Sunday 25 March 2018

స్వాతంత్ర్య దిన సప్తతి


స్వాతంత్ర్య దిన సప్తతి
ఉ.    వన్నెలు మూడు గల్గి బహు వైభవయుక్తము గాగ నింగిలో
సన్నుతి నందుచున్ వెలుగు సద్ధ్వజ మల్లదె దాని ముందటన్
పిన్నలు పెద్ద లీరనెడి భేదము జూపక మ్రొక్కుచుండి రే
తన్నికటంబు జేరుడు స్వతంత్రత కబ్దము లయ్యె సప్తతుల్.                 1.

మ.   తమప్రాణంబులు లెక్క చేయక మహత్త్యాగంబుతో నెందరో
నమరత్వంబును గాంచ భారతభువిన్ హర్షంబు వ్యాపించె నా
శ్రమ నన్నింట స్మరించి పౌరజన మీ స్వాతంత్ర్య సౌభాగ్యమున్
క్షమతం జూపుచు కావగా వలయు నేకాలంబు నిష్ఠాత్ములై.                  2.

ఉ.    సప్తతి వర్షముల్ గడిచె సర్వవిధంబుల స్వేచ్ఛతో నిటన్
ప్రాప్త సుఖాల ప్రాభవము భారత భూమిని చూడ రండు దు
ర్వ్యాప్తము లయ్యె దౌష్ట్యము లవారితమై యవినీతి యెల్లెడన్
దీప్తిని బొంది యున్నయది తేజము గూల్చుచు నుండి నిచ్చలున్.          ౩.

శా.   అర్థంబుల్, భవనాది వస్తు సముదాయంబుల్, మహద్భాగ్యముల్, 
తీర్థానీకము జేరి పొందు మహిమల్, ధీశక్తు లర్పించుటల్
వ్యర్థాలాపము లాడుటల్ వలవ దావంతైన నేడిచ్చటన్
స్వార్థత్యాగము సుంత చేసినను నీ స్వాతంత్ర్య ముప్పొంగెడిన్.               4.

శా.   నాదేశం బిది నేను పౌరుడ నిటన్ నా కౌను కర్తవ్య మీ
వేదస్తుత్య పవిత్ర భారతి కిలన్ విశ్వాగ్ర భాగంబునన్
మోదం బందరి కందజేయు పగిదిన్ ముఖ్యత్వముం గూర్చుటల్
రాదీభాగ్య మికేరి కంచు జను లీ రాజ్యాన నుండన్వలెన్.                      5.

No comments:

Post a Comment