Sunday 25 March 2018

వివాహ వ్యవస్థ


నేటి సమాజంలో విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ సంతానంపై దాని ప్రభావం.

చం. మనుజుని యాశ్రమంబులను మాన్యత నందినదౌ గృహస్థ జీ
వనమున కాదియై పరమపావనబంధము గూర్చి సంమం
దనయము గౌరవం బొసగు నట్టి వివాహము లోక మందునన్
నతర హర్షసంయుత సుఖప్రద మన్నిట నెంచి చూచినన్.                         ౧.

సీ.     వర్తమానములోని వైవాహికములందు
నాడంబరము లెందు నధిక మయ్యె
గార్హస్థ్య శబ్దాని కర్హమౌ వ్యుత్పత్తి
యిసుమంత యేరీతి పొసగ దయ్యె
విత్త మార్జన చేయు విస్తృతం బగు వాంఛ
కడు తీవ్రమై యిందు గాన నయ్యె
జన్మంబు నుండియే సంతానమును సాకు
యోగ్యావకాశంబు మృగ్య మయ్యె
ఆ.వె.         తల్లి తండ్రి యౌచు తగురీతి సంస్కృతుల్
నేర్ప లేమి గతులు కూర్ప లేమి
చేత నాత్మసుతుల చేతంబు లలరింప
దగని వార లైరి దంపతు లిల.                                                        ౨.

మ.   క్షణికావేశము చేత నాలుమగ లేకాలంబు స్వాంతంబులో
యణుమాత్రంబిది యుక్తమా యనక సాహంభావులై బంధమున్
తృణతుల్యంబుగ ద్రుంచు చుండిరి కటా దివ్యంబుగా వెల్గు స
ద్గుణ మేరీతిని వారి బిడ్డల కిలం గూడున్ సమానంబుగన్.                     ౩.

సీ.     తమ కళ్ళ సాక్షిగా తల్లి దండ్రులు చూడ
జగడ మాడుచు నుండ సర్వ గతుల
విశ్వాస రహితతన్ విజ్ఞత గోల్పోయి  
సమరస భావంబు సన్నగిల్ల 
పురుషార్థములలోన నిరతంబు నొండొరుల్
తోడుండు ప్రతినను వీడు చుండ
సంతాన మేవిధిన్  సత్పాత్రతం గాంచు?
పూజ్యత్వ మేరీతి పొంద గలుగు?
తే.గీ. సవ్య జీవన మార్గంబు నవ్య గతుల
ఖ్యాతి నందెడి పద్ధతుల్ క్రమత నెపుడు
ప్రజకు చూపించ వలసిన బాధ్య తలను
తలచ వలవదె యిలలోన దంపతులకు?                                           ౪.

కం.   వైవాహిక బంధంబును
భావింపగ వలయు నతులభాగ్య మటంచున్
శ్రీ వైభవ సంస్కృతులను
జీవనమున సంతు కెపుడు చేర్చగ వలయున్.                                    ౫.

No comments:

Post a Comment