Sunday 25 March 2018

జీవనాధారమైన జలవనరుల సద్వినియోగం


జీవనాధారమైన జలవనరుల సద్వినియోగం

కం.    జలమే జీవన మిలలో
జలహీనంబైన బ్రతుకు స్వప్నంబందున్
నిలుచుట శక్యం బగునా
తలచగవలె విజ్ఞులార! తద్గత బుద్ధిన్.                                                       .

తే.గీ.   నదుల యందున మలినాలు వదలకుండ
పదిలమౌ రీతి నవ్వాని నదను జూచి
రక్ష సేయుట భావ్యంబు ప్రజల కెపుడు
దాన లభియించు సౌఖ్యంబు మాన మిలను.                                              .

సీ.      పరమేశ్వరుడు కోరి ధరవారి కందించు
వర్షంపు సలిలంబు హర్షమొప్ప
నింకుడు గుంటలం దెల్లవారలు నిల్పి
భూగర్భ జలనిధిన్ పొందవలయు,
ఒకదాని నొకటితో సకలాపగల జేర్చి
పానీయ మంతట బడయవలయు
ఆవశ్యకములైన యానకట్టలు కట్టి
పంటచేలకు నీరు పంచవలయు
.వె. పొదుపు చేయవలయు ముదమార జలకంబు
వలసినంత కొనుచు వసుధపైన
స్వార్థబుద్ధి వీడి సౌభ్రాతృభావాన
భావి నెంచవలయు బహుళగతుల.                                                         .

చం.    జలమది ధాత్రిలో మనెడు సర్వవిధంబగు ప్రాణికోటికిన్
బలమును గూర్చు,  పెంచు, బహుభంగుల రక్షణ సేయుచున్ ముదం
బలరగ జూచుచుండు,  మరియాదను మీరక మానవాళి యా
యలఘు సుఖప్రదాత నెపు డాదరమొప్పగ గావగా వలెన్.                          .

శా.     ఈకాలంబున జాగరూకులయి తా మీనేల వర్తిల్లినన్
చీకాకుల్ కలుగంగ నీక ననఘుల్! చేతంబు హర్షించగా
నేకాలంబును గాచుచుండును గదా యింపారగా నీర మో
శ్రీకారుణ్యపయోనిధుల్! వినవలెన్ జేజేల నందన్వలెన్.                             .

No comments:

Post a Comment