Sunday 25 March 2018

గురుస్మరణ


గురుస్మరణ
ఆ.వె.
సతము పద్యబోధ చక్కంగ జేయుచు
తెలుగు భాష నంద  నలఘు వాంఛ
నాడు పెంచి యుండె నాపితృ దేవుండు
పాఠశాల కేగ వలయు ననుచు

ఆ.వె.
బాల్య మందు జూడ బడిలోన చింతల
పాటి వంశజుండు బహుళ యశుడు
శర్మవర్యగురుడు శ్రద్ధ యీ భాషపై
కలుగు నట్లు చేసె ఘనతరముగ.
ఉ.
ధీయుతుడై వెలుంగుచును, దివ్యవచోవిభవంబు చేత

త్యాయత సద్యశంబులిల నందిన మద్గురుదేవు నార్యునిన్
శ్రీయుతు విజ్ఞసత్తముని శిష్యశుభంకరు ముళ్ళపూడి నా
రాయణశాస్త్రి వర్యుని దలంచెద నాపయి వేంకటేశ్వరా


మ.
వరమౌ ఛందము, దానిలోని రకముల్ , వాక్యాలనుం గూర్చ వ్యా
కరణంబున్, వివిధంబులైన ఫణుతుల్, కావ్యంబులున్ నిచ్చలున్
సరళం బౌవిధి నేర్పియుండె ఘను డాచార్యుండు రేపల్లెలో
ధరణిన్ సద్యశ మందియున్న జయసీతారామ వర్యుండికన్.
మ.
నిలయుండై బహుకావ్యసారములకున్ నిష్ణాతుడై యన్నిటన్

సులభంబౌనటు లాత్మఛాత్రతతికిన్ శోభిల్లు ప్రేమంబుతో
నలఘుజ్ఞానము పంచినట్టి ఘనునిన్ హర్షాతిరేకంబుతో
దలతున్ నిత్యము ముళ్ళపూడి జయసీతారామ శాస్త్రిన్ గురున్. 


ఆ.వె.
నతులు వీరి కిడుచు నానా రకంబుగా
జ్ఞాన బోధ చేయు మానితులగు
గురుగణంబు దలచి కొలిచెద హితులార!
వినయ మూని సతత మనఘులార!


No comments:

Post a Comment