Friday 22 December 2017

వృక్షము

వృక్షము
(ఆట వెలదులు)
తనను జేరు వారి కనుపమంబగురీతి
ఛాయ నొసగు గాచు సర్వగతుల
సత్య మవనిలోన బ్రత్యక్షదైవమ్ము
వృక్ష మనగ  లోకరక్షితంబు.

తనకు జలము లొసగ తన్మయత్వం బంది
మనుజకోటి కిలను నతరముగ
సేవ చేయు, స్వీయ జీవనం బర్పించు
తరువు చరిత మరయ సురుచిరంబు.

బాటసారులార! భాగ్యజీవనులార!
సేద దీర రండు మోద మలర
ననుచు బిలుచుచుండు నాదరంబున నిత్య
మవని తరువు బంధు వందరకును.

తనను రాళ్ళతోడ తాడించు చుండిన
నాయుధంబు లూని యార్తి నంద
నరుకుచున్న గాని నరునకు సౌఖ్యంబు
గూర్చు గాని వ్యథలు చేర్చబోదు.

జనన మందు వేళ, మనుజుడై యిలలోన
సంచరించునట్టి సమయమందు,
నంత్యమందు జూడ నన్ని కాలములందు
నరున కాప్తమిత్ర మరయ తరువు.

హితము గోరు, జనున కతులితం బైనట్టి
భాగ్య మొసగు సతము బహుళ గతుల,
హాని చేయ గోర దేనాడునుం గాని
వృక్ష మిలను లోక రక్షితమయి.

ఆకు పూలు కాయ లత్యంత మధురమౌ
ఫలము లొక్కటేల వరుస జూడ
నవనివారి కోస  మాపాద మస్తకం
బర్పణంబు చేయు నౌను తరువు.

పరుల సేవ లోని పరమార్థ మెరిగిన
ధన్య వృక్ష మనుట తథ్యము గద
యింత చెప్ప నేల యెంచ నిద్దానితో

పోల గలది యొండు భూమి గలదె . 

No comments:

Post a Comment