Sunday 25 March 2018

ప్రబోధము


ప్రబోధము

చం.
పలుకులలోన మార్దవము భావమునందున నిర్మలత్వమున్
కలుగువిధాన కర్మలను గౌరవమందెడు రీతి చేసి నీ
విలపయి తోటివారలకు నింపగు ప్రేమను బంచ బూన నీ
కలఘు సుఖంబు లెల్లెడల నందుట తథ్యము నమ్ము మానవా!
చం.
భువిపయి జన్మమందుతరి భోగము లియ్యవి తెచ్చు కొంటివా
దివికడ కేగబోవునెడ తీసుక పోదువె వెంట వీటి నీ
యవనిని నంది నావియని బల్కెద విచ్చట శాశ్వతుండవా
భవమును తుచ్ఛకామనల వ్యర్థము చేతు వదేల  మానవా!
చం.
నిరతము స్వార్థ చింతనము నిష్ఠగ జేతు వొకప్పు డైన నీ
వరుసముతోడ సంమున నన్నిట వంచితులైన వారికిన్
సరసుడవౌచు నెన్నదగు సత్కృతి చేయుట కించు కేనియున్
స్థిరమతి నెంచబోవకట! చెల్లునె యీగతి(నీకు) జేయ మానవా!
చం.
ధరపయి గల్గు సంపదలు తావక సౌఖ్యము గోరు చుండగా
సురుచిర భావమూని యనసూయుడవై సతతంబు వాటినిన్
పరులకొకింత పంచుటయు బాపమటంచును నెంచు చుందు వీ
వరయగ స్వర్గధామమున నందునె సంతస  మెల్ల మానవా!
చం.
కులమత భేదముల్భువిని కూడ దటంచునుసర్వకాలమున్
పలికెద వెల్ల వేదికల భావము నందున మానవాళిలో
నిలపయి తారతమ్యముల నెంచుచు నుందువు నీకు నీగతిన్
దలచుట క్షేమదాయకము కాదని చూడవదేల మానవా!




No comments:

Post a Comment