Sunday 25 March 2018

“భారతరాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ"


“భారతరాజ్యాంగము - అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ"

శా.     ఈ విశ్వంబున నెల్లకాలములలో నెంతేని సత్కీర్తికిన్
          తావై వెల్గెడి యోగ్యతల్ గలది, విద్వత్సంఘపూజ్యంబు,
          ద్భావాన్వీతము,  భారతీయఛవియై భాసిల్లు రాజ్యాంగ మిం
          దావిర్భావము నొందియున్నది సతం బానందముం బంచగన్.       1.

శా.      ఈ రాజ్యాంగమునందు సంఘమునకై యెన్నేని స్వేచ్ఛల్ భళా
           పౌరుల్ హర్షము గాంచు  రీతి కల వవ్వానిన్ సదా తృప్తితో
           వారల్ వీర లటన్న భేద మిచటన్ పాటించకే చూతు రౌ
           తా రీదేశజనాళి సంతసములన్ దర్శింతు రెల్లప్పుడున్.               2.

.      తమభావంబుల నెల్లరున్ దెలుపగా, తథ్యంబులం జూపగా,
           క్రమతన్  సర్వుల వాక్ప్రవాహములనున్ ఖండింపగా స్వేచ్ఛ యీ
           సమతానిర్మితభారతావనిపయిన్ సర్వత్ర కాన్పించు నే
           డమలోదాత్తయశఃప్రభావయుత రాజ్యాంగంబు లిందుండుటన్.   3.

కం.      స్వీయాభిప్రాయములను
           హాయిగ బ్రకటించవచ్చు నందరు స్వేచ్ఛన్
           న్యాయం బిది రాజ్యాంగపు
           ధ్యేయం బిది భారతాన తెల్లము చూడన్.                                   4.

సీ.        స్వేచ్ఛ యున్నది గదా చెప్పెద నేదైన,
                             ఖండింతు సద్యోగకర్మములను,
            స్వేచ్ఛ యున్నది గదా క్షేమంబులం గూర్చు
                             భావజాలంబును బరిహరింతు,
            స్వేచ్ఛ యున్నది గదా చేయూతయై నిల్చు
                             వాక్యసంపత్తులన్ వరుస గూల్తు,
            స్వేచ్ఛ యున్నది గదా శ్రేయంబు లందించు
                             సద్బోధలను గోరి సంహరింతు
తే.గీ.     ననెడి యాలోచనంబుల నంది యుండి
             స్వేచ్ఛ గలదంచు బలుకుట జీవనమున
             హాని కలిగించు నిత్యమ్ము మానవునకు
             తగదు సత్యమ్ము సర్వత్ర ధరణిలోన.                                        5.

No comments:

Post a Comment