతుల  ధన్యత గూర్చున్.                                             2.
***
౩.  శ్రావణ పౌర్ణమి
మ.   ద్విజ బృందంబులు యజ్ఞసూత్ర మవనిన్ వేదప్రమాణంబు గా
నిజ శక్తిన్ వికసింపజేయుటకునై నిష్ఠాత్ములై దాల్తు రా
యజినోత్సర్జన జేయు పౌర్ణమి యిదే  హర్షాతిరేకంబునన్
త్రిజగంబుల్ పులకించు కాలమిదియే దీప్తి ప్రదం బిద్దియే.                           1.

ఉ.    శ్రావణ మాస పౌర్ణమిని సంతస మందుచు సోదరీమణుల్
భావనలోన రక్షణపు బాధ్యత కన్పడు రీతి నెప్పుడున్
గావు మటంచు గట్టుదురు కాంక్షను దెల్పుచు సూత్రరాజ మా
చేవను జూపు సోదరుల చేతికి నందరు మెచ్చునట్లుగన్.                            2.
***

4.  కృష్ణాష్టమి

కం.   శ్రీ కృష్ణాష్టమి రోజున
శోకాతురులైన గాని శుభకర మగుటన్
చీకాకులు స్మరియించక
చేకొను మోదేవ యనుచు చేతురు ప్రణతుల్.                                        1.

సీ.    భక్త జనములెల్ల  బహువిధంబైనట్టి
పూజలీ దినమందు పూర్ణభక్తి
చేయుచు నుందు  రా చిలిపికృష్ణుని లీల
లత్యంత హర్షాన ననుపమముగ
స్మరియింతు రీవేళ సన్మానముగ నెంచి
యుట్టి గొట్టుట లోన నుత్సహించి
తరతమ భేదాల నరయకుండగ నంద
రతులితా నందంబు నందు కొనరె
తే.గీ. వృద్ధ జనములు సైతము విస్తృత మగు
భక్తియుతు లౌచు  నీదివ్య పర్వమందు
జగములను గాచు కృష్ణుని మగటిమి నిల
బాడు చుందురు తన్మయ భావులగుచు.                                             2.

***




5.  అతివల ఆనందాలు.

కం.   అతివల యానందంబులు
జతకాండ్రును తూచలేరు శ్రావణ మందున్
క్షితిపయి నన్నిట తామై
యతులిత తేజంబు దాల్తు  రంగనలు భళా!                                                 1.

సీ.    శ్రావణంబున నింక సంతోష జలధిలో
నోలలాడగ వచ్చు మేలు మేలు
మాతల్లి గౌరమ్మ యాతల్లి వరలక్ష్మి
మాయింటి కయి వత్తు రోయి వినరె
పేరంటమున రండు పేరుపేరున మిమ్ము
పిలుచుచుంటిని నేడు విజ్ఞలార
పట్నాన నచ్చోట పట్టుచీరల బారు
లొప్పిదంబుగ నెన్న నున్న వౌర!
ఆ.వె. ఆదుకాణ మందు మోదంబు గూర్చెడి
హార తతులు గలవు చేర రండు
చెలియ లార! యనుచు నలఘు హర్షము జూపు
చుండు సమయ మిదియె యువిదలకును.                                          2.
***

No comments:

Post a Comment