Sunday 25 March 2018

తొలకరి చినుకులు - రైతుల తలపులు.


తొలకరి చినుకులు - రైతుల తలపులు.

కం.
తొలకరి చినుకది రైతుల
కలఘు సుఖంబులను జూపి యరుసము బంచున్.
తలపులలో నవచేతన
కలిగించుచు నుండు నెల్లకాలము పుడమిన్.                                         1.

సీ.
తొలివాన గురియంగ నిలువెల్ల బులకించి
నాట్యంబు చేయు నీ నరుడు భువిని,
హలము చేతను బట్టి పొలము దున్నిన మీద
సేద్యాన యోచనల్  సేయుచుండు,
నీ నేల నీధాన్య మిందు నీ సస్యంబు
పండింతు నని యెంచు బహుళ గతుల,
నిరుటి పంటల కంటె నిష్ఠతో నీయేట
నధిక మందెడు నట్టి విధము వెదుకు,
.వె.
క్షేత్ర రక్షణార్థ మాత్రంబునుం బూని
పలు రకంబు లైన పద్ధతులను
తెలియ గోరుచుండు కలలోన నైనను
తలచ డన్య మొండు తొలకరి గని.                                                       2.

చం.
తొలకరి యయ్యె నీయెడల తోరపు హర్షము గల్గె నింక నా
యలసట దీరనున్నయది యప్పుల బాధలు తీరిపోయి నే
దలచిన యర్థ మబ్బు నిది తథ్యము చక్కగ పంట పండ నీ
యిలపయి తృప్తి గల్గునని యెంచు గృషీవలు డాత్మలో దగన్.               3.

చం.
తలచినవారి నాదుకొను తండ్రివి శంకర! యెల్లవేళలన్
గొలిచెద నిన్ను నాపయిని గూర్మిని జూపుచు సేద్యమందునన్
వలసిన రీతి శక్తి నిడి పైరుల రక్షణ చేయుమంచు నీ
తొలకరి జూచి కర్షకుడు స్తోత్రము చేయగ నెంచు దేవునిన్.                  4.

తే.గీ.
ఇట్లు తొలకరి చినుకుల కెంతయేని
సంతసించుచు నాశతో సన్మతి యయి
భావి నెంచెడి కృషకుని వాంఛ లిలను
దేవదేవుడు కరుణతో దీర్చు గాత.                                                     5.


No comments:

Post a Comment