Sunday 25 March 2018

ఉత్పలమాలిక (ప్రజ-పద్యం)


ఉత్పలమాలిక
(ప్రజ-పద్యం)

ఉత్పలమాల వ్రాయుటకు నున్నత భావము లెంచుచుండగా
హృత్పద మందు జేరిన మహేశ్వరు డూర్జితభాగ్యదాత యా
సత్పదదాయకాగ్రగుడు శర్వు డమేయ దయామయుండు సం
పత్పరితోష కారకుడు బాగని దీవన లందజేయ నా
చిత్పవనాధినాయకుని శ్రేష్ఠగుణప్రదు నాశుతోషునిన్
త్వత్పదసేవ చేయదగు భక్తిని నిత్యము నాకొసంగి దీ
వ్యత్పదజాల సంపదలు భావపరీమళమిచ్చి గావుమా
సత్పరిపాలకా! యనిన శంకరు డంతట నోయి ముందుగా
త్వత్పితరుల్ త్వదీయ భవ దాతలు నేర్పిన ధర్మపద్ధతిన్
తత్పరభావ మూని వసుధాస్థలిలోన చరించుచుండి జీ
వత్పరిణామదాయినికి పల్కుము సన్నుతి దేశమాతకున్
మత్పరమప్రియా! యని యుమాపతి యన్నను దాన నేడు నే
నుత్పల మాలికన్ నుడువు చుంటిని భారత దేశమాత! ప్రాం
చత్పురశోభితా! బహుళ సౌఖ్య సమంచిత! వేదపూర్ణ! చం
చత్పికపాదపప్రథిత! సర్వమతాస్పద! నీకు దండముల్
త్వత్పదధూళిలో జనులు ధన్యత గాంతురు సంతతంబుగన్.

No comments:

Post a Comment