Sunday 25 March 2018

విలంబి ఉగాది


శ్రీరామ
శ్రీ వి లం బి కి స్వా గ త ము
(ఉత్పలమాలలు)
శ్రీ లను బంచుచుండి సుఖసిద్ధులు గూర్చుచు నీ జగంబులో
     మేలగు భావసంపదలు మేరలు మీర యొసంగుచుండి కా
     కోలమునైన సుందరముగా రచియించెడి శక్తి నిచ్చి యే
     కాలము హర్ష మిచ్చుచు శుభప్రదయౌచు "విలంబి"యుండెడిన్.                   1.
వి శ్వమునందు నెల్లెడల విస్తృతరీతిని శాంతి గూర్చుచున్
     శాశ్వతమైన కీర్తులు వశంబగునట్లుగ జూచుచుండి స
     ప్తాశ్వుని భంగి భూజనుల దైన్యము గూల్చి మహత్వ దీప్తితో
     నశ్వరమైన జీవికకు నవ్యవిభూతి "విలంబి" గూర్చుతన్.                              2.
లంపటముల్ జగంబున పలాయనమంత్రము నందగావలెన్
     కొంపలు ముంచు కామనలు గూలుచు స్వార్థభావమున్
     ద్రెంపగ మానవత్వమిల తేకువ గాంచుచు సాగగా వలెన్
     సంపద లీ "విలంబి" ననిశంబును లోకుల కందగా వలెన్.                             3.
బిట్టగు దైన్యపీడితులు, పేద లనాథలు, భాగ్యహీనులున్,
     కట్టలు కట్టలై కలుగు కష్టములన్ బడియున్న వారలున్,
     పట్టెడు కూటికోస మనివార్యపు త్రాసము నందు వార లీ
     పట్టున నీ "విలంబి"నవవర్షమునన్ సుఖమందగా వలెన్.                               4.
కి మ్మనకుండ సంమున క్షేమము గూర్చగ జూచువారలున్,
     నమ్మిన వారికై తమ మనంబున స్థానము నిచ్చి సాయముల్
     కొమ్మని చేయువారలును, కూర్మిని బంచుచు బల్కువారలున్
     నెమ్మది నీ "విలంబి"నిట నిత్య ముదంబుల నందగావలెన్.                           ౫.
స్వాగతమో "విలంబి"! నవవర్షమ! యీ జగమందు నేడు నీ
     యాగమనాన పెల్లుబికె హర్షము, లోకుల మానసంబులన్
     రాగమయంబు చేయవలె రమ్యసువర్తనగంధ మీయెడన్
     యోగముగాగ జేరవలె నున్నతి యన్నిట గూడగావలెన్.                              6.
ట్టి ప్రయత్నముల్ జరిగి కర్మములన్ సుఫలంబు లందుచున్
     పట్టినదెల్ల స్వర్ణమగు పావన శక్తులు కూడగావలెన్
     పుట్టిన భూమిపై మమత భూజనులందున పొంగగావలెన్
     పెట్టినవారి కందవలె విస్తృతవైభవ మీ "విలంబి"లోన్.                                  7.
న్మయులై జగజ్జనులు ధర్మము నందు చరించుచుండి వి
     ద్వన్మణులైన వారల సుధామధురోక్తుల నందుచున్ భువిన్
     సన్మతులై వెలుంగు నశక్తుల నీయ "విలంబి" దానితో
     సన్ముని తుల్యులైన జనసంము జేరి నుతించగావలెన్.                             8.
ముచ్చట గొల్పు భావములు, మోదభరంబగు చిత్తదీప్తియున్,
     సచ్చరితల్, సమాజహిత సన్నుత కర్మల నాచరించుటల్,
     మచ్చరికంబు లేక జనమానసముల్ ముదమందు నట్లుగా
     నిచ్చలు పల్కరించుటలు, నేడు "విలంబి"ని నందగావలెన్.                          9.

అందరికి శ్రీ విలంబి నామ సంవత్సర ఉగాది సందర్భముగా
హృదయపూర్వక శుభాకాంక్షలు
హ.వేం.స.నా.మూర్తి

No comments:

Post a Comment