Sunday 25 March 2018

సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యం


సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యం
ఉ.    “సన్నుతి కర్హమై వెలుగు జన్మము నందితి భారతంబునం,
దున్నత సంస్కృతిన్ బడసి యుంటిని పూర్వభవంబు లందు నే
నెన్నియొ సత్కృతుల్ ధరణి నింపుగ జేసిన కారణంబునన్”
మన్నిక నాకొసంగెడు సమాజ హితం  బిట నాకు కార్యమౌ.                  1.

సీ.           స్వార్థభావంబుతో సర్వత్ర జగతిలో
సంచరించుచు నుండు జనుల గతులు,
కులమత భేదాల నిలలోన సృష్టించు
దుర్మదాంధులలోని దుష్టమతులు,
అధికార దాహాన నఘమున కొడిగట్టు
పాలక సంఘాల వర్తనములు,
ఆశింప దగనట్టి నాశనంబుల కెందు
కర్తలౌవారల నర్తనములు,
ఆ.వె.        ఉగ్ర వాద మనెడి యున్మాదమును దాల్చు
వారి భావ మెల్ల వారి కెరుక
పరచి యాదు కొనుట భావ్యమౌ కర్తవ్య
మగును నాకు సత్య మనిశ మిలను.                                   2.

శా.   వేదోక్తం బగు స్వచ్ఛభావనముతో విజ్ఞాన సంపూర్ణయై
మోదం బెల్ల జగాన బంచు భువిలో మున్యుక్త మార్గంబునన్
వాదం బింతయు లేని మైత్రి యికపై పాటించు నట్లాడుచున్
నేదంపూర్వ యశంబు గూర్చుటయె నా నిత్యోక్త కర్తవ్యమౌ.                  3.

శా.   శ్రేయం బెల్ల విధాల సంఘమునకున్ క్షేమంకరం బెంచగా
న్యాయం బైనది  “స్వచ్ఛతోద్యమ”మనన్   నమ్మందగు న్నిష్ఠతో  
“స్వీయారోగ్యమె భాగ్యమై వెలిగెడిన్” శ్రీలందు నద్దానినే
ధ్యేయం బంచు గ్రహింతు గూర్తు నికపై  దీప్తిన్ సమాజంబునన్.             4.

సీ.           అంధ విశ్వాసాల నామూలముగ గూల్చి
సమసమాజమునందు సద్ధితంబు
వెలుగొంద జేయంగ వీలైన యత్నంబు
చేయగా దగునెందు నీయుగాన,
నవినీతి భూతంబు నంతమొందగ జేయు
పనియౌను హితకార్య మనయ మిలను, 
సౌభ్రాతృభావాన సంఘ మందున నిత్య
సంచార మదియుక్త మంచితముగ,
తే.గీ.        నాదు కర్తవ్య మిదియంచు నమ్ముచుండి
నడచు కొనుచుండి శుభములీ నవ్య జగతి
నఖిల జనులకు నెల్లెడ నందు నట్లు
దీక్ష బూనెద నిత్యంబు దీప్త మతిని.                             5.

No comments:

Post a Comment