Sunday 25 March 2018

అవినీతి – నిర్మూలన


అవినీతి నిర్మూలన

కం.    ఇందుగల దందు లేదను
సందేహము లేదు నేడు సర్వజగానన్
మందిరము గట్టుకొన్నది
యందర నవినీతి భూత మతికర్కశయై.                                          1.

కం.    అవినీతియె పెనురుగ్మత
అవినీతియె దుష్టశక్తి యభివృద్ధి కి యీ
యవినీతియె యవరోధం
బవినీతిని నాపుటన్న నతి కష్టంబా?                                                          2.

సీ.      స్వార్ధంబు విడనాడి సన్మార్గ మందున
పయనించు కాంక్షతో ప్రతిన బూన
సోదరత్వపు భావ మాదరంబుగ స్వీయ
చిత్తమందున జనుల్ చేర్చుకొన్న
నత్యాశలకు బోక యందిన దానితో
సంతృప్తి నెపుడందు స్వాంతమున్న
పరహిత కాంక్షులై నరులెల్ల రనిశంబు
సత్కార్య ములవైపు సాగుచున్న 
ఆ.వె.  విశ్వమంత నేడు విస్తృత రూపాన
నలమి యుండి జనుల నన్ని గతుల
నణగ ద్రొక్కు చున్న యవినీతి భూతంబు
సంహ రించు టిల నసాధ్య మగునె?                                                         3.

కం.    కదలండో జనులారా!
సదమల హృదయాన నేడె సద్యత్నముతో
ముదమందుచు నవినీతిని
నదలించి ధరిత్రి గాచి యందగ సుఖముల్.                                               4.


No comments:

Post a Comment