Sunday 25 March 2018

వృద్ధాప్యం - కష్ట సుఖాలు


వృద్ధాప్యం - కష్ట సుఖాలు
చం.
ముసలి తనంబు మానవుల మోక్ష పథంబు, నిరంతరంబుగా
నసదృశ భావనాబలము నందగ జేయుచు, స్థైర్య ధైర్యముల్
వెస గలిగించి శ్రేష్ఠమగు విజ్ఞత గూర్చెడి చోటు, చూచినన్
లస దనురాగ మెల్లగతులన్ ప్రసరింపగ జేయు తా విలన్.             1.

.వె.
సంఘమందు జూడ సర్వోత్తమం బైన
గౌరవంబు సతము చూర గొనగ
యోగ్య మౌచు, బహుళ భాగ్యంబు లనుదినం
బరయ దగిన ఠావు జర యనంగ.                                             2.

సీ.
వృద్ధాప్యమున నేడు విశ్వ మంతట జూడ
కష్టాల పర్వంబె కాన నగును,
తల్లిదండ్రుల పట్ల యెల్లవారలలోన
సన్నగిల్లెను ప్రేమ మెన్నగాను,
విత్తార్జనంబుచే విర్రవీగుచు నుండి
జన్మదాతల నైన సాకకుండ
తమ ననాథల నట్లు త్యజియించుచుండుటన్
బ్రతుకు భారం బౌచు బహుళ గతుల
తే.గీ.
కుందుచుండెడి వృద్ధుల చంద మకట!
మాట కందదు, సత్యంబు, మమత లేక
పెద్ద వారల నీరీతి విడుచు టెల్ల
క్షేమకర మౌనె జనులకు తామసులకు?                                     3.

కం.
శారీరిక రుగ్మతలకు
భారము లైనట్టి హృదయ బాధలు గూడన్
ధారుణిలో వృద్ధాప్యము
మారెను శాపంబు పగిది మానవు లందున్.                               4.

శా.
తా మీమానవ జన్మ మందుటకునై  తారే గదా కారకుల్
భూమిన్ వారల రక్షణంబు తమకున్ ముఖ్యంబు, కర్తవ్య మన్
నీమం బంది చరించగా వలె జనుల్ నిత్యంబు శ్రద్ధాఢ్యులై
దాముం బొందెద మీయవస్థనను నా తథ్యంబు గాంచన్వలెన్.    5.

No comments:

Post a Comment