Sunday 25 March 2018

ప్రజ-పద్యం ప్రశంస


ప్రజ-పద్యం
ప్రశంస

మ.   ప్రజకున్ బద్యపు సౌరభంబుల గతుల్ పంచంగ నశ్రాంతమున్
ప్రజపద్యం బను సంస్థ తెన్గు భువిపై ప్రాదుర్భ వించెన్ స్వ సం
జ మైనట్టి సమస్త సంగతులకున్ కావ్యత్వముం గూర్చి  ది
గ్విజయంబౌ స్పృహనున్ హృదంతరములో వేగంబుగా నింపగన్.                        1.

మ.   ఇది పట్వర్ధను  భావనా మహిమయో, యింపారు వాక్యంబులన్
ముద మందించు ననంతకృ ష్ణ ను సమ్మోదప్రభావంబొ, యా
సదయుండౌ గణపత్యశే ష  కృషికిన్ సవ్యానురూపంబొ మా
మదులన్ నిల్చె ప్రజాఖ్య పద్యమగుచున్   మాన్యత్వముం గూర్చుచున్.      2.

కం.   ముఖ పుస్తక సంస్థితమై
సుఖదీప్తికి నిలయమైన సుందర కవితా
మఖమున యశమను భూధర
శిఖరంబుల కవుల నెల్ల చేర్చుట కొరకై .                                                    3.

ఆ.వె.         కంకణంబు గట్టి సంకోచ మొక్కింత
చూప వలదటంచు సుందర మగు
పద్యరచన చేయ వర్ధిష్ణులై యొప్పు
కవుల చేర దీయు నతరముగ.                                                             4.

కం.   నిరతము సామాజికభవ
వర యంశంబులను కొన్ని వస్తువులనుగా
స్థిరతం దెలుపుటలో త
త్పరతను దా జూపుచుండు తడయక నెపుడున్.                                        5.

ఉ.     పచ్చని పద్యమున్ కవులు, పండిత వర్యులు రండు నేడిటన్
మెచ్చుచు సభ్యబృందమున మీదగు భావ పరంపరావళిన్
నిచ్చలు బంచుచుండు డని నిష్ఠను బల్కుచు నుండునట్టి యీ
యచ్చపు సాహితీ సమితి యన్నిట మన్నన కర్హమీ భువిన్.                           6.


శా.    ప్రారంభించిన నాటినుండి సతమున్ పట్వర్ధనార్యుండిటన్
బేరుంబేరున సభ్య బృందమునకున్ విస్తారమౌ స్నేహమున్
చేరం బిల్చుచునుండి పంచుచు సదా చేయూతయై నిల్చుచున్
సారోదంచిత సత్కవిత్వ రచనా సౌలభ్యముం జూపు తాన్.                                  7.

ఉ.     శ్రీమ దనంత కృష్ణ కవిశేఖరు డెల్లెడ దీని గాచుచున్
నీమము దప్పకుండగను నిత్యము సత్కవు లిందు పద్యముల్
క్షేమకరంబులౌ పగిది క్షిప్రగతిన్ రచియించు మార్గముల్
ప్రేమము రంగరించి పలురీతుల బల్కుచు నుండు నిచ్చటన్.                               8.

చ.    గణపతి వర్యుడీ సమితి కార్యములందున మార్గదర్శియై
ప్రణతుల కర్హుడై నిలిచి పావనమై వెలుగొందు భావనల్
గణుతిని గాంచురీతి కలకాలము నిల్చెడి పద్యరత్నముల్
క్షణమున గూర్చుచున్ కవుల శక్తిని బెంచుచు నుండు నిచ్చలున్.                          9.

కం.   ప్రజ పద్యం బీ ముగ్గుర
కజరామరమైన కీర్తి నందించు మహిన్
విజయ పథంబున కవులను
నిజ మిక నడిపించు గాత నిరుపమ మగుచున్.                                         10.

No comments:

Post a Comment